
కూడికలు... తీసివేతలు
ఖమ్మం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లా ప్రజలు ఎక్కువ పార్టీలకు విజయం కట్టబెట్టడంతో పాటు ఎన్నికలో వైవిధ్యాన్ని చూపడంతో ఓటింగ్ సరళిపై వివిధ పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఎక్కడ, ఎన్ని ఓట్లు వచ్చాయి... పార్టీకి పట్టున్న చోట్ల ఎంత మెజార్టీ వచ్చింది... పట్టు లేని చోట పుంజుకున్నామా.... గణనీయ ఓట్లొచ్చింది ఎక్కడ... వెనుకబడింది ఎక్కడ అని కూడికలు, తీసివేతలు వేస్తూ విశ్లేషణలో మునిగిపోయారు.
పొత్తు పొడిచిందా?
సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్..., బీజేపీతో టీడీపీ
పొత్తులు పెట్టుకున్నాయి. వైఎస్సార్‌సీపీ, సీపీఎం అవగాహన కుదుర్చుకుని పోటీ చేశాయి. పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంతోపాటు వైరా, పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది. అదేవిధంగా పినపాక స్థానం బీజేపీకి కేటాయించి మిగిలిన తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టింది. వైఎస్సార్‌సీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.., ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలో పోటీలో నిలిచి మధిర, భద్రాచలం, పాలేరు నియోజకవర్గాలను సీపీఎంకు కేటాయించింది. ఫలితాలు చూస్తే... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాలేరు, మధిర, ఇల్లెందు, ఖమ్మం అసెంబ్లీలు గెల్చుకుంది. అదేవిధంగా వైఎస్సార్‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు అసెంబ్లీ స్థానాలు, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎంలు ఒక్కొక్క స్థానంలో గెల్చుకున్నాయి.
ఈ సందర్భంలో అసలు పొత్తుల మూలంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి లాభం జరిగింది... ఎక్కడ కొంప ముంచింది.. అనే విషయంపై అభ్యర్థులు, వారి మద్దతు దారులు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల ఎంపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపలేదని సీపీఐ శ్రేణులు అంటుంటే.. సీపీఐ నాయకులు కూడా తమ అభ్యర్థులకు సహకరించలేదని కాంగ్రెస్ నాయకులు ప్రత్యారోపణ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ పినపాకలో అక్కడి అభ్యర్థికి అనుకూలంగా పనిచేయలేదని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
‘హ్యాండి’చ్చారా?
ఎన్నికలకు ముందుగా కుదుర్చుకున్న పొత్తులకు అనుగుణంగా పనిచేసిందెవరనేది జిల్లాలో చర్చగా మారింది. పొత్తులు కుదుర్చుకున్నా కొన్ని పార్టీలు పొత్తు ధర్మానికి భిన్నంగా పనిచేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య సయోధ్య లేదనే అంచనాకు వస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అత్యధిక ఓట్లు రావాల్సిన సీపీఐ అభ్యర్థి నారాయణకు తక్కువ ఓట్లు రావడం, కష్టంగా సత్తుపల్లి నియోజకవర్గం గెల్చుకున్న టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడంపై చర్చ జరుగుతోంది. మొత్తం ఓట్లలో సీపీఐ అభ్యర్థి నారాయణకు 1,87,702 ఓట్లు రాగా అదే నామా నాగేశ్వరరావుకు 4,10,230 ఓట్లు రావడంతో మిత్ర ధర్మంలో ఏదో మోసం జరిగిందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా సీపీఐతో పొత్తు పెట్టుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, సునాయసంగా గెల్చుకునే స్థానాలు వారికి వదిలేయాల్సి వచ్చిందని, వారు పోటీచేసిన చోట్ల కనీస ఓటు బ్యాంకును పొందలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తుండడం గమనార్హం.