ఒంగోలు టౌన్: జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన జన్మభూమి - మాఊరు సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు సూక్ష్మ ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1030 పంచాయతీలు, 225 మునిసిపల్ వార్డుల్లో 1255 గ్రామసభలు నిర్వహించామన్నారు. మొత్తం 2 లక్షల 80 వేల అర్జీలు వచ్చాయన్నారు.
అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి లక్షా 2 వేల 38 అర్జీలు, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు 42,650 అర్జీలు, హౌసింగ్ 38,469 అర్జీలు, ఉపాధి హామీ పథకానికి 11,754 అర్జీలు, మునిసిపాలిటీలకు 5 వేల అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీల్లో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అంతేగాకుండా కొత్త వనరులు సమీకరించే దానిపై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అర్జీదారులందరి నుంచి ఆధార్ నంబర్ తీసుకోవడంతోపాటు వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. అర్జీల పురోగతిపై సంబంధిత సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్‌లో బోగస్‌ను నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు.
జన్మభూమి గ్రామసభల్లో 2 లక్షల 56 వేల మందికి 41.75 కోట్ల రూపాయలను ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేసినట్లు వివరించారు. లక్షా 16 వేల 817 మందికి వృద్ధాప్య పింఛన్లు, 83 వేల 25 మందికి వితంతు పింఛన్లు, 6,107 మందికి చేనేత పింఛన్లు, 18,101 మందికి అభయహస్తం పింఛన్లు, 31,673 మందికి వికలాంగ పింఛన్లు అందించినట్లు వివరించారు.
79 వేలు తొలగింపు.. 27 వేలు పునరుద్ధరణ:
పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆ తరువాత వాటిని విచారించి 27 వేల పింఛన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన పింఛన్లు విచారణలో ఉన్నట్లు తెలిపారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి అందించాల్సి ఉంటుందన్నారు.
మండల స్థాయి కమిటీ వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపిస్తోందన్నారు. వాటన్నింటినీ విచారించిన తరువాత అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని విజయకుమార్ వివరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చినవి అధికంగా ఉన్నట్లు చెప్పారు.
ఆధార్ అనుసంధానంలో ముందంజ:
ఆధార్ అనుసంధానం విషయంలో జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉందని కలెక్టర్ వెల్లడించారు. రేషన్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల నమోదుకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో గతంలో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 82.15 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా చేరిందన్నారు.
పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. చీరాల మండలంలో 80 శాతం టాలీ కాని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా వివరాలు తీసుకుంటూ పాత వాటిని పరిశీలిస్తూ అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ఇరువర్గాల వారిని పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నట్లు చెప్పారు.
ప్లేట్‌లెట్ మిషన్‌ను అడుగుతూనే ఉన్నాం:
ఒంగోలు రిమ్స్‌లో ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటు విషయమై ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ డెరైక్టర్‌కు చెప్పి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించానన్నారు. తాను కూడా ఈ విషయాన్ని స్వయంగా సంబంధిత మేనేజింగ్ డెరైక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దృష్టికి కూడా ప్లేట్‌లెట్ మిషన్ విషయాన్ని తీసుకెళ్లామన్నారు.
జెడ్పీ చైర్మన్‌కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ చూస్తే చెబుతాను:
జిల్లా పరిషత్ చైర్మన్‌కు సంబంధించి తాజాగా వచ్చిన అఫీషియల్ ఆర్డర్ చూస్తే దాని గురించి చెబుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈదర హరిబాబు తిరిగి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన పైవిధంగా స్పందించారు. కోర్టు ఏ డెరైక్షన్ ఇస్తే దానిని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈదర హరిబాబు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
Published Wed, Nov 12 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement