తెల్లటి రంగు.. 7 కిలోల బరువు.. 28 అంగుళాల ఎత్తు.. చిలుక ముక్కు.. డేగ లాంటి శరీర సౌష్టవంతో చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది ఆ కోడి పుంజు! దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! పెద్దపర్ల జాతికి చెందిన ఈ కోడి పుంజు ధర అక్షరాలా లక్ష రూపాయలు.
గిద్దలూరు రూరల్ (ప్రకాశం జిల్లా): గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకంలో ఆరితేరాడు. నాలుగేళ్ల నుంచి అరుదైన జాతి కోళ్లను పెంచుతూ కోళ్ల పెంపకంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో తాపీమేస్త్రీగా జీవనం సాగించే పెద్దపుల్లయ్య తన ఇంట్లో వివిధ రకాల నాటు, బెడస తదితర జాతి కోళ్లను పెంచేవాడు. నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రీ పని చాలించుకుని గ్రామంలోనే 2 ఎకరాల పొలం కొని సాగు చేస్తున్నాడు. అరుదైన జాతి కోళ్లను పెంచాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎన్నో ఊర్లు తిరిగాడు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. అరుదైన జాతి కోళ్లను జల్లెడ పట్టేందుకు ఊర్లన్నీ తిరిగేందుకు రూ.24 వేలు ఖర్చు చేశాడు. మొత్తం మీద తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తీసుకొచ్చేందుకు రూ.1.24 లక్షలు అయింది. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాల్లో ఇటువంటి అరుదైన జాతి పుంజు లేదని పుల్లయ్య గర్వంగా చెబుతున్నాడు. తన వద్ద ఉన్న కోళ్లలో ఒక్కటి కూడా రూ.30 వేలకు తక్కువ ధరలో లేకపోవడం గమనార్హం.
చాలా మంది ఎగతాళి చేశారు
ఒక్కో కోడికి దాణా కోసం నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతుంది. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరుశనగలు, రాగులు, సజ్జలను దాణాగా పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు తినిపించినట్లు తినిపించాల్సి వస్తుంది. కోళ్ల పెంపకం ద్వారా నెలకు రూ.30 వేలకు వరకు ఆదాయం పొందుతున్నా. పది రోజుల పిల్ల రూ.5 వేలు, కోడి గుడ్డు రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తుంటా. దిష్టి తగులుతుందని బయటకు ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్తుంటా. దీని విలువ తెలియని కొంత మంది కోడి లక్ష రూపాయాలా అని ఎగతాళి చేశారు. మా గేదె కూడా అంత విలువ చేయదు, నీ కోడి చేస్తుందా అంటుంటారు. అందుకోసమే కోడిని ఎవరికీ చూపించకుండా జాగ్రత్తగా పెంచుతున్నా.
– పెద్ద పుల్లయ్య, కోళ్ల పెంపకందారుడు
Comments
Please login to add a commentAdd a comment