విద్యుత్ శాఖకు రూ.3 కోట్ల బకాయిలు | Rupes 3 crores arrears power department | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖకు రూ.3 కోట్ల బకాయిలు

Published Fri, Nov 29 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

Rupes 3 crores arrears power department

 తాడిపత్రి, న్యూస్‌లైన్ : జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకానికి మళ్లీ గ్రహణం పట్టుకుంది. ఈ పథకం ద్వారా ఏ ఒక్క గ్రామం గొంతు తడపలేకపోతున్నారు. గండికోట రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉన్నా.. సరఫరా చేయలేకపోతున్నారు. విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. వాటిని చెల్లిస్తేగానీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించబోమని అధికారులు తెగేసి చెబుతున్నారు.
 
 దీనివల్ల తాడిపత్రి, యాడికి, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అవస్థ పడుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 514 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.508 కోట్ల అంచనా వ్యయంతో జేసీ నాగిరెడ్డి పథకాన్ని చేపట్టారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు రూ.40 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండటంతో మిగిలిన పనులను ఆపేసి వెళ్లిపోయారు. గత ఏడాది రెండు సార్లు పథకం ట్రయల్న్ ్రచేశారు. తాడిపత్రి, యాడికి మండలాలకు నీరు కూడా సరఫరా చేశారు.
 
 గండికోట రిజర్వాయర్‌లో నీటి లభ్యత లేక ఈ ఏడాది మార్చి 18న సరఫరాను పూర్తిగా ఆపేశారు. మరో 15 రోజుల్లో పునరుద్ధరిస్తామని ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. ఇది సాధ్యపడే పరిస్థితి కన్పించడం లేదు. విద్యుత్ సమస్యే ఇందుకు ప్రధాన కారణం. ట్రయల్న్,్ర నీటి సరఫరాకు వాడిన విద్యుత్‌కు సంబంధించి రూ.3 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి. దీంతో వైఎస్సార్ జిల్లా అధికారులు గండికోట రిజర్వాయర్ వద్ద ఇంటెక్‌వెల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరాను ఆపేశారు. అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్‌కు రెండు నెలలుగా కృష్ణా జలాలు విడుదలవుతున్నాయి.

ఈ నెల 15 నాటికి మూడు టీఎంసీల మేర నీరు గండికోట రిజర్వాయర్‌లోకి చేరింది. రిజర్వాయర్‌లో నీరు అయిపోయినప్పుడు ఇంటెక్ వెల్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బోర్లు ప్రస్తుతం నీటమునిగాయి. అక్కడ ఏడు మీటర్ల మేర నీరు ఉండడంతో వాటిని బయటకు తొలగించడం ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రస్తుతం ఇంటెక్ వెల్ వద్ద నుంచి బాలప్పకోన వద్ద ఉన్న ఫిల్టర్ పాయింట్లకు నీరు సరఫరా చేయాలంటే నాలుగు మోటార్‌లు అవసరం. వాటిని ఏర్పాటు చేసినా.. విద్యుత్ సరఫరా లేదు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పథకాన్ని హడావుడిగా పునరుద్ధరించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కూడా గండిపడే అవకాశం కన్పిస్తోంది. ఇకపోతే ఎనిమిది నెలలుగా నీటి సరఫరా ఆగిపోవడంతో పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 విద్యుత్ సరఫరా తెప్పిస్తాం
 తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపేయడం తగదు. జిల్లాలో రూ.12 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నా... ఎక్కడా సరఫరా ఆపలేదు. వైఎస్సార్ జిల్లా అధికారులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి సరఫరాను పునరుద్ధరింపజేస్తాం. మరో 15-20 రోజుల్లో తాగునీటిని తప్పక సరఫరా చేస్తాం. అందుకు ఏర్పాట్లు కూడా చేశాం.     
 -ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement