సాక్షి, హైదరాబాద్: రబీ సాగు కోసం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు విత్తనాలు, ఎరువు లు, పురుగుమందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకుల ద్వారా రైతులకు కొత్త అప్పులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 313 మండలాల్లో పంటనష్టం వాటిల్లినా కరువును ప్రకటించకుండా రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం బాధ్యతారహిత ప్రకటనలు చేశారన్నారు. పంటనష్టపోరుున రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1,350 కోట్లు కరువు సాయం కింద విడుదల చేసిందని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు.