కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు | all arrangements are completed for elections counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

Published Sun, May 11 2014 3:50 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

all arrangements are completed for elections counting

 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట డివిజన్‌కు కడపలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, జమ్మలమడుగు డివిజన్‌కు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్‌కు కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనాల్లో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని, ఈ సమాచారాన్ని అభ్యర్థులకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ శిక్షణ  తరగతులు ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోనే నిర్వహిస్తారన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శిక్షణ  కార్యక్రమం ఈ నెల 14 ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏఓ గుణభూషణ్  తదితరులు పాల్గొన్నారు.
 
 కౌంటింగ్ తేదీల్లో మద్యం విక్రయాలు బంద్
 
 కడప అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 12, 13, 16 తేదీల్లో నిర్వహించే ఆయా ఎన్నికల కౌంటింగ్‌ల ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధితోపాటు చుట్టు ఐదు కిలోమీటర్ల మేరకు మద్యం షాపులను మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. శనివారం కడప ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారన్నారు. ఎన్నికలు జరిగే రోజుల్లో కూడా 48 గంటలపాటు మద్యంషాపులను మూసి వేయించామన్నారు. అలాగే కౌంటింగ్ జరగనున్న తేదీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు. అలాగే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం షాపులను మూసి వేయాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీతోపాటు కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.   
 
 గట్టి బందోబస్తు  కడప అర్బన్, న్యూస్‌లైన్:  
 జిల్లాలో ఈనెల 12న మున్సిపల్,13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు లేదా బ్యాండులతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం నిషిద్ధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
 
 మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో పార్కింగ్
  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి వాహనాలను నగర శివార్లలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement