GSRKR vijay kumar
-
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
ఒంగోలు టౌన్: జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన జన్మభూమి - మాఊరు సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు సూక్ష్మ ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1030 పంచాయతీలు, 225 మునిసిపల్ వార్డుల్లో 1255 గ్రామసభలు నిర్వహించామన్నారు. మొత్తం 2 లక్షల 80 వేల అర్జీలు వచ్చాయన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి లక్షా 2 వేల 38 అర్జీలు, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు 42,650 అర్జీలు, హౌసింగ్ 38,469 అర్జీలు, ఉపాధి హామీ పథకానికి 11,754 అర్జీలు, మునిసిపాలిటీలకు 5 వేల అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీల్లో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా కొత్త వనరులు సమీకరించే దానిపై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అర్జీదారులందరి నుంచి ఆధార్ నంబర్ తీసుకోవడంతోపాటు వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. అర్జీల పురోగతిపై సంబంధిత సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లు పంపించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్‌లో బోగస్‌ను నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో 2 లక్షల 56 వేల మందికి 41.75 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేసినట్లు వివరించారు. లక్షా 16 వేల 817 మందికి వృద్ధాప్య పింఛన్లు, 83 వేల 25 మందికి వితంతు పింఛన్లు, 6,107 మందికి చేనేత పింఛన్లు, 18,101 మందికి అభయహస్తం పింఛన్లు, 31,673 మందికి వికలాంగ పింఛన్లు అందించినట్లు వివరించారు. 79 వేలు తొలగింపు.. 27 వేలు పునరుద్ధరణ: పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆ తరువాత వాటిని విచారించి 27 వేల పింఛన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన పింఛన్లు విచారణలో ఉన్నట్లు తెలిపారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి అందించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి కమిటీ వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపిస్తోందన్నారు. వాటన్నింటినీ విచారించిన తరువాత అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని విజయకుమార్ వివరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చినవి అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఆధార్ అనుసంధానంలో ముందంజ: ఆధార్ అనుసంధానం విషయంలో జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉందని కలెక్టర్ వెల్లడించారు. రేషన్‌కార్డులు, స్కాలర్షిప్లు, విద్యార్థుల నమోదుకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో గతంలో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 82.15 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా చేరిందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. చీరాల మండలంలో 80 శాతం టాలీ కాని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా వివరాలు తీసుకుంటూ పాత వాటిని పరిశీలిస్తూ అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ఇరువర్గాల వారిని పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నట్లు చెప్పారు. ప్లేట్లెట్ మిషన్‌ను అడుగుతూనే ఉన్నాం: ఒంగోలు రిమ్స్‌లో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు విషయమై ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ డెరైక్టర్‌కు చెప్పి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించానన్నారు. తాను కూడా ఈ విషయాన్ని స్వయంగా సంబంధిత మేనేజింగ్ డెరైక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దృష్టికి కూడా ప్లేట్లెట్ మిషన్ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. జెడ్పీ చైర్మన్‌కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ చూస్తే చెబుతాను: జిల్లా పరిషత్ చైర్మన్‌కు సంబంధించి తాజాగా వచ్చిన అఫీషియల్ ఆర్డర్ చూస్తే దాని గురించి చెబుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈదర హరిబాబు తిరిగి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన పైవిధంగా స్పందించారు. కోర్టు ఏ డెరైక్షన్ ఇస్తే దానిని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈదర హరిబాబు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. మొత్తం 543 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అంగీకరించారు. జిల్లాకు 601 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 601 పోస్టులకు 543 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 58 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. మొదట ఒక జాబితాను అధికారులు ఆమోదించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో మొదటి ఎంపికను నిలిపివేసి మళ్లీ అర్హులైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. అన్ని మండలాల నుంచి దరఖాస్తులను ఒంగోలు తెప్పించి మెరిట్ జాబితా తయారు చేసి రోస్టర్ ప్రకారం ఎంపిక చేశారు. మొత్తం 601 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల్లో 543 భర్తీ చేశారు. 58 ఖాళీగా మిగిలిపోయాయి. సెకండరీ గ్రేడ్, భాషా పండితుల పోస్టుల్లో నియమితులయ్యే ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.5 వేలు చొప్పున, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమితులయ్యే వారికి నెలకు రూ.7 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. వీరు పోస్టుల్లో చేరిన తేదీ నుంచి మూడు నెలల పాటు కొనసాగుతారు. నియామకాలు ఇలా.. జిల్లాలో పుల్లలచెరువు మండలంలో అత్యధికంగా 45 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. దొనకొండ మండలంలో 39 మంది, సీఎస్ పురం మండలంలో 36, పామూరు మండలంలో 34, యర్రగొండపాలెం మండలంలో 33, త్రిపురాంతకం మండలంలో 30, పెదదోర్నాల మండలంలో 29, కురిచేడు మండలంలో 28, పీసీ పల్లి మండలంలో 20, కొనకనమిట్ల మండలంలో 17, కనిగిరి, మార్కాపురం, పెదారవీడు మండలాల్లో 12 మంది చొప్పున, హెచ్ఎం పాడు మండలంలో 11, ముండ్లమూరు, వెలిగండ్ల మండలాల్లో 10, మార్టూరు మండలం 9, తర్లుబాడు, జరుగుమల్లి, సంతమాగులూరు, బేస్తవారిపేట మండలాల్లో 8 మంది చొప్పున, చీమకుర్తి, పర్చూరు, తాళ్లూరు మండలాల్లో ఆగురుగు చొప్పున, పొదిలి మండలం ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. కొత్తపట్నం మండలంలో అతి తక్కువగా కేవలం ఒకే ఒక అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను ఎంపిక చేశారు. మిగిలిన మండలాల్లో ఒకరి నుంచి నలుగురి వరకు నియమితులయ్యారు. -
పింఛన్లపై స్పష్టత ఇవ్వండి
ఒంగోలు టౌన్ : పింఛన్ల మంజూరుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కోరారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జరగనున్న జన్మభూమి-మన ఊరు, పారిశుధ్యం, పింఛన్ల పంపిణీ తదితరాలపై సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేయనున్న పింఛన్లు, డ్వాక్రా బజార్ల నిర్వహణ, డ్వామా నిబంధనల్లో స్పష్టత ఇవ్వాలన్నారు. 2 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలి : సీఎస్ అక్టోబర్ 2వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. జన్మభూమి-మన ఊరు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పండగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు. అక్టోబర్ రెండవ తేదీ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడానికి మండలానికి ఒక ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో పైపులైన్ల లీకేజీలు, డ్రెయిన్ల మరమ్మతులు 48 గంటల్లో పూర్తిచేసి వెబ్సైట్లో ఫొటోలు పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ యాకూబ్ నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, జెడ్పీ సీఈఓ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల ఫిర్యాదులను ఎంపీడీఓకు తెలపాలి పింఛన్లపై ఫిర్యాదులు ఉంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అప్పీలు చేసుకోవాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ సూచించారు. కొనకనమిట్ల మండలానికి చెందిన కొంతమంది తమకు పింఛన్లు రావడం లేదని సోమవారం కలెక్టర్‌ను ఆయన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు. అర్హులమైన తమను జాబితా నుంచి తొలగించి, అనర్హుల పేర్లను జాబితాలో చేరుస్తున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులను మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలించి చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. -
సమాజం కోసం జీవించిన జాషువా
ఒంగోలు టౌన్ : గుర్రం జాషువా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించారని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 119వ జయంతి సభను ఆదివారం స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజైరెప్రసంగిస్తూ జాషువా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా కవితలుగా రాశారన్నారు. తన కవిత్వం ద్వారా సామాజిక మార్పు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి జాషువా అని కలెక్టర్ పేర్కొన్నారు. జాషువా జీవితం, ఆయన రాసిన కవితలపై అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జాషువా జయంతి కార్యక్రమాల ద్వారా కవితలను ప్రచారం చేసేందుకు మరింత మందికి స్ఫూర్తి ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి జీవీ శేషు మాట్లాడుతూ గుర్రం జాషువా పద్యాలు అజరామరమన్నారు. బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు వంటివారి కంఠం నుంచి జాషువా పద్యాలు రావడంతో వాటికి మరింత ఖ్యాతి వచ్చిందన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ చరిత్రను గుర్రం జాషువా తిరగరాశారని కొనియాడారు. దళిత సాహిత్యానికి దిక్సూచిగా నిలిచారన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ గుర్రం జాషువా అంటరానితనాన్ని అజెండాగా చేసుకొని కవిత్వాలు రాశారన్నారు. అస్పృశ్యత వంటి చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే జాషువాకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ కవులు దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, కత్తి కల్యాణ్, కొలకలూరి స్వరూపరాణి, దళిత నాయకులు తాటిపర్తి వెంకటస్వామి, తేళ్ల భాస్కరరావుమాదిగ, బి.ఏసుదాసుమాదిగ, పల్నాటి శ్రీరాములు, చప్పిడి వెంగళరావు, ముప్పవరపు గోపి, సుజన్‌మాదిగ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు ప్రసంగించారుప్రకాశం అక్షర విజయం పేరుతో స్వల్ప కాలంలో లక్షలాదిమంనని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌కు జాషువా సాహితీ సాంస్కృతిక సమాఖ్య తరఫున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తొలుత ప్రకాశం భవనం ఆవరణలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీటీఏ ఆధ్వర్యంలో.. ఒంగోలు వన్‌టౌన్ : మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సావిత్రిబాయి పూలే భవన్లో జరిగిన సమావేశంలో బీటీఏ జిల్లా అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, మానవతావాదాన్ని తనదైన శైలిలో బహిర్గత పరిచి జాషువా చరిత్ర సృష్టించారని కొనియాడారు. జిల్లాలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రగతిశీల అధ్యయనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బీటీఏ సభ్యులు తెలుగు కళామండలిగా ఏర్పడాలని నిర్ణయించారు. తెలుగు కళామండలి అడహక్ కమిటీ కన్వీనర్‌గా సీహెచ్ పెదబ్రహ్మయ్య, చైర్మన్‌గా ఎం.భాస్కరరావు, కో కన్వీనర్లుగా మాలకొండయ్య, దాసరి జనార్దనరావు, దార్ల కోటేశ్వరరావులను నియమించారు. కార్యక్రమంలో జగన్మోహన్, జాలాది మోహన్, బి.శోభన్‌బాబు, నారాయణ, కృష్ణమూర్తి, విజయబాబు, వీరనారాయణ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. ఒంగోలు : భారతీయ జనతాపార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 119వ జయంతి కార్యక్రమం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ నగర అధ్యక్షుడు ముదవర్తి బాబూరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాషువా తన రచనలతో దళితులు, బడుగుల్లో చైతన్యం నింపారని, పట్టుదల, స్వయంకృషితో అనేక బిరుదులు సాధించారని, గబ్బిలం వంటి మహా రచనల ద్వారా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అటువంటి మహానేత స్ఫూర్తిగా ప్రస్తుత ప్రైవేటు విద్యాలయాల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని, అందుకు అవసరమైతే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, మువ్వల వెంకటరమణారావు, జిల్లా అధ్యక్షుడు కనమాల రాఘవులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రాజధనవర్మ, నగర అధ్యక్షుడు ఎస్కే ఖలీఫతుల్లా, ముస్లిం మైనార్టీ జిల్లా ఇన్చార్జి వి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు అమ్మితే చర్యలు
కందుకూరు : విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కందుకూరు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల పనితీరుపై అధికారులతో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కి తరలినా, అధిక ధరలకు అమ్మినా సంబంధిత వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. డివిజన్ పరిధిలో వరి తక్కువగా సాగయ్యే కారణాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ మొత్తం మీద 28 శాతం లోటు కనిపిస్తుండగా, గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాల్లో అత్యధికంగా 56 శాతం లోటుందని చెప్పారు. దొనకొండ మండలంలో 10 వేల హెక్టార్లలో పంట సాగు కావల్సి ఉండగా కేవలం 5 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయన్నారు. దీంతో ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల పంటలు సాగు కాలేదని కలెక్టర్‌కి వివరించారు. నాగార్జున సాగర్ కాలువ పరిధిలో ప్రస్తుతం నీరు వదులుతున్నందున వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల వారీగా పంటల సాగు వివరాలను నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపుతారన్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని పశు సంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ రజనీకుమారిని ఆదేశించారు. సూక్ష్మసేద్యం పథకం కింద సెప్టెంబర్ నెలాఖరు నాటికి 868 హెక్టార్లు లక్ష్యం కాగా, 1530 హెక్టార్లలో లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రావు వివరించారు. వచ్చే నెలాఖరుకు మొత్తం 2150 హెక్టార్ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. మత్య్సశాఖ అధికారులపై ఆగ్రహం: మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు జులై ఒకటో తేదీ నాటికి లెసైన్స్‌లు పునరుద్ధరించాల్సి ఉండగా, నేటికీ రెన్యువల్ చేయకపోవడంపై కలెక్టర్ ఆశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చినా, సమస్య వచ్చినా వారిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. మత్య్సకారులందరికీ అవగాహన కల్పించి వెంటనే లెసైన్స్‌లు పునరుద్ధరించాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో మత్య్సకారులు చేపలు ఎండబెట్టుకునేందుకు డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో... పొదిలి మండలం ఉప్పలపాడు, శింగరాయకొండ, చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో శిశుమరణాలు అధికంగా నమోదు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులను, శిశువులను జాగ్రత్తగా గుర్తించి పేర్లు నమోదు చేయాలని, వారికి ఎప్పటికప్పుడు మందులు, వ్యాక్సిన్లు అందజేసి మాతృ, శిశుమరణాలను అరికట్టాలని ఆదేశించారు. ప్రతి బిడ్డని గుర్తించి వ్యాక్సిన్లు వేయాలని వలస వెళ్లిన కుటుంబాల వారు ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, ఎల్డీఎం నరశింగరావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు జెన్నమ్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.105 కోట్లతో నూతన ప్రకాశం భవనం
ఒంగోలు టౌన్: జిల్లాకే తలమానికంగా నూతన ప్రకాశం భవనం నిర్మించేందుకు ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. మూడేళ్లలో నూతన ప్రకాశం భవనం నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్, దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో వంద అడుగుల ఎత్తులో ఇండియా గేట్ నమూనాలో రెండు కాంప్లెక్స్‌లను అనుసంధానం చేస్తారన్నారు. 60 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సువిశాలమైన మీటింగ్ హాల్ మొత్తం 8 ఎకరాల్లో ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తపట్నం రోడ్డులోని అల్లూరు ప్రాంతంలో 15 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించేందుకు పరిశీలించాలన్నారు. రూ.15 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు: ఒంగోలు నగరంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని 7 కోట్ల రూపాయలతో ఐదంతస్తుల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా రానున్న 20ఏళ్లకు సరిపోయేలా నిర్మించాలన్నారు. అలాగే ఊరచెరువు ప్రాంతంలో కన్వెన్షన్ హాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. 3 కోట్ల రూపాయలతో నెల్లూరు బస్టాండు కళా ప్రాంగణంలో అంబేద్కర్ క్షేత్రాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుండి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రంగారాయుడు చెరువు తూర్పువైపు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా, దక్షిణం వైపు మంగమూరు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 15 ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల పథకం:ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు 15 ప్రాంతాలను గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. ఒక్కో ఆర్ఓ ప్లాంట్‌ను 3 లక్షల 60 వేల రూపాయలతో నిర్మిస్తారన్నారు. వీటిని దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో కుటుంబానికి 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు అందిస్తారన్నారు. ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రిమ్స్ హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు, కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, ఒంగోలు తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలుత నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
రాష్ట్రపతి చేతుల మీదుగా అరుదైన అవార్డు
ఒంగోలు టౌన్: అక్షరాస్యత సాధనలో అత్యున్నత ఫలితాలు సాధించిన జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌కు అరుదైన గుర్తింపు పొందారు. ‘ప్రకాశం అక్షర విజయం’ పేరుతో కేవలం తొమ్మిది నెలల కాలంలో 18 శాతం అక్షరాస్యతను పెంపొంధించిన విషయం తెలిసిందే. జాతీయ సాక్షరతా మిషన్ దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో మంచి ఫలితాలు సాధించిన జిల్లాల్లో రాష్ట్రం నుంచి ప్రకాశంను ఎంపిక చేసింది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలోని విద్యాభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జాతీయ సాక్షర భారత్ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ విజయకుమార్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రెండు దశల్లో నిర్వహించిన ప్రకాశం అక్షర విజయంలో 4లక్షల 75వేల 39మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినట్లు తెలిపారు. దీంతో జిల్లాలో అక్షరాస్యత శాతం 78.84 శాతానికి పెరిగిందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశ సరాసరి అక్షరాస్యతకంటే జిల్లా అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని, ప్రకాశం అక్షర విజయంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు వివరించారు. గతంలో అక్షరాస్యత సాధన ఉద్యమం చేపట్టిన దశాబ్ధ కాలంలో 15 నుంచి 18 శాతం పెరిగిందని, అక్షర విజయంతో కేవలం 9 నెలల వ్యవధిలో 63 శాతం నుంచి 78.84శాతం పెరిగిందన్నారు. స్వల్ప వ్యవధిలో ఇలా అక్షరాస్యత దేశంలో ఎక్కడా పెరగలేదన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో ప్రకాశం జిల్లా 10వ స్థానంలో ఉండేదని, ప్రస్తుత ఫలితాలతో 5వ స్థానానికి చేరుకున్నట్లు వివరించారు. జాతీయ సాక్షర భారత్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి అవార్డులు, రివార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. చదువుతోనే ప్రగతి సాధించవచ్చన్న ఉద్దేశ్యంతో చేపట్టిన అక్షర యజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. నూరుశాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభినందనల వెల్లువ జిల్లా కలెక్టర్ విజయకుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపధ్యంలో బుధవారం ఆయనను జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డిప్యూటీ డెరైక్టర్ కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ, స్టెప్ సీఈఓ బి. రవి, ఉద్యానశాఖ ఏడీలు రవీంద్రబాబు, జెన్నమ్మ, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్యాంబాబులతోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం, జిల్లా గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి బొకోల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
జిల్లాకు అరుదైన గుర్తింపు
సాక్షి, ఒంగోలు: జిల్లాకు అరుదైన గుర్తింపు దక్కింది. ఎన్నికలక్రతువు సమర్ధ నిర్వహణపై కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌కు ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అభినందనలు అందాయి. ఈనెల 22న పాండిచ్చేరిలో జరగనున్న ‘సౌత్‌జోన్ సింపోజియమ్’కు మన రాష్ట్రం నుంచి కలెక్టర్ హాజరవ్వాల్సిందిగా ఆహ్వానం అందింది. ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సు (సింపోజియమ్)లో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఇక్కడ ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ప్రణాళికను వివరించాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వివరించిన ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల ఆధారంగా ఁబెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ అవార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. రాష్ట్రం నుంచి ప్రకాశం జిల్లాతో పాటు తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్లు సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ చేపట్టిన ఎన్నికల ప్రణాళిక విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తయారుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలి ఫలితం వెల్లడి జిల్లా నుంచే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న పాండిచ్చేరి సదస్సులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కలెక్టర్లను గుర్తించారు. వారికి ప్రత్యేక ప్రసంశలు పంపుతూ ఆహ్వానపత్రాలు అందించారు. ఇందుకు గాను అర్హతగా వారు ఆయా జిల్లాల్లో చేపట్టిన ఎన్నికల ప్రణాళికలను పరిగణలోకి తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోని జిల్లాగా ఁప్రకాశం రికార్డుల్లోకెక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం జిల్లా నుంచే తొలి ఫలితం వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,84,109 మంది ఓటర్లుండగా, 2,880 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసి ..ఆయా ప్రాంతాలకు నోడల్ అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణపై శిక్షణ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల మెటీ రియల్ పంపిణీ, ఫ్లయింగ్ స్క్వాడ్, రవాణా వ్యవస్థ, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలికవసతులు తదితర అంశాలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపట్టడంతో విజయవంతమైన ఫలితాలొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల సగటు జిల్లా పోలింగ్ శాతం 85.69 శాతం కాగా, దర్శి నియోజకవర్గంలోనే 91 శాతం పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 88.86 శాతం, ప్రాదేశికాల్లో 84.88 శాతం, మున్సిపాలిటీ ఎన్నికల్లో 82.46 శాతం పోలింగ్ జరిగింది. ఎక్కడా రీపోలింగ్, ఆరోపణలకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతో పాటు సంతమాగులూరు, మర్రిపూడి మండలంలోని రామాయపాలెంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లతో ఓట్లేయించిన సందర్భం తెలిసిందే. ఎంపీటీసీ ఎన్నికల్లో టంగుటూరు బ్యాలెట్పత్రాల్లో అభ్యర్థిపేరు, ఎన్నికల గుర్తు తారుమారవగా.. అప్పటికప్పుడు బ్యాలెట్‌పత్రాలు మార్చి అంతకుముందు ఓట్లేసి వెళ్లిన వారిని వెనక్కి పిలిపించి మరీ ఓట్లేయించి పంపారు. చీరాల అసెంబ్లీ ఎన్నికల రాద్దాంతం, జెడ్పీచైర్మన్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ.. అధికార యంత్రాంగం చేపట్టిన వ్యూహాత్మక చర్యలను ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల వెల్లడిలో రాష్ట్రవ్యాప్తంగా తొలిగా ఉదయం 10.15 నిముషాలకు ఒంగోలు అసెంబ్లీ, 11.00 గంటలకు ఒంగోలు లోక్‌సభ ఫలితాలు వెల్లడిచేశారు. ఎన్నికలతీరు పరిశీలనకు జిల్లాలోని 12 నియోజకవర్గాలను ఒక్కరోజులో తానే స్వయంగా పర్యటించడం గుర్తించాల్సిన విషయం. కలెక్టర్ లేఖలతో ఓటరు చైతన్యం.. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన దగ్గర్నుంచి ఓటరు చైతన్య కార్యక్రమాల్లో కలెక్టర్ చూపిన చొరవను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గుర్తించి పాండిచ్చేరి సింపోజియమ్ అజెండాలో పొందుపరిచింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల విద్యార్థులందరికీ ఓటుచైతన్యంపై కలెక్టర్ స్వయంగా లేఖరాసి.. వారి తల్లిదండ్రులకు చూపించి సంతకాలు పెట్టించుకు రావాలనే విధానం విజయవంతమైంది. అదేవిధంగా ఇంటింటికీ ఓటరు స్లిప్పులతో పాటు ఓటుహక్కు విలువపై లేఖలను పంపిణీ చేశారు. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం 1.5 పెరిగింది. అదేవిధంగా అర్బన్ ఓటింగ్ వివరాల్లోకొస్తే.. 2009లో ఒంగోలులో 66.65 శాతం పోలింగ్ జరగ్గా.. 2014లో 70.45 శాతం నమోదైంది. గిరిజనులు అధికంగా ఉన్న యర్రగొండపాలెంలో కిందటి ఎన్నికల్లో 74.14 శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఇటీవల ఎన్నికల్లో 83.35 శాతం నమోదైంది. మార్కాపురంలోనూ 78.05 శాతం నుంచి 80.89 శాతం వరకు ఓటింగ్ పెరగడం విశేషం. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం మిగతా రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రణాళికతో కలిపి భవిష్యత్ నివేదికలు తయారు చేయనున్నారు. -
9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపు
ఒంగోలు టౌన్ : ప్రకాశం అక్షర విజయం ద్వారా జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని 9 నెలల్లో 25 శాతం పెంచినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా అక్షరాస్యతలో 16వ స్థానంలో ఉండగా, విభజన అనంతరం 13 జిల్లాల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. స్వల్ప కాలంలో అధిక అక్షరాస్యత సాధించిన జిల్లాగా ప్రకాశం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో దీనిని అధ్యయనం చేసేందుకు ముంబైలోని ఎస్ఎన్డీటీ మహిళా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ సోమవారం ఒంగోలు వచ్చారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంపై స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ ఆమెకు వివరించారు. అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో రెండు దశల్లో అమలు చేసినట్లు చెప్పారు. మొదటి దశలో 20 వేల 867 కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల 56 వేల 452 మందిని అక్షరాస్యులను చేయగా, రెండో దశలో 14 వేల 483 కేంద్రాలను ప్రారంభించి లక్షా 93 వేల 570 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినట్లు వివరించారు. రెండు దశల్లో అక్షరాస్యత 78 శాతం సాధించినట్లు తెలిపారు. అన్ని స్థాయిల్లో అధికారులను భాగస్వాములుగా చేర్చి అందరికీ బాధ్యతలు అప్పగించడం వల్ల సమష్టిగా విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 20 వేల మంది వరకు అధికారులు, సిబ్బంది ఎలాంటి నగదు తీసుకోకుండా స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు తెలిపారు. ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్ ప్రకాశం అక్షర విజయం ద్వారా అక్షరాస్యతలో సాధించిన పురోభివృద్ధిపై ముంబై నుంచి వచ్చిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ ఆశ్యర్యపోయారు. ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారి వరకు అకుంఠిత దీక్షతో ముందుకు సాగడంపై ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అంతటితో ఆగకుండా ఫలితాల సాధనకు జిల్లా స్థాయి అధికారులు తీసుకున్న చర్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ వీరభద్రయ్య, డ్వామా పీడీ పోలప్ప, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ భాస్కరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కమల, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, కార్మిక శాఖ డీసీఎల్ అఖిల్, ఒంగోలు డీఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణపై అభినందనలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు సమర్థవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్కుమార్లను ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ వారి చాంబర్లలో కలిసి అభినందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో జిల్లాను ముందు వరుసలో ఉంచారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గంటన్నరలోపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు ఏ స్వాములు, పీ మదన్మోహన్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎస్ఎన్ఎం వలి, ఐసీహెచ్ మాలకొండయ్య, కే శివకుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే పద్మకుమారి,కార్యదర్శి ఎన్వీ విజయలక్ష్మి తదితరులున్నారు. -
ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కును అడ్డుకుంటే అరెస్టు చేస్తాం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కును అడ్డుకుంటే అరెస్టు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ హెచ్చరించారు. దళిత నేత నీలం నాగేంద్రరావు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలు వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ ఓటర్లను అడ్డుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ ఓటర్లను ఓటు చూపించి వేయమని బెదిరించినా, తాము చెప్పిన వారికే ఓటు వేయమని దౌర్జన్యం చేసినా ఎస్సీ,ఎస్టీ యాక్ట్ క్లాజ్-7 ప్రకారం కేసులు నమోదు చేసేలా ఎస్పీ, జెడ్పీ సీఈఓలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కుపై పోలింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కు భంగం కలిగిందని ఫిర్యాదు చేసిన బాధితులకు 50 వేల రూపాయలు రిలీఫ్ ఇవ్వాలని, ఇలాంటి కేసులను నిర్లక్ష్యం చేసిన పోలీసు, పోలింగ్ అధికారుపై కేసులు నమోదు చేయాలని నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతి, స్టెప్ సీఈఓ రవి, ఏపీసీఎల్సీ నాయకుడు పొటికలపూడి జయరాం, పీవీరావు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత జనసభ నాయకుడు వేలూరి ప్రసాద్, అనంతవరం దళిత నాయకులు పాల్గొన్నారు. -
మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాం. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలంటే భయంగా ఉందని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే యుద్ధప్రాతిపదికన పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగుతారు. వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా రక్షణ కల్పిస్తారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలి’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 6వ తేదీ మొదటి విడత పోలింగ్ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలకుగానూ 21 స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన 769 ఎంపీటీసీ స్థానాలకుగానూ మొదటి విడత పోలింగ్ జరగనున్న 385 స్థానాలకు 1,056 మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. అదే విధంగా మొత్తం 56 జెడ్పీటీసీ స్థానాలకుగానూ మొదటి విడత 28 స్థానాలకు పోలింగ్ జరగనుందని, వాటికి 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 19 లక్షల 63 వేల 911 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వారిలో మొదటి విడత పోలింగ్‌లో 10 లక్షల 21 వేల 189 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. 4,062 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 7,170 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని కలెక్టర్ వెల్లడించారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విజయకుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 458 సమస్యాత్మక, 436 తీవ్ర సమస్యాత్మక, 74 మావోయిస్టు ప్రభావిత గ్రామాలున్నాయన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 222 సమస్యాత్మక, 216 తీవ్ర సమస్యాత్మక, 71 మావోయిస్టు ప్రభావిత గ్రామాలున్నాయని పేర్కొన్నారు. ఈ గ్రామాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తీవ్ర సమస్యాత్మక గ్రామాల్లో 1+2 ఆర్మ్డ్ సిబ్బంది, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో 2+8 సిబ్బందిని నియమిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణకు 225 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 131 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. గొడవలు జరుగుతాయని భావిస్తున్న కేంద్రాల్లో లైవ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నిరంతర నిఘా... ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు, వస్తువులతో ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నియంత్రించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ వెల్లడించారు. 36 చెక్ పోస్టులతోపాటు 36 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేజిస్టీరియల్ పవర్ కలిగిన వారిని స్క్వాడ్‌లో నియమించినట్లు చెప్పారు. మండల స్థాయిలో స్ట్రయికింగ్ ఫోర్స్, నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్‌లు ఉన్నాయన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బు, వస్తువులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తెలిస్తే వెంటనే 1077 టోల్‌ఫ్రీ నంబర్‌కుగానీ, కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్ 08592 281400కుగానీ సమాచారం అందించాలని కోరారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ... ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటర్ స్లిప్పుల పంపిణీని ప్రారంభించినట్లు విజయకుమార్ తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన 22 రకాల ఆధారాల్లో ఒకదానిని తప్పకుండా తీసుకురావాలని కోరారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకూ పోస్టల్ బ్యాలెట్... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రైవేట్ వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చేవారని, ఈసారి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అలాంటివారు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా పరిషత్ సీఈవో ప్రసాద్, ఏవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
జయ నామ సంవత్సరంలో మరింత అభివృద్ధి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జయ నామ సంవత్సరంలో జిల్లాలో మరింత అభివృద్ధి జరగాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆకాంక్షించారు. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. జయ నామ సంవత్సరం సందర్భంగా సోమవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కలెక ్టర్ ప్రసంగించారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని చెప్పారు. రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారికి శుభం కలగాలని కోరారు. కార్యక్రమంలో ఏజేసీ ప్రకాష్‌కుమార్, డీఆర్ఓ జీ గంగాధర్‌గౌడ్, స్టెప్ సీఈఓ బీ రవి, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ కే పోలప్ప, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం జ్వాలానరసింహం పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ విజయకుమార్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి పంచాం గాన్ని చదివి వినిపించారు. అక్షర సాహితీ సమితి అధ్యక్షుడు మాజేటి వెంకటసుబ్బయ్యశాస్త్రి ఉగాది పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రకృతికి, పండుగలకు గల అనుబంధాన్ని గుర్తుచేశారు. విజయ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. -
ప్రకాశంను ప్రగతి పథాన నడిపిద్దాం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకాశం జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలపాలని అధికారులకు ఉద్బోధించారు. 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో అధికారులు, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకు ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. 6588 ఎకరాల భూమి పంపిణీ: జిల్లాలో ఏడో విడత భూ పంపిణీ కింద 4400 కుటుంబాలకు 6588 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరో 1364 కుటుంబాలకు 1028 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో 6 లక్షల 69 వేల 972 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటి వరకు 6 లక్షల 66 వేల 516 హెక్టార్లలో సాగైనట్లు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు 25,642 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని, 25.14 కోట్ల రూపాయల నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో రూ 206 కోట్లతో 2.6 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ30.50 కోట్లతో 68,427 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో 6 లక్షల 15 వేల 330 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. 17,424 మందికి రూ 450.39 కోట్ల రుణాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 24,476 గ్రూపులకు రూ 604.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 17,424 మందికి రూ450.39 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 40,459 మందికి రూ41.7 కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,750 మందికి రూ41.25 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. డీఆర్డీఏ ద్వారా స్త్రీ నిధి కింద 2 లక్షల 89 వేల 260 మందికి రూ 106.99 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు లక్షా 43 వేల 179 మందికి రూ 70.98 కోట్లు అందించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 1055 మందికి రూ 1.49 కోట్ల విలువైన పరికరాలు ఇచ్చినట్లు తెలిపారు. 7556 పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం: విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలో 16343 పంపుసెట్లకు రూ 81.72 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 7556 పంపుసెట్లకు రూ37.78 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 157.79 కోట్లతో 50 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ53.31 కోట్లతో 24 సబ్స్టేషన్లు నిర్మించినట్లు తెలిపారు. గృహనిర్మాణ శాఖ ద్వారా 23,132 ఇళ్లను రూ183.47 కోట్లతో నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ70.41 కోట్లతో 8710 గృహాలు నిర్మించినట్లు తెలిపారు. వివిధ రకాల సహకార సంస్థల ద్వారా 24, 512 మందికి రూ 72.67 కోట్లు అందించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 6,125 మందికి రూ 7.08 కోట్లు అందించినట్లు చెప్పారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా 6లక్షల 21 వేల 153 మందికి 728 కోట్లు ఉపకార వేతనాలు, తదితరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల 135 మందికి రూ270.65 కోట్లు అందించినట్లు వివరించారు. రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల రోడ్లు: రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల మేర 122 రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ132.31 కోట్లతో 79 పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. రూ56.71 కోట్లతో 24 భవనాలు, వంతెనలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.80 కోట్లతో 7 భవనాలు నిర్మించినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 504 కిలోమీటర్లను 259.67 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటి వరకు రూ79.43 కోట్ల విలువైన 159 పనులు చేపట్టారన్నారు. రూ 56.90 కోట్లతో 458 భవనాలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 భవనాలు నిర్మించినట్లు వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ49.70 కోట్లతో 413 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 పనులు చేసినట్లు వివరించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా రూ541.49 కోట్లతో 3039 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ166.05 కోట్ల విలువైన 2201 పనులు చేపట్టారన్నారు. తాగునీరు, పారిశుధ్యంకు సంబంధించి రూ8.06 కోట్లతో 2022 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ4.90 కోట్లతో 1675 పనులు చేసినట్లు కలెక్టర్ వివరించారు. రూ 949.22 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా రూ949.22 కోట్లతో 28 పనులు చేయాలని నిర్ణయించగా, రూ487.21 కోట్లతో 28 పనులు పూర్తిచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో నాగార్జునసాగర్ కాలువలు, మధ్యతరహా ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూ 476.22 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ313.71 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రూ 473 కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ173 కోట్ల విలువైన పనులు జరిగినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి రూ39.18 కోట్ల విలువైన 459 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ 13.10 కోట్లతో 149 పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయకుమార్ వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్పీ ప్రమోద్‌కుమార్, జిల్లా జడ్జి రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.