ప్రత్యేక రాష్ట్రంలోనూ పోరాటమే
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో జరిగి ఎన్నికల్లో ప్రజలు పోరాట స్ఫూర్తిని కొనసాగించి అర్థవంతమైన తీర్పునిచ్చారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అద్భుతమనీ, అయితే ఇంకా సంక్షోభాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయన్నారు. తెలంగాణ జేఏసీ ఇక ముందు ప్రజలతో కలిసి నడుస్తుందన్నారు. విభజన నేపథ్యంలో జరిగే పంపకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
వలసీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమాలు అనివార్యమన్నారు. ప్రస్తుతం సర్కార్‌ను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగుల విభజన అంశంలో ఆప్షన్స్ చట్టంలో లేవన్నారు. 610జీవో, గిర్‌గ్లానీ కమిషన్ ప్రతిపాదన ఆధారంగా, విభజన మార్గదర్శకాలు, స్థానిక రిజర్వేషన్‌లు, ఆర్టికల్ 371డీ లోబడి ఉద్యోగుల విభజన జరిగినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ జేఏసీ అభివృద్ధికి, పౌర సమాజానికి అండగా ఉంటుందన్నారు. కోదండరాం వెంట టీజేఏసీ తూర్పుజిల్లా అధ్యక్షులు డా. పాపయ్య, వెంకట్‌రాంరెడ్డి ఉన్నారు.