ఇచ్చింది....అయినా పోయింది!
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
‘‘తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సే.. ఒకవేళ తెలంగాణ రాకపోతే చచ్చేది కూడా కాంగ్రెస్సే’’- పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు టీ-కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పిన మాటలివి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినా.. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చచ్చినంత పనైంది.
చేయి విరగ్గొట్టిన ప్రజలు
* అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
* బిత్తరపోయిన టీ-కాంగ్ నేతలు
* ఓటమికి కారణాలపై అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రభావం, సొంత పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రాష్ర్ట విభజనకు ఆమోదించింది. ఈ దెబ్బతో సెంటిమెంట్ పండుతుందని.. కనీసం ఒక ప్రాంతంలోనైనా అధికారం దక్కుతుందని భావించింది. కానీ జరిగింది మరొకటి! ఎవరూ ఊహించని రీతిలో ఆ పార్టీని ప్రజలు కసిదీరా ఓడించారు. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పేరు వింటేనే జనం ఛీకొట్టిన విధంగా తీర్పును వెలువరించారు. ఏ నియోజకవర్గంలో చూసినా కాం గ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అదే సమయంలో అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఘోరంగా పరాజ యం పాలయ్యారు.
ఫలితంగా 119 అసెంబ్లీ స్థానాల్లో కనాకష్టంగా రెండు పదులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక పార్లమెంట్ విషయంలో అత్యంత హీనమైన ఫలితాలను చవిచూసింది. మొత్తం 17 ఎంపీ సీట్లకుగాను రెండింటికే పరిమితమైంది. తెలంగాణలో ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలెవరూ ఊహించలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుం దని, పెద్ద పార్టీగా కాంగ్రెస్సే అవతరిస్తుందని అంచనా వేసిన టీ-కాంగ్ నేతలు తాజా ఫలితాలతో బిత్తరపోయారు.పార్టీ సంస్థాగత లోపాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత వంటి పలు అంశాలు కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమయ్యాయి.
సెంటిమెంట్ ఆదుకోలేదు
పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఐదేళ్ల రాజకీయ సంక్షోభాన్ని తెలంగాణ సెంటిమెంట్‌తో అధిగమించవచ్చని భావించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఏ మాత్రం కనికరించలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ముంచినట్లే తెలంగా ణలోనూ ఇంచుమించు అదే స్థాయిలో తీర్పునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే.. సాధించిన పార్టీయే మిన్న అని తమ ఓటుతో జనం స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల అస్తవ్యస్థ పాలన, రాజకీయ సంక్షోభం, అధిక ధరలు.. ఇలా ఒక్కటేమిటి? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా అనేక ప్రతికూల అంశాలు కాంగ్రెస్‌ను చుట్టుముట్టాయి. వెరసి హస్తానికి అధికారం దూరమైంది.
నాయకత్వ వైఫల్యమూ కారణమే
పార్టీ ఓటమికి నాయకత్వ లేమి కూడా ప్రధాన కారణమైంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయోత్సవాలు జరుపుకోవడంలో, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకోవడంలోనూ టీ-కాంగ్రెస్ నాయకత్వం దారుణంగా విఫలమైంది. బిల్లు ఆమోదం తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు తెలంగాణలో ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయారంటే వారి వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ చాంపియన్‌గా దూసుకుపోతుంటే ఆయనను ఢీకొనే నాయకుడే కాంగ్రెస్‌లో లేకుండా పోయాడు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
ఎవరికి వారే తాము గెలిస్తే చాలు, సీఎం కావచ్చుననే భావనలో సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసిన నాయకుడు ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోపంగా మారింది. చివరకు సీఎం రేసులో ఉన్న నాయకులు సైతం తాము గెలుస్తామో లేదోనన్న భయంతో కాంగ్రెస్ అతిరథులు సోనియా, రాహుల్ గాంధీలను తమ నియోజకవర్గానికే పిలిపించుకుని ప్రచారం చేయించుకోవడం గమనార్హం. టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల్లోని అభద్రతాభావానికి ఇదే పెద్ద నిదర్శనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం ఓడిపోతాననే భయం తో సినీ నటులు విజయశాంతి, జయప్రద, జయసుధలతో తన నియోజకవర్గంలో ప్రచారం చేయించడం టీ-కాంగ్రెస్ దుస్థితికి అద్దం పట్టినట్లయింది.
అంతా హైకమాండే చేసింది !!
పార్టీ ఘోర పరాభవానికి అధిష్టానం పెద్దలూ కారణమని చెప్పుకోవచ్చు. తెలంగాణ అంశం మొదలు పార్టీలో బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల్లో ప్రచారం వరకు అన్నింట్లోనూ హైకమాండ్ పెద్దల జోక్యం ఎక్కువైంది. టీ-కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల అభీష్టానికి భిన్నంగా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోనే ఈ ప్రాంత నేతల్లో అసంతృప్తి మొదలైంది. అభ్యర్థులకు నిధులు, ప్రచార సామగ్రి, ఎన్నికల ప్రచార సభల నిర్వహణలో హైకమాండ్ జోక్యం పెరగడంతో తెలంగాణ నాయకత్వమంతా ఎన్నికల్లో అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది.
అంతా వారి వల్లే!
తెలంగాణ విషయంలో కీలకంగా వ్యవహరించిన హైకమాండ్ పెద్దల్లో దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ముఖ్యులు. తెలంగాణ ప్రాంత బాధ్యతలను సోనియా గాంధీ వీరికే అప్పగించారు. పార్టీ పదవులు, అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచారం వరకు.. అన్నిం ట్లోనూ వీరి మాటకే అధినేత్రి విలువనిచ్చారు. తెలంగాణ జేఏసీ నేతలెవరూ గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ శ్రేణులు కోడైకూసినా దిగ్విజయ్ త్రయం వినిపించుకోలేదు. తెలంగాణలో రాజకీయంగా బలం గా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి నాయకత్వం అప్పగించకూడదనే ఉద్దేశంతో ఈ ముగ్గురు నేతలు చేసిన ప్రయత్నం వికటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన టీ-కాంగ్ ప్రముఖులంతా దిగ్విజయ్, జైరాం, కొప్పుల రాజు వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు.