పలకజీడిలో రీపోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.
కొయ్యూరు, న్యూస్‌లైన్ : పలకజీడిలో రీపోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రీపోలింగ్ చేపట్టారు. ముందు జాగ్రత్తగా ఆదివారం సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలను ఇక్కడికి తరలించారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో 468 మందికి 326 మంది ఓటేశారు.
మావోయిస్టులు మరోసారి దాడి చేస్తారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలోని 20 గ్రామాల్లో గ్రేహౌండ్స్ బాలగాలచే కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ముందస్తు హెచ్చరికలతో ఓటర్లు కొంత వరకు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఇచ్చిన ధైర్యంతో ఎక్కువ మంది వచ్చి ఓటేశారు. కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. తహశీల్దారు ఉమామహేశ్వరరరావు పాల్గొన్నారు. పలకజీడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రోడ్డు పనసలపాలెం వరకు పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలను తరలించారు. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం తీసుకొచ్చారు.
బ్యాలెట్‌తోనే అభివృద్ధి
విశాఖపట్నం : బుల్లెట్‌తో కాకుండా బ్యాలెట్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని గిరిజనులు చాటిచెప్పారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కొయ్యూరు మండలం పలకజీడిలో జరిగిన రీ పోలింగ్ దీనికి అద్దం పట్టిందన్నారు. 70శాతం మంది ఓటేయడం విశేషమన్నారు. మావోయిస్టుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా గిరిజనులంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఇది మంచి పరిణామమని, ఇప్పటికైనా మావోయిస్టులు ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలన్నారు. ఏజెన్సీలో ప్రశాంతంగా ఎన్నికలకు గిరిజనుల సహకారం మరువలేనిదన్నారు.