రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధించిందని, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని, ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని చెబుతూ రెండు రోజుల క్రితమే రాజీనామా చేసి.
రక్తికట్టించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు ‘రాజీ’నామా నాటకం
ఒక్క రోజుకే మనసు మార్చుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరు
ఆయనది పదవీ వ్యామోహమంటున్న గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు
గిద్దలూరు, న్యూస్‌లైన్ :
రాష్ట్రాన్ని విభజించిన తీరు బాధించిందని, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని, ఎమ్మెల్యే పదవి తనకు అక్కర్లేదని చెబుతూ రెండు రోజుల క్రితమే రాజీనామా చేసి.. తిరిగి మూడో రోజు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఘనత గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకే దక్కుతుంది. తనకున్న పదవీ వ్యామోహమే గురువారం నియోజకవర్గంలోని అర్ధవీడు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేలా చేసిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలు.. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు మూజువాణి ఓటుతో ఈ నెల 18వ తేదీన గట్టెక్కిన విషయం తెలిసిందే. దీనికి ముందే అంటే అదే రోజు ఉదయం ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు మండలంలో హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సన్మాన కార్యక్రమాలు పెట్టించుకున్నాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే రాష్ట్ర విభజన జరిగిపోయిందని చెప్పి అప్పటికే షెడ్యూల్‌లో ఉన్న మిగిలిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను వాయిదా వేసుకుని విలేకరులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి తాను ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి వెళ్లిపోయారు. 19వ తేదీ ఒక్కరోజు ఆలోచించుకుని తిరిగి ఎమ్మెల్యేగా కొనసాగాలని అనుకున్నారో ఏమో వెంటనే అర్ధవీడు మండలంలోని మాగుటూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించారు. నాగులవరం, కాకర్ల, మాగుటూరు, రంగాపురం, వెలగలపాయ, బొమ్మిలింగం, బసిరెడ్డిపల్లె గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శిలాఫలకాలపై పేరు రాయించుకున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యే కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొనడం గమనార్హం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమేంటని నియోజకవర్గ ప్రజలు అన్నాను ప్రశ్నిస్తున్నారు.
ఇవన్నీ తనకెందుకన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి చేసిన వారికి ఓటెయ్యాలని చెప్పి ప్రచారం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేయడం.. తిరిగి ఎమ్మెల్యే హోదాలో ప్రారంభోత్సవాలు చేయడంపై ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాజీనామా డ్రామా అని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి భయపడి విభజనకు ఒప్పుకుని, పైకి నటన చేస్తున్నారని ప్రజలు దుయ్యబడుతున్నారు. తన పదవీ కాలం పూర్తికాకముందే ఆవేశంలో తొందర పడి రాజీనామా చేసినందుకు ఎమ్మెల్యే బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారని జనం బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం.