విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి
ప్రకాశం, గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక కాశిరెడ్డినగర్‌లోని శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, సాయిటెక్నో స్కూల్‌లలో వైవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ అందులో వైద్యులు, సిబ్బంది కొరత, మందుల కొరతతో ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలు ఉచిత వైద్య శిబిరాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు పరిస్తే ప్రజలు ఉచిత వైద్య శిబిరాల వైపు చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
జిల్లాలో 555 ఆరోగ్య కేంద్రాలు, 90 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీలు ఉన్నా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రజలకు తగిన వైద్యం అందడం లేదని గ్రహించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను అన్ని నియోజకవర్గాల్లో మెగా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరులో నిర్వహించినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజలకు ఉపయోగపడేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వేలాది మంది ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులతో శిబిరాలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 6,500 మంది వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి మందులు, భోజన వసతి కల్పించారు.
మంచినీటి సరఫరాలో లోపం వలనే ప్రజలకు అనారోగ్యం:ప్రభుత్వం ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయకపోవడం వలనే అనారోగ్యం పాలవుతున్నారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ ద్వారా తాగునీరందిస్తామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యి అడుగుల లోతులో బోరుబావులు తవ్వితే కానీ నీరు లభించని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నీటిని తాగిన ప్రజలు కీళ్లనొప్పులు, కిడ్నీ, ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాకు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో అవి ప్రజలకు చేరువకావడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ఫలితంగా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లమోటు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. కంభం చెరువుకు నీరు నింపి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు మరుగున పడటం వలన సాగులో ఉన్న ఖరీఫ్, రబీ రెండు పంటలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన అరకొర పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి రాగానే రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిషన్ సిపార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలన్న దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనే 5,227 ఓట్లను తొలగించేందుకు ఫారం–7 పెట్టారని, వారి కుట్రలను భగ్నం చేస్తూ సమన్వయకర్త ఐవీ రెడ్డి, నాయకులతో కలిసి 4,463 ఓట్లను పునరుద్ధరించేలా చేశారన్నారు. ప్రజలకు సేవచేసి వారి మన్ననలను పొందలేని అధికార పార్టీ నాయకులు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారు. ప్రజల కోసం సేవచేస్తున్న వారికి మద్దతు పలికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, యాళ్లూరి వెంకటరెడ్డి, కే.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు కామూరి రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సీహెచ్.రంగారెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, కే.వి.రమణారెడ్డి, మండల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
పొదిలి: సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించటంలో విఫలం కావటంతో వరి ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైవి.సుబ్బారెడ్డి అన్నారు.మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వగృహంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ వాటిని ప్రణాళిక బద్ధంగా రైతులకు అందించటంలో విఫలమయ్యారన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పొదిలి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య గురించి ఢిల్లీ స్థాయిలో గళం వినిపించామని, ఫలితంగా కేంద్ర అధికారులు వచ్చి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారన్నారు. మంచినీటి ప్రాజక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, అయితే చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. పశ్చిమ ప్రాంతం వారికి కరవు లేకుండా చేసే వెలుగొండ ప్రాజక్టు నిర్మాణం చంద్రబాబుతో కాదన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపు ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు, పొదిలి ప్రాంత ప్రజల తాగునీటి ఇబ్బందులు తీరుస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment