‘మైత్రీ’..ముంచింది! | Alliance Plantation and Horticulture Private Limited blamed peoples | Sakshi
Sakshi News home page

‘మైత్రీ’..ముంచింది!

Published Tue, Dec 24 2013 7:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

Alliance Plantation and Horticulture Private Limited blamed peoples


 గిద్దలూరు, న్యూస్‌లైన్ :
 మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టింది. జిల్లా ప్రజలను ఇది వరకు మోసం చేసిన సంస్థల్లాగే మైత్రి కూడా అధిక వడ్డీ ఆశ చూసి కోట్ల రూపాయలు దండుకుని ఆ జాబితాలో చేరింది. మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన కార్యాలయాన్ని స్థానిక కొమరోలు బస్టాండ్‌లో ఏర్పాటు చేసింది. ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో సంస్థలో డబ్బులు కట్టిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురై సుమారు 50 మంది సోమవారం కార్యాలయానికి వచ్చారు. మేనేజర్ గరటయ్య రెండు నెలల నుంచి కార్యాలయానికి రావడం లేదని తెలిసి సిబ్బందిని నిలదీశారు.
 
 రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో వెయ్యి మంది మైత్రి ఏజెంట్లు ఉన్నారు. వీరు దాదాపు 10 వేల మంది నుంచి  డిపాజిట్లు, ఆర్‌డీల రూపంలో రూ3 కోట్ల 34 లక్షలు వసూలు చేసి మైత్రిలో జమ చేశారు. 2007లో ఒంగోలులో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మైత్రి సంస్థ ఆరు రాష్ట్రాల్లో 52 శాఖలు నెలకొల్పి 60 వేల మంది క్షేత్రస్థాయి ఏజెంట్లను నియమించుకుంది. ఇందులో మన రాష్ట్రంలోనే 36 బ్రాంచిలున్నాయి. వీటి ద్వారా వందల కోట్లు రూపాయలు వరకు డిపాజిట్‌లు సేకరించారు. ఏజెంట్లకు అధిక కమీషన్ ఆశ చూపించడం, కస్టమర్లకు నాలుగున్నర సంవత్సరాలకే రెట్టింపు.. మాయ మాటలు చెప్పారు. దీంతో ఏజెంట్లతో పాటు ఖాతాదారులు తమ ఆస్తులు అమ్మి మైత్రిలో నగదు చెల్లించారు. సంస్థ ఏర్పడిన ఏడేళ్లకే బోర్డు తిప్పేయడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. హసనాపురానికి చెందిన బి.వెంకటేశ్వర్లు రూ11 లక్షలు డిపాజిట్ చేశాడు. నెల రోజుల్లో ఇస్తామని చెప్పి అడ్రస్ లేకుండా పోయారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. గిద్దలూరుకు చెందిన ఓ మహిళ రూ80 లక్షలు, కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన సీహెచ్ పుల్లారెడ్డి రూ2.43 కోట్లు కస్టమర్ల నుంచి వసూలు చేసి మైత్రిలో జమ చేశారు. వీరు కస్టమర్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement