ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాం. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలంటే భయంగా ఉందని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే యుద్ధప్రాతిపదికన పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగుతారు. వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా రక్షణ కల్పిస్తారు.
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలి’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 6వ తేదీ మొదటి విడత పోలింగ్ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలకుగానూ 21 స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన 769 ఎంపీటీసీ స్థానాలకుగానూ మొదటి విడత పోలింగ్ జరగనున్న 385 స్థానాలకు 1,056 మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు.
అదే విధంగా మొత్తం 56 జెడ్పీటీసీ స్థానాలకుగానూ మొదటి విడత 28 స్థానాలకు పోలింగ్ జరగనుందని, వాటికి 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 19 లక్షల 63 వేల 911 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వారిలో మొదటి విడత పోలింగ్‌లో 10 లక్షల 21 వేల 189 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. 4,062 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 7,170 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని కలెక్టర్ వెల్లడించారు.
సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విజయకుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 458 సమస్యాత్మక, 436 తీవ్ర సమస్యాత్మక, 74 మావోయిస్టు ప్రభావిత గ్రామాలున్నాయన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 222 సమస్యాత్మక, 216 తీవ్ర సమస్యాత్మక, 71 మావోయిస్టు ప్రభావిత గ్రామాలున్నాయని పేర్కొన్నారు. ఈ గ్రామాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తీవ్ర సమస్యాత్మక గ్రామాల్లో 1+2 ఆర్మ్‌డ్ సిబ్బంది, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో 2+8 సిబ్బందిని నియమిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణకు 225 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 131 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. గొడవలు జరుగుతాయని భావిస్తున్న కేంద్రాల్లో లైవ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
నిరంతర నిఘా...
ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు, వస్తువులతో ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నియంత్రించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ వెల్లడించారు. 36 చెక్ పోస్టులతోపాటు 36 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేజిస్టీరియల్ పవర్ కలిగిన వారిని స్క్వాడ్‌లో నియమించినట్లు చెప్పారు. మండల స్థాయిలో స్ట్రయికింగ్ ఫోర్స్, నియోజకవర్గ స్థాయిలో స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్‌లు ఉన్నాయన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బు, వస్తువులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తెలిస్తే వెంటనే 1077 టోల్‌ఫ్రీ నంబర్‌కుగానీ, కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం నంబర్ 08592 281400కుగానీ సమాచారం అందించాలని కోరారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటర్ స్లిప్పుల పంపిణీని ప్రారంభించినట్లు విజయకుమార్ తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన 22 రకాల ఆధారాల్లో ఒకదానిని తప్పకుండా తీసుకురావాలని కోరారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందన్నారు.
ప్రైవేట్ వ్యక్తులకూ పోస్టల్ బ్యాలెట్...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రైవేట్ వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చేవారని, ఈసారి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అలాంటివారు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా పరిషత్ సీఈవో ప్రసాద్, ఏవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
Published Sat, Apr 5 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement