ఫలితాల మేళా ఎదురుచూపులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల ఫలితాల కోసం ఏకంగా రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో అటు అభ్యర్థులు, ఇటు ఆయా పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పూర్తయిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ వెలువడక పోవడంతో ఓ అంచనాకు రాలేక పోతున్నారు. ఈ నెల 12న మున్సిపల్, 13వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ ఫలితాల ఆధారంగా తమ గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది.
జిల్లాలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు మున్సిపాలిటీలు, మరో రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. స్థానిక అంశాలు ప్రభావితం చేసినా, మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అదే పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అంచనాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపల్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో రూరల్ ఓటరు కీలకం కానున్నాడు. ఈ కారణంగానే 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఫలితాల కంటే ముందే 12,13 తేదీల్లో వెలువడే మున్సిపల్, ప్రాదేశిక ఫలితాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.
ఇదీ ... లెక్క
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.21లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటే, ఒక్క నల్లగొండ మున్సిపాలిటీలోనే 1.21లక్షల పైచిలుకు ఓట్లున్నాయి. అంటే సగానికి సగం ఓట్లు పట్టణ ఓటర్లవే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ సరళి ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇట్టే ఓ అవగాహనకు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.07లక్షల ఓట్టుంటే, మున్సిపాలిటీలో 75,364, సూర్యాపేట నియోజకవర్గంలో 2.16లక్షల ఓట్లకు గాను, మున్సిపాలిటీలో 77,638 ఓట్లున్నాయి. భువనగిరి, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్‌నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లోనూ చెప్పుకోదగిన రీతిలోనే పట్టణ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 3.96లక్షల పైచిలుకు పట్టణ ఓటర్లు ఉన్నారు. ఇరవై అయిదు లక్షల పైచిలుకు జిల్లాలో ఉన్న ఓట్లలో మిగిలినవ న్నీ రూరల్ ఓట్లే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఫలితాలు వెలువడితే ఏ పార్టీ ఎన్ని జెడ్పీటీసీ, ఎన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందో తెలిస్తే, రూరల్ ఓటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి పడ్డాయో అంచానా వేసే వీలుంది.
అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే వెలువడుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిశాక ఫలితాల కోసం రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో ఉత్కంఠకు గురవుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు, పార్టీల నేతలు కనీసం మున్సిపల్, స్థానిక ఫలితాలతో అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై రకరకాల సమీకరణలు, అంచనాలు తెరపైకి వచ్చాయి. కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా సాగుతోందని సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగడంతో అభ్యర్థుల గెలుపుపై స్పష్టమైన ఓ అంచనాకు రాలేకపోతున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు.