ఏటిసేస్తాం.. పోనాది!
పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఓటమి
చీపురుపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రాజకీయ చతురతకు దర్పణంగా నిలిచి, విజయనగరం జిల్లాను తన కన్నుసన్నల్లో పెట్టుకుని పదేళ్ల పాటు ఇటు జిల్లా, అటు రాష్ట్రంలో చక్రం తిప్పిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తన కుటుంబంలోనే 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది.
పీసీసీ అధ్యక్షుడిగా, పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన కేవలం పదిహేను రోజుల్లో టికెట్టు సంపాదించుకుని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కిమిడి మృణాళిని చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో ఆది నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్న శ్రీను సైతం విజయం కోసం రేయింబవళ్లు శ్రమించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రధానంగా చీపురు పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.