వైఎస్‌ఆర్ సీపీ గెలుపునకు సహకరించిన..అందరికీ కృతజ్ఞతలు
మణుగూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీని గెలిపించిన అందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన శనివారం మణుగూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన సహాయ సహకారాలతో నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్‌ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్‌ఆర్ సీపీని అమితంగా ఆదరించారని అన్నారు. జిల్లాలో సీపీఎం, వైఎస్‌ఆర్ సీపీ పొత్తు మంచి ఫలితాన్నిచ్చిందని అన్నారు. ఈ రెండు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేశారని, ఫలితంగానే పినపాక నియోజకవర్గంలో ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీ తనకు వచ్చిందనిఅన్నారు. తనను గెలిపించిన ప్రజలకు, సహకరించిన వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిలమ్మ పర్యటనతో పార్టీకి మరింతగా కలిసొచ్చిందని అన్నారు.
ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో తన గెలుపునకు షర్మిలమ్మ పర్యటన నాంది పలికిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల మధ్యన ఉంటున్న తనకు నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వీటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని అన్నారు. ఖమ్మాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో వైఎస్‌ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
తన విజయానికి అన్నివిధాల సహాయ సహకారాలందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు లు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు భూపల్లి నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరా వు, మాదినేని రాంబాబు, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.