ఒంగోలు టౌన్: అక్షరాస్యత సాధనలో అత్యున్నత ఫలితాలు సాధించిన జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్‌కు అరుదైన గుర్తింపు పొందారు. ‘ప్రకాశం అక్షర విజయం’ పేరుతో కేవలం తొమ్మిది నెలల కాలంలో 18 శాతం అక్షరాస్యతను పెంపొంధించిన విషయం తెలిసిందే. జాతీయ సాక్షరతా మిషన్ దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో మంచి ఫలితాలు సాధించిన జిల్లాల్లో రాష్ట్రం నుంచి ప్రకాశంను ఎంపిక చేసింది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలోని విద్యాభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జాతీయ సాక్షర భారత్ అవార్డును అందుకోనున్నారు.
ఈ నేపధ్యంలో కలెక్టర్ విజయకుమార్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రెండు దశల్లో నిర్వహించిన ప్రకాశం అక్షర విజయంలో 4లక్షల 75వేల 39మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినట్లు తెలిపారు. దీంతో జిల్లాలో అక్షరాస్యత శాతం 78.84 శాతానికి పెరిగిందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశ సరాసరి అక్షరాస్యతకంటే జిల్లా అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని, ప్రకాశం అక్షర విజయంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు వివరించారు.
గతంలో అక్షరాస్యత సాధన ఉద్యమం చేపట్టిన దశాబ్ధ కాలంలో 15 నుంచి 18 శాతం పెరిగిందని, అక్షర విజయంతో కేవలం 9 నెలల వ్యవధిలో 63 శాతం నుంచి 78.84శాతం పెరిగిందన్నారు. స్వల్ప వ్యవధిలో ఇలా అక్షరాస్యత దేశంలో ఎక్కడా పెరగలేదన్నారు.
రాష్ట్రంలో అక్షరాస్యతలో ప్రకాశం జిల్లా 10వ స్థానంలో ఉండేదని, ప్రస్తుత ఫలితాలతో 5వ స్థానానికి చేరుకున్నట్లు వివరించారు. జాతీయ సాక్షర భారత్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి అవార్డులు, రివార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. చదువుతోనే ప్రగతి సాధించవచ్చన్న ఉద్దేశ్యంతో చేపట్టిన అక్షర యజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. నూరుశాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అభినందనల వెల్లువ
జిల్లా కలెక్టర్ విజయకుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపధ్యంలో బుధవారం ఆయనను జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డిప్యూటీ డెరైక్టర్ కేటీ వెంకయ్య, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, స్టెప్ సీఈఓ బి. రవి, ఉద్యానశాఖ ఏడీలు రవీంద్రబాబు, జెన్నమ్మ, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్యాంబాబులతోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం, జిల్లా గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్‌ను కలిసి బొకోల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా అరుదైన అవార్డు
Published Thu, Sep 4 2014 1:48 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement
Advertisement