వైఎస్సార్ సీపీ నాయకునిపై ఎస్సై దాష్టీకం | SI attacks on ysrcp candidate | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నాయకునిపై ఎస్సై దాష్టీకం

Published Mon, Mar 31 2014 2:39 AM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

SI attacks on ysrcp candidate

 గిద్దలూరు, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అక్రమాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతపై ఓ ఎస్సై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా పోలీసుస్టేషన్‌లో నిర్బంధించాడు. వివరాలు.. గిద్దలూరు యాదవ బజారులోని ఐదో వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్‌రెడ్డి అక్కడికి వెళ్లి కాంగ్రెఉపార్టీ నాయకుల అక్రమాన్ని ప్రశ్నించడమే తప్పుగా భావించిన ఎస్సై వై.శ్రీనివాసరావు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచాడు.

 ఎడమ వైపు చెంప, వీపు, తొడలపై గాయాలయ్యాయి. రక్తమోడుతున్న కృష్ణకిషోర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించకుండా ఎస్సై తన వాహనంలో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వేడుకున్నా ఖాకీలు పట్టించుకోలేదు. రెండు గంటల అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సీఐ నిమ్మగడ్డ రామారావు జోక్యంతో బైండోవర్ కేసు నమోదు చేసుకుని ఆయన్ను బయటకు పంపారు. గాయపడిన కృష్ణకిషోర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఎస్సైతో పాటు మరో ఏడుగురు కానిస్టేబుళ్లు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. కాళ్లతో కూడా తన్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులకు కొమ్ముకాస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని కృష్ణకిషోర్‌రెడ్డి ఆరోపించారు.  

 ఒక వర్గానికి కొమ్ముకాసిన ఎస్సై :  ముత్తుముల
 ఎస్సై వై.శ్రీనివాసరావు తన తమ్ముడు కృష్ణకిషోర్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కేవీవీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని ముత్తుములకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు హామీ ఇచ్చారు.

 కృష్ణకిషోర్‌రెడ్డిని పరామర్శించిన  నాయకులు
 ఎస్సై వై.శ్రీనివాసరావు దాడిలో గాయపడిన ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా ఆయన్ను నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, యువజన విభాగం నాయకులు రవీంద్రారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

 అవును.. ఎస్సై ఓవరాక్షన్ చేశారు :  ఆర్‌ఓ సత్యం
 అవును నిజమే. ఐదో వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఎస్సై వై.శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డిపై దాడికి పాల్పడటం సరైంది కాదు. ఐదో వార్డులో 78శాతం ఓటింగ్ నమోదైంది. ఓటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement