రాజకీయ పార్టీల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ నెల 12న మునిసిపల్, 13న మండల, జిల్లా ప్రాదేశిక, 16న అసెంబ్లీ, పార్లమెంట్ ...ఇలా వరుసగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఘడియ సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో వరుస ఎన్నికలను ఎదుర్కొన్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఫలితాల గడువు సమీపించే కొద్దీ.. పల్స్ రేటు పెరుగుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆలోచనలతో అభ్యర్థులు రోజులను భారంగా గడుపుతున్నారు. ఫలితాల టెన్షన్ నుంచి బయటపడేందుకు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కుటుంబంతో గడపడం, కార్యక్రమాలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా... ఫలితాల ప్రస్తావనే వెంటాడుతోంది.
‘పుర’ పరీక్షే..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారాయి. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ నెల 12న వెలువడనున్నారుు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడంతో జనగామ మునిసిపల్ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా ఉండనుంది.
గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లోనూ పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్‌ఎస్ అభ్య ర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. గెలుపుపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముం దు వెల్లడయ్యే జనగామ మునిసిపల్ ఫలి తంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూపాల పల్లి నగరపంచాయతీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తుందనే వాదనలు వినపడుతున్నారుు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇక్కడి రాజ కీయ పరిస్థితులు మారిపోగా... గండ్ర వెంకట రమణారెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్నట్లు శ్రేణు లు భావిస్తున్నారుు. మానుకోట మునిసిపల్ ఎన్నికల ఫలితం ఇదే తీరుగా ఆసక్తిని పెంచుతోంది. నర్సంపేట, పరకాల నగర పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులకు పరీక్షగానే మారాయి.
‘పరిషత్’ ప్రామాణికం...
సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపైనే అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వీటి ఫలితాలు, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఎంపీటీసీ ఎన్నికలు ఆయా గ్రామాల్లోని స్థాని క సమీకరణలపై జరిగినా... జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం సాధారణ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న వెల్లడ య్యే పరిషత్ ఫలితాలను ఎమ్మెల్యే అభ్యర్థులు తమ గెలుపోటములకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో పరిషత్, సాధారణ ఎన్నికల మధ్య రాజకీయ పరిస్థితుల్లో తేడా ఉంది.
అప్పటివరకు నర్సంపేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొంతి మాధవరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. భూపాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు... బీజేపీ అభ్యర్థిగా సాధారణ ఎన్నికల బరిలోకి దిగారు. పరకాల నియోజకవర్గం లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో సహోదర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. ఇలా మూడు సెగ్మెంట్లు మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ స్థానిక, సాధారణ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో స్థానిక ఫలితాలు వచ్చిన తర్వాత మూడో రోజు సాధారణ తీర్పు వెలువడుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది.