కందుకూరు : విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కందుకూరు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల పనితీరుపై అధికారులతో ఆయన మాట్లాడారు.
రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కి తరలినా, అధిక ధరలకు అమ్మినా సంబంధిత వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. డివిజన్ పరిధిలో వరి తక్కువగా సాగయ్యే కారణాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ మొత్తం మీద 28 శాతం లోటు కనిపిస్తుండగా, గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాల్లో అత్యధికంగా 56 శాతం లోటుందని చెప్పారు.
దొనకొండ మండలంలో 10 వేల హెక్టార్‌లలో పంట సాగు కావల్సి ఉండగా కేవలం 5 వేల హెక్టార్‌లలో మాత్రమే సాగయ్యాయన్నారు. దీంతో ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల పంటలు సాగు కాలేదని కలెక్టర్‌కి వివరించారు. నాగార్జున సాగర్ కాలువ పరిధిలో ప్రస్తుతం నీరు వదులుతున్నందున వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల వారీగా పంటల సాగు వివరాలను నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు.
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపుతారన్నారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని పశు సంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ రజనీకుమారిని ఆదేశించారు. సూక్ష్మసేద్యం పథకం కింద సెప్టెంబర్ నెలాఖరు నాటికి 868 హెక్టార్లు లక్ష్యం కాగా, 1530 హెక్టార్‌లలో లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రావు వివరించారు. వచ్చే నెలాఖరుకు మొత్తం 2150 హెక్టార్‌ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.
మత్య్సశాఖ అధికారులపై ఆగ్రహం: మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు జులై ఒకటో తేదీ నాటికి లెసైన్స్‌లు పునరుద్ధరించాల్సి ఉండగా, నేటికీ రెన్యువల్ చేయకపోవడంపై కలెక్టర్ ఆశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చినా, సమస్య వచ్చినా వారిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. మత్య్సకారులందరికీ అవగాహన కల్పించి వెంటనే లెసైన్స్‌లు పునరుద్ధరించాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో మత్య్సకారులు చేపలు ఎండబెట్టుకునేందుకు డ్రైయింగ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో...
పొదిలి మండలం ఉప్పలపాడు, శింగరాయకొండ, చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో శిశుమరణాలు అధికంగా నమోదు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులను, శిశువులను జాగ్రత్తగా గుర్తించి పేర్లు నమోదు చేయాలని, వారికి ఎప్పటికప్పుడు మందులు, వ్యాక్సిన్‌లు అందజేసి మాతృ, శిశుమరణాలను అరికట్టాలని ఆదేశించారు.
ప్రతి బిడ్డని గుర్తించి వ్యాక్సిన్‌లు వేయాలని వలస వెళ్లిన కుటుంబాల వారు ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీవో పీబీకే మూర్తి, ఎల్‌డీఎం నరశింగరావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు జెన్నమ్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అధిక ధరలకు అమ్మితే చర్యలు
Published Thu, Sep 25 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement