Janmabhoomi - my village
-
పింఛను..వంచను!
ఒంగోలు టౌన్: సామాజిక భద్రత పింఛన్లలో అధికార పార్టీ ముద్ర కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని అధికారుల ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ఒంగోలు నగర పరిధిలో 830 మందికి మంగళవారం పింఛన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తమకు పింఛన్లు వస్తాయని ఆశించిన ఎంతోమందికి నిరాశే మిగిలింది. అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే పింఛన్లు మంజూరు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అధికారపార్టీ సూచించిన వారికే పింఛన్లు మంజూరు చేశారు. ఏకపక్షంగా పింఛన్లు మంజూరు చేయడంతో అర్హులైన అనేక మంది తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 830/1635 ఒంగోలు నగరంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో 2700 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేసినట్లు మునిసిపల్ యంత్రాంగం వెల్లడించింది. ఇటీవల 1065 మందికి పింఛన్లు అందించారు. మరో 1635 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వారిలో 830 మందికి మంగళవారం పింఛన్లు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ 830 మంది జాబితాను పరిశీలిస్తే అధికారపార్టీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికే పింఛన్లు మంజూరు చేశారు. ఆ జన్మభూమి కమిటీలు కూడా డివిజన్ల వారీగా గతంలో మంజూరైన పింఛన్లను క్రాస్ చెక్ చేసి తమ పార్టీకి అనుకూలురైన వారి పేర్లను చేర్పించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ ముద్ర లేకపోవడం, కొన్నిచోట్ల జన్మభూమి కమిటీలు డబ్బులు డిమాండ్ చేయడంతో వాటిని ఇవ్వలేని వారి పేర్లను మంజూరు జాబితా నుంచి పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016 సంవత్సరంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులను పక్కన పెట్టి ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేయడం చూస్తుంటే లబ్ధిదారుల ఎంపిక ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పింఛన్ కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూపు: కిష్టయ్య పింఛన్ కోసం మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఇంతవరకు మంజూరు చేయలేదని స్థానిక రాజాపానగల్ రోడ్డు 14వ అడ్డరోడ్డుకు చెందిన జి.కిష్టయ్య అనే 67 ఏళ్ల వృద్ధుడు వాపోయాడు. జన్మభూమి కార్యక్రమం జరిగిన ప్రతిసారీ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, పింఛన్ల జాబితాలో తన పేరు ఉందని చెప్పడం, పంపిణీ చేసే సమయంలో తనను పక్కన పెట్టడం జరుగుతూ వస్తోందన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు పింఛన్ ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తుంటే మంజూరు చేయకుండా తిప్పుకుంటున్నారని వాపోయాడు. నగరంలో తనలాంటి వారు అనేకమంది ఉన్నారని తెలిపాడు. తనబోటి వారికి పింఛన్లు ఇవ్వకుండా తిప్పుకోవడం మంచిది కాదని వాపోయాడు. -
కిరికిరి కమిటీలు..ఇంకా ఎందుకో!
► మితిమీరిన జన్మభూమి కమిటీల ఆగడాలు ► ఐదు నెలల క్రితమే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ► మిత్రపక్షం బీజేపీ నుంచీ అసంతృప్తి సెగలు ► ప్రవేశపెట్టిన అధికార పార్టీకే మైండ్‌బ్లాక్ ► సలహాలకే పరిమితం చేస్తానంటున్న సీఎం ► ఇప్పటికైనా రద్దు చేయాలని ప్రజల డిమాండు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలు జన్మభూమి కమిటీలు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నుంచి పంపిణీ వరకూ అన్ని వాటి సిఫారసులతోనే చేయాలని జిల్లా అధికారులకు గత ఏడాది ఆదేశాలిచ్చిన ఘనత ఆయన ప్రభుత్వానిదే. ఇప్పుడు అవి హద్దులు దాటాయని, అధికారాలు తీసేసి సలహాలకే పరిమితం చేయాలని ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అన్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి సహాయం చేసిన తమనే జన్మభూమి కమిటీలు లెక్క చేయట్లేదని, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాయని మిత్రపక్షం బీజేపీ.. సోమవారం విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మండిపడింది. అసలు ఈ జన్మభూమి కమిటీలే ఓ మాదిరి కిరికిరి కమిటీలని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ అధికారాలను కాదని, వాటికే పవర్ కట్టబెట్టడమేమిటని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకూ తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి ఉపయోగపడతాయని భావించిన జన్మభూమి కమిటీలు ప్రస్తుతం భస్మాసుర హస్తంలా మారడంతో అధికార పార్టీ ఆలస్యంగా మేల్కొంటున్నట్టుంది. ఈ కమిటీలు హద్దులు దాటిపోయయని, వాటిని సలహాలకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారట! ఇంత జరుగుతున్నా ఈ కమిటీలను రద్దు చేస్తామని చెప్పడం మానేసి, ఇంకా వాటిని కొనసాగించాలని చూడటం ఎంతవరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతు రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకూ, లిక్కర్ పాలసీ నుంచి ఇసుక విధానం వరకూ ప్రతి అంశం అమల్లోనూ టీడీపీ ప్రభుత్వం బొక్కబోర్లా పడుతోందని.. ముందు తమవే మంచి విధానాలని చెప్పుకొని తర్వాత నాలుక కరుచుకోవడం అలవాటైపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలు కూడా ఇదే కోవలో చేరాయని అంటున్నారు. ఎందుకీ జన్మభూమి కమిటీలు? పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ, ఇంటిపట్టా నుంచి పక్కా ఇల్లు వరకూ, మరుగుదొడ్డి నిర్మాణం నిధుల నుంచి బ్యాంకు రుణం వరకూ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తేనే అధికార ముద్ర పడుతుంది. టీడీపీ ప్రభుత్వం అనాలోచితంగా కట్టబెట్టిన ఈ రాజ్యాంగేతర అధికారాలవల్ల బిల్లు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ, చివరకు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి! అయినప్పటికీ ఇటీవలే పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలోనే కాదు పింఛన్ల పంపిణీలోనూ జన్మభూమి కమిటీలకే అధికారాలు కట్టబెడుతూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతరశక్తులుగా తయారయ్యాయని పేర్కొంటూ, వాటికి ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాలను సవాలు చేస్తూ ఇప్పటికే జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. పథకాలపై సర్వాధికారం ఏ ఆధారమూ లేని వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఇచ్చే పింఛనుకు అర్హులైనవారిని ఏడాదిన్నర క్రితం వరకూ గ్రామపంచాయతీల పరిధిలోనే ఎంపిక చేసేవారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసుతోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇటీవలి ఉత్తర్వుల ఫలితంగా జన్మభూమి కమిటీ సభ్యులు వేలిముద్ర వేయకుండా లబ్ధిదారులు తమ పింఛను మొత్తాన్ని తెచ్చుకోలేరు. పారదర్శకత పేరుతే ప్రభుత్వం చేస్తున్న ఈ పనులవల్ల పింఛనుదారులు ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల లబ్ధిదారులకు అందే కొంత మొత్తంలోనూ జన్మభూమి కమిటీ సభ్యులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గతంలో ప్రాతినిధ్యం వహించిన తుని నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే సాకుతో పింఛన్ల నుంచి రూ.100 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకించినవారివి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలవి కలిపి ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 5,472 పింఛన్లు తొలగించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు చంద్రన్న కానుక సరుకులను కూడా రేషన్ డీలర్లు కాకుండా జన్మభూమి కమీటీ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. ఒకప్పుడు ఇళ్లస్థలాల లబ్ధిదారుల ఎంపిక అర్హతే ప్రాతిపదికగా జరిగేది. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల దరఖాస్తులకే జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరకు వారు సిఫారసు చేస్తేనే ఇంటి రుణం మంజూరవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలు కూడా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసినవారికే ప్రస్తుతం మంజూరవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. -
సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం
ఒంగోలు టౌన్: జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన జన్మభూమి - మాఊరు సభల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు సూక్ష్మ ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో సూక్ష్మ ప్రణాళికతో ప్రగతి రథం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1030 పంచాయతీలు, 225 మునిసిపల్ వార్డుల్లో 1255 గ్రామసభలు నిర్వహించామన్నారు. మొత్తం 2 లక్షల 80 వేల అర్జీలు వచ్చాయన్నారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి లక్షా 2 వేల 38 అర్జీలు, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు 42,650 అర్జీలు, హౌసింగ్ 38,469 అర్జీలు, ఉపాధి హామీ పథకానికి 11,754 అర్జీలు, మునిసిపాలిటీలకు 5 వేల అర్జీలు వచ్చాయన్నారు. ఈ అర్జీల్లో వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఎన్ని ఉన్నాయో గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా కొత్త వనరులు సమీకరించే దానిపై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అర్జీదారులందరి నుంచి ఆధార్ నంబర్ తీసుకోవడంతోపాటు వారి సెల్‌ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. అర్జీల పురోగతిపై సంబంధిత సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లు పంపించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్‌లో బోగస్‌ను నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో 2 లక్షల 56 వేల మందికి 41.75 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేసినట్లు వివరించారు. లక్షా 16 వేల 817 మందికి వృద్ధాప్య పింఛన్లు, 83 వేల 25 మందికి వితంతు పింఛన్లు, 6,107 మందికి చేనేత పింఛన్లు, 18,101 మందికి అభయహస్తం పింఛన్లు, 31,673 మందికి వికలాంగ పింఛన్లు అందించినట్లు వివరించారు. 79 వేలు తొలగింపు.. 27 వేలు పునరుద్ధరణ: పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆ తరువాత వాటిని విచారించి 27 వేల పింఛన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన పింఛన్లు విచారణలో ఉన్నట్లు తెలిపారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి అందించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి కమిటీ వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపిస్తోందన్నారు. వాటన్నింటినీ విచారించిన తరువాత అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని విజయకుమార్ వివరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చినవి అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఆధార్ అనుసంధానంలో ముందంజ: ఆధార్ అనుసంధానం విషయంలో జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉందని కలెక్టర్ వెల్లడించారు. రేషన్‌కార్డులు, స్కాలర్షిప్లు, విద్యార్థుల నమోదుకు సంబంధించి మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో గతంలో రాష్ట్రంలో 13వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 82.15 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా చేరిందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. చీరాల మండలంలో 80 శాతం టాలీ కాని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్తగా వివరాలు తీసుకుంటూ పాత వాటిని పరిశీలిస్తూ అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ఇరువర్గాల వారిని పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నట్లు చెప్పారు. ప్లేట్లెట్ మిషన్‌ను అడుగుతూనే ఉన్నాం: ఒంగోలు రిమ్స్‌లో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు విషయమై ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ డెరైక్టర్‌కు చెప్పి మరోమారు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించానన్నారు. తాను కూడా ఈ విషయాన్ని స్వయంగా సంబంధిత మేనేజింగ్ డెరైక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దృష్టికి కూడా ప్లేట్లెట్ మిషన్ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. జెడ్పీ చైర్మన్‌కు సంబంధించి అఫీషియల్ ఆర్డర్ చూస్తే చెబుతాను: జిల్లా పరిషత్ చైర్మన్‌కు సంబంధించి తాజాగా వచ్చిన అఫీషియల్ ఆర్డర్ చూస్తే దాని గురించి చెబుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈదర హరిబాబు తిరిగి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన పైవిధంగా స్పందించారు. కోర్టు ఏ డెరైక్షన్ ఇస్తే దానిని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈదర హరిబాబు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.