ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. మొత్తం 543 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ అంగీకరించారు. జిల్లాకు 601 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.
మొత్తం 601 పోస్టులకు 543 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 58 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. మొదట ఒక జాబితాను అధికారులు ఆమోదించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో మొదటి ఎంపికను నిలిపివేసి మళ్లీ అర్హులైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. అన్ని మండలాల నుంచి దరఖాస్తులను ఒంగోలు తెప్పించి మెరిట్ జాబితా తయారు చేసి రోస్టర్ ప్రకారం ఎంపిక చేశారు.
మొత్తం 601 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల్లో 543 భర్తీ చేశారు. 58 ఖాళీగా మిగిలిపోయాయి. సెకండరీ గ్రేడ్, భాషా పండితుల పోస్టుల్లో నియమితులయ్యే ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.5 వేలు చొప్పున, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమితులయ్యే వారికి నెలకు రూ.7 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. వీరు పోస్టుల్లో చేరిన తేదీ నుంచి మూడు నెలల పాటు కొనసాగుతారు.
నియామకాలు ఇలా..
జిల్లాలో పుల్లలచెరువు మండలంలో అత్యధికంగా 45 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. దొనకొండ మండలంలో 39 మంది, సీఎస్ పురం మండలంలో 36, పామూరు మండలంలో 34, యర్రగొండపాలెం మండలంలో 33, త్రిపురాంతకం మండలంలో 30, పెదదోర్నాల మండలంలో 29, కురిచేడు మండలంలో 28, పీసీ పల్లి మండలంలో 20, కొనకనమిట్ల మండలంలో 17, కనిగిరి, మార్కాపురం, పెదారవీడు మండలాల్లో 12 మంది చొప్పున, హెచ్‌ఎం పాడు మండలంలో 11, ముండ్లమూరు, వెలిగండ్ల మండలాల్లో 10, మార్టూరు మండలం 9, తర్లుబాడు, జరుగుమల్లి, సంతమాగులూరు, బేస్తవారిపేట మండలాల్లో 8 మంది చొప్పున, చీమకుర్తి, పర్చూరు, తాళ్లూరు మండలాల్లో ఆగురుగు చొప్పున, పొదిలి మండలం ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. కొత్తపట్నం మండలంలో అతి తక్కువగా కేవలం ఒకే ఒక అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌ను ఎంపిక చేశారు. మిగిలిన మండలాల్లో ఒకరి నుంచి నలుగురి వరకు నియమితులయ్యారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
Published Thu, Nov 6 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement