సాక్షి, ఒంగోలు టూటౌన్: పండుటాకుల ఆవేదన.. వికలాంగుల ఆందోళన.. దివ్యాంగుల ఆక్రందన.. వితంతువుల మనోవేదన.. మత్య్సకార పెన్షనర్లు, కిడ్నీవ్యాధిగ్రస్తులు, చర్మ కారులు, కల్లుగీత కార్మికులు ఇలా చెప్పుకుంటూపోతే పింఛనర్లందరూ ఐదేళ్లుగా పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పింఛన్ పొందేందుకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ గ్రామాల్లో జన్మభూమి కమిటీల జోక్యంతో ఏళ్లతరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పింఛన్ అందలేదు. జన్మభూమి కమిటీలు కరుణించిన వారికే పింఛన్లు. టీడీపీ ముద్ర వేయించుకున్న వారికే పథకాలు. గడిచిన నాలుగున్నరేళ్లుగా పింఛన్‌దారులను వేపుకుతిన్న తెలుగుదేశం ప్రభుత్వం.. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో నెలరోజులు ముందుగా పింఛన్లు పెంచి వారందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన పింఛన్‌దారులంతా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిం చిన పింఛన్ల పెంపు పథకానికే జై కొడుతున్నారు. చంద్రబాబు చేతిలో మరో ఐదేళ్లు మోసపోయేందుకు సిద్ధంగా లేమని, జగన్‌తోనే అర్హులందరికీ పింఛన్లు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలలో భాగంగా ప్రకటించిన పింఛన్ల పెంపు పథకంపై లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తానని, అవ్వతాతకి పింఛన్‌ను ప్రస్తుతం ఉన్న దానికన్నా మరో వెయ్యి పెంచుతానని, వికలాంగులు, ఇతర అన్నివర్గాల పింఛన్‌దారులకు కూడా పింఛన్ల పెంపు పథకాన్ని వర్తింపజేస్తానని జగన్ ఇచ్చిన హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు ఓట్ల పథకాలపై వ్యతిరేకత...
ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం ఓట్ల కోసమే జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి పింఛన్లు పెంచడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓట్ల కోసం పింఛన్లు పెంచారే తప్ప జనం కోసం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. నాలుగున్నర సంవత్సరాలుగా ఎలాంటి సంక్షేమ పథకాలనూ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కేవలం రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా, కొత్త హామీలతో మళ్లీ మోసం చేయాలని సీఎం చూస్తుండటాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. అదే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణ సాధ్యమయ్యే, అందరికీ మేలు కలిగే హామీలు మాత్రమే ఇవ్వడాన్ని గమనించిన ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకే పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో వృద్ధాప్య పెన్షనర్లు | 1,76,910 |
వితంతు పెన్షనర్లు | 1,33,149 |
దివ్యాంగ పెన్షనర్లు | 39,652 |
అభయహస్తం పెన్షనర్లు | 4,632 |
డప్పు కళాకారుల పెన్షనర్లు | 3,107 |
మత్స్యకార పెన్షనర్లు | 3,475 |
ఒంటరి మహిళా పెన్షనర్లు | 8,561 |
కల్లుగీత కార్మిక పెన్షనర్లు | 384 |
చర్మకార పెన్షనర్లు | 3,237 |
ట్రాన్స్‌జెండర్లు | 100 |
వీవర్స్ పెన్షనర్లు | 8,926 |
కిడ్నీవ్యాధిగ్రస్తులైన పెన్షనర్లు | 380 |
జిల్లాలోని మొత్తం పెన్షనర్లు |
3,82,513 |
45 సంవత్సరాలకే పింఛన్ హామీ జగనన్న ఇచ్చిన వరం
45 సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛన్ ఇస్తానంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మహిళలకు ధైర్యాన్నిచ్చింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో పింఛన్ పెంచి వృద్ధులను ఆదుకున్నారు. నేడు జగన్‌మోహన్‌రెడ్డి 45 సంవత్సరాలకే పింఛన్ పథకం ప్రకటించి మహిళలకు అండగా నిలబడటం శుభపరిణామం.
- గోను హైమావతి, జంగంవారిపల్లి
టీడీపీ పాలనలో చాలా ఇబ్బంది పెట్టారు
వృద్ధులకు పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతూ జగన్ ఇచ్చిన హామీ మాలాంటి ముసలోళ్ల జీవితాలకు భరోసానిచ్చింది. ప్రస్తుత టీడీపీ పాలనలో పొలం ఉందని, ఆధార్ కార్డులో వయసు తప్పు ఉందని, జన్మభూమి కమిటీలు ఆమోదించాలని, సవాలక్ష కొర్రీలు పెట్టి అనేక మంది వృద్ధుల పింఛన్‌ను తీసేవేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన హామీ మాకు కొండంత ధైర్యాన్నిచ్చింది.
రేగలగడ్డ పెదమాలకొండయ్య, డీజీ పేట
వైఎస్ జగన్‌పై మాకు నమ్మకం ఉంది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పింఛన్ల పెంపు పథకంపై మాకు నమ్మకం ఉంది. దానివల్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మేలు జరుగుతుంది. పింఛన్ నగదును 2 వేల నుంచి 3 వేలకు పెంచితే ఎంతో ఆసరాగా ఉంటుంది. మా మేలు కోరే జగన్‌కు మేము ఎప్పుడూ అండగా ఉంటాం.
- టి.రాహేలమ్మ, వెలిగండ్ల
పింఛన్ల పెంపుతో ఎంతో ఉపయోగం
వైఎస్సార్ సీపీ వస్తే అమలు చేసే పింఛన్ల పెంపు పథకం వృద్ధులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వృద్ధులు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారంతా జగన్ సీఎం అయి పింఛన్లు పెంచితే ఎవరిపై ఆధారపడకుండా జీవించొచ్చు. పింఛన్ల వయోపరిమితి తగ్గించడం కూడా మంచిదే.
- కుందురు వెంకటేశ్వరరెడ్డి, దాసళ్లపల్లి
రూ.3 వేల పింఛన్ ఇస్తే పండగే
ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోయాయి. వాటికి అనుగుణంగా వృద్ధులను ఆదుకునేందుకు రూ.3 వేలు పింఛన్ ఇస్తే మాకు పండగే. జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల ద్వారా పింఛన్ పెంపు పథకాన్ని ప్రకటించడం నిజంగా ఆనందకరం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలన్నీ పేద ప్రజలకు చేయూతనిచ్చేవే.
- కట్టా హనుమయ్య, దొండపాడు
Comments
Please login to add a commentAdd a comment