ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కును అడ్డుకుంటే అరెస్టు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ హెచ్చరించారు. దళిత నేత నీలం నాగేంద్రరావు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలు వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ ఓటర్లను అడ్డుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ ఓటర్లను ఓటు చూపించి వేయమని బెదిరించినా, తాము చెప్పిన వారికే ఓటు వేయమని దౌర్జన్యం చేసినా ఎస్సీ,ఎస్టీ యాక్ట్ క్లాజ్-7 ప్రకారం కేసులు నమోదు చేసేలా ఎస్పీ, జెడ్పీ సీఈఓలకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.
ఈ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కుపై పోలింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కు భంగం కలిగిందని ఫిర్యాదు చేసిన బాధితులకు 50 వేల రూపాయలు రిలీఫ్ ఇవ్వాలని, ఇలాంటి కేసులను నిర్లక్ష్యం చేసిన పోలీసు, పోలింగ్ అధికారుపై కేసులు నమోదు చేయాలని నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతి, స్టెప్ సీఈఓ రవి, ఏపీసీఎల్‌సీ నాయకుడు పొటికలపూడి జయరాం, పీవీరావు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత జనసభ నాయకుడు వేలూరి ప్రసాద్, అనంతవరం దళిత నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ,ఎస్టీల ఓటు హక్కును అడ్డుకుంటే అరెస్టు చేస్తాం
Published Sat, Apr 5 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement