ఒంగోలు టౌన్ : పింఛన్ల మంజూరుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును కోరారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జరగనున్న జన్మభూమి-మన ఊరు, పారిశుధ్యం, పింఛన్ల పంపిణీ తదితరాలపై సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేయనున్న పింఛన్లు, డ్వాక్రా బజార్ల నిర్వహణ, డ్వామా నిబంధనల్లో స్పష్టత ఇవ్వాలన్నారు.
2 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలి : సీఎస్
అక్టోబర్ 2వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. జన్మభూమి-మన ఊరు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పండగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు.
అక్టోబర్ రెండవ తేదీ ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడానికి మండలానికి ఒక ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో పైపులైన్ల లీకేజీలు, డ్రెయిన్ల మరమ్మతులు 48 గంటల్లో పూర్తిచేసి వెబ్‌సైట్‌లో ఫొటోలు పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ యాకూబ్ నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, జెడ్పీ సీఈఓ ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల ఫిర్యాదులను ఎంపీడీఓకు తెలపాలి
పింఛన్లపై ఫిర్యాదులు ఉంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అప్పీలు చేసుకోవాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ సూచించారు. కొనకనమిట్ల మండలానికి చెందిన కొంతమంది తమకు పింఛన్లు రావడం లేదని సోమవారం కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. అర్హులమైన తమను జాబితా నుంచి తొలగించి, అనర్హుల పేర్లను జాబితాలో చేరుస్తున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులను మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలించి చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు.
పింఛన్లపై స్పష్టత ఇవ్వండి
Published Tue, Sep 30 2014 2:33 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement