ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | all arrangements are completed for general elections counting | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Published Sat, May 10 2014 12:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

all arrangements are completed for general elections counting

 ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 16న ఉదయం 8 గంటలకు మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపును మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వట్లూరులోని సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల మొదటి అంతస్తులో కొవ్వూరు, రెండో అంతస్తులో నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
 
వట్లూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతల పూడి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ లోక్‌సభ ఓట్ల లెక్కింపును భీమవరంలోని విష్ణు కళాశాలలో చేపట్టనున్నామన్నారు. అలాగే ఇదే కళాశాల ప్రాంగణంలోని బి.సీత పాలిటెక్నిక్ కళాశాలలో ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
 
 పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ పట్టణాల్లో..
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరంలలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఏలూరులో టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ఉంగుటూరు, గణపవరం, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, టి.నరసాపురం, చింతలపూడి, ద్వారకాతిరుమల, ఏలూరు మండలాల ఓట్లను లెక్కిస్తామన్నారు.

అలాగే తాడేపల్లిగూడెంలో పెంటపాడు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించినవి, జంగారెడ్డిగూడెంలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలివి, తణుకులో ఉండ్రాజవరం, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నిడదవోలు, ఇరగవరం, తాళ్లపూడి, పెరవలి, తణుకు, మండలాలు, భీమవరంలో నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి, ఆచంట, పోడూరు, వీరవాసరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, భీమవరం, మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు.
 
 పెయిడ్ న్యూస్‌పై 97 నోటీసులు జారీ
 ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ న్యూస్‌పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు 97 నోటీసులు జారీ చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,883 పోస్టల్ బ్యాలెట్లు, పార్లమెంట్ నియోజకవర్గాలకు 16,882 పోస్టల్ బ్యాలెట్‌లు ఇప్పటివరకు అందాయన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ 16న ఉదయం 7 గంటలకు అందిన పోస్టల్ బ్యాలెట్లను పరిగణన లోకి తీసుకుని  లెక్కించాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబధించిన అన్ని అంశాలకు సంబంధించిన ఫొటోలను పంపించాలని ఆదేశించారు.
 
 ఎన్నికల నిర్వహణకు మంజూరు చేసిన బడ్జెట్‌కు త్వరితగతిన చెల్లింపులు చేసి నివేదికలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement