గుబుల్.. గుబుల్ ! | tension in political leaders about on elections results | Sakshi
Sakshi News home page

గుబుల్.. గుబుల్ !

Published Sun, May 11 2014 12:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

గుబుల్.. గుబుల్ ! - Sakshi

గుబుల్.. గుబుల్ !

ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకుపోయిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల విషయంలోనూ గెలుపు అంచనాలు ఉన్నాయి

 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో ఐదు రోజులు గడిస్తే ఎవరి జాతకం ఏమిటో తేలిపోతుంది. పోలింగ్ ముగిసి ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. ఇన్ని రోజులపాటు రకరకాల సమీకరణలు, అంచనాలు, విశ్లేషణలు చేస్తూ వచ్చిన వారు స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన పోటీపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది..!!
 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ: ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకుపోయిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల విషయంలోనూ గెలుపు అంచనాలు ఉన్నాయి. వీరు గెలుస్తారా..?  వీరు చీల్చే ఓట్ల వల్ల ఏ పార్టీ అభ్యర్థి లాభ పడతారు..? అన్న అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీలే జరిగాయి. భువనగిరి, మునుగోడు, నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు తోడు స్వతంత్ర అభ్యర్థులూ గట్టి పోటీలో ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల ఫలితాల గురించి చర్చించే వారు విధిగా ఇక్కడ పోటీలో ఉన్న స్వతంత్రులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
 
 జిట్టా .. ఎట్టెట్టా !
 భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా కోల్పోని నియోజకవర్గం ఇదే. కానీ, ఈసారి పరిస్థితి తారుమారవుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డిల మధ్యనే గట్టి పోటీ నడిచింది. పోలింగ్ ముగిశాక, సరళిని బట్టి అంచనా వేస్తున్న వారు జిట్టా చీల్చుకునే ఓట్లే కీలకం కానున్నాయన్న వాదన వినిపిస్తున్నారు. ఒక దశలో పోటీ స్వతంత్ర అభ్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి మధ్యనే సాగిందన్న ప్రచారమూ తెరపైకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్  ఓటు కీలకమైన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి జిట్టా సహా మిగిలిన మూడు పార్టీలూ ఈ ఓటునే నమ్ముకున్నాయి. ఈ కారణంగానే నలుగురు అభ్యర్థుల మధ్య ఓట్లు భారీగా చీలిపోతాయని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ పార్టీ అయిన టీడీపీ వ్యతిరేక ఓటును ఎవరు ఎక్కువగా తీసుకుంటే వారికే గెలుపు అవకాశాలు ఉంటాయన్న చర్చా జరుగుతోంది. దీంతో ఇక్కడ జిట్టా  చీల్చుకునే ఓట్లపైనే భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
 కంచర్లతో .. కంగారు
 టీడీపీ, బీజేపీ పొత్తువల్ల టికెట్ దక్కని ్గ టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్  కంచర్ల భూపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఒకింత దూకుడును ప్రదర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య ద్విముఖం అనుకున్న పోటీని త్రిముఖ పోటీగా మార్చారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తక్కువ కాకుండా ప్రచారానికి, ఇతరత్రా ఆర్థిక వనరులను బాగానే వినియోగించారు. నల్లగొండ మున్సిపాలిటీలో కంచర్ల చీల్చుకునే ఓట్లే కీలకం కానున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ ఓటుపై ఆధారపడగా, సిట్టింగ్ అభ్యర్థి  కోమటిరెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన కాలంలో చేపట్టిన అభివృద్ధి, తెలంగాణ  రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకుని చేసిన త్యాగంపై ఆశపెట్టుకున్నారు. ఒక విధంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు తెలంగాణ ఓటును చీల్చుకున్నాయి. కాగా, టీడీపీ టికెట్ రాని సానుభూతిని ఓటు చేసుకునేందుకు ఇండిపెండెంట్‌గా పోటీలోకి దిగిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఎవరి ఓట్లు చీల్చారు..? అది ఎవరికి లాభిస్తుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
 
 సంకినేనితో.. సంకటం
 సూర్యాపేట నియోజవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ బరిలో ఉండగా, టీడీపీ మిత్రపక్షం బీజేపీకి చెందిన సంకినేని వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడా టీడీపీ, బీజేపీ పొత్తు ఫలించలేదు. దీంతో సంకినేని చీల్చే ఓట్లు మొదట టీడీపీని దెబ్బతీసినా, మొత్తంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంచనా వేయలేకపోతున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన సూర్యాపేటలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పూర్తిగా తెలంగాణ వాదం ఓటుపైనే ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా కీలకం కానుంది. ఈ దశలో స్వతంత్ర అభ్యర్థి ఎవరి ఓట్లు చీల్చుకున్నారు..? ఇది ఎవరికి లాభిస్తుంది..? అన్న అంశాలపై చర్చ నడుస్తోంది.
 
 స్రవంతి .. ముంచేదెవరిని..?

 మునుగోడు నియోజకవర్గంలో ముందునుంచీ టికెట్ ఆశించి భంగపడిన ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి ఇండిపెండెంటుగా పోటీకి దిగారు. కాంగ్రెస్, సీపీఐల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడును ఆ పార్టీకే వదిలేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్రవంతి తమ మిత్రపక్షం అభ్యర్థిపైనే రెబల్‌గా పోటీకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఓట్లు దాదాపు సీపీఐకి బదిలీ కాలేదన్న అభిప్రాయం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలించనట్లే కనిపిస్తోంది. ఈపరిణామం టీఆర్‌ఎస్‌కు వరంగా మారిందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. సీపీఐ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..? లేక స్వతంత్ర అభ్యర్థి  సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఓట్లు (సీపీఐకి బదిలీ కానివి) టీఆర్‌ఎస్‌ను గట్టెక్కిస్తాయా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం అయ్యారు. వీరు రాబట్టుకునే ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ధేశించనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement