సజావుగా ఎన్నికల నిర్వహణపై అభినందనలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు సమర్థవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్‌లను ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ వారి చాంబర్లలో కలిసి అభినందించింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో జిల్లాను ముందు వరుసలో ఉంచారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గంటన్నరలోపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు ఏ స్వాములు, పీ మదన్‌మోహన్, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, ఎస్‌ఎన్‌ఎం వలి, ఐసీహెచ్ మాలకొండయ్య, కే శివకుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే పద్మకుమారి,కార్యదర్శి ఎన్‌వీ విజయలక్ష్మి తదితరులున్నారు.