సాక్షి, ఒంగోలు: జిల్లాకు అరుదైన గుర్తింపు దక్కింది. ఎన్నికలక్రతువు సమర్ధ నిర్వహణపై కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్‌కు ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అభినందనలు అందాయి. ఈనెల 22న పాండిచ్చేరిలో జరగనున్న ‘సౌత్‌జోన్ సింపోజియమ్’కు మన రాష్ట్రం నుంచి కలెక్టర్ హాజరవ్వాల్సిందిగా ఆహ్వానం అందింది. ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సు (సింపోజియమ్)లో కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఇక్కడ ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ప్రణాళికను వివరించాల్సి ఉంటుంది.
వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వివరించిన ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల ఆధారంగా ఁబెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీస్ అవార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. రాష్ట్రం నుంచి ప్రకాశం జిల్లాతో పాటు తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్‌లు సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ చేపట్టిన ఎన్నికల ప్రణాళిక విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తయారుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
తొలి ఫలితం వెల్లడి జిల్లా నుంచే..
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న పాండిచ్చేరి సదస్సులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కలెక్టర్‌లను గుర్తించారు. వారికి ప్రత్యేక ప్రసంశలు పంపుతూ ఆహ్వానపత్రాలు అందించారు. ఇందుకు గాను అర్హతగా వారు ఆయా జిల్లాల్లో చేపట్టిన ఎన్నికల ప్రణాళికలను పరిగణలోకి తీసుకున్నారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోని జిల్లాగా ఁప్రకాశం రికార్డుల్లోకెక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం జిల్లా నుంచే తొలి ఫలితం వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,84,109 మంది ఓటర్లుండగా, 2,880 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసి ..ఆయా ప్రాంతాలకు నోడల్ అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణపై శిక్షణ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల మెటీ రియల్ పంపిణీ, ఫ్లయింగ్ స్క్వాడ్, రవాణా వ్యవస్థ, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలికవసతులు తదితర అంశాలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపట్టడంతో విజయవంతమైన ఫలితాలొచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల సగటు జిల్లా పోలింగ్ శాతం 85.69 శాతం కాగా, దర్శి నియోజకవర్గంలోనే 91 శాతం పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 88.86 శాతం, ప్రాదేశికాల్లో 84.88 శాతం, మున్సిపాలిటీ ఎన్నికల్లో 82.46 శాతం పోలింగ్ జరిగింది. ఎక్కడా రీపోలింగ్, ఆరోపణలకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిగాయి. ఎస్‌సీ, ఎస్టీలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతో పాటు సంతమాగులూరు, మర్రిపూడి మండలంలోని రామాయపాలెంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లతో ఓట్లేయించిన సందర్భం తెలిసిందే.
ఎంపీటీసీ ఎన్నికల్లో టంగుటూరు బ్యాలెట్‌పత్రాల్లో అభ్యర్థిపేరు, ఎన్నికల గుర్తు తారుమారవగా.. అప్పటికప్పుడు బ్యాలెట్‌పత్రాలు మార్చి అంతకుముందు ఓట్లేసి వెళ్లిన వారిని వెనక్కి పిలిపించి మరీ ఓట్లేయించి పంపారు. చీరాల అసెంబ్లీ ఎన్నికల రాద్దాంతం, జెడ్పీచైర్మన్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ.. అధికార యంత్రాంగం చేపట్టిన వ్యూహాత్మక చర్యలను ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల వెల్లడిలో రాష్ట్రవ్యాప్తంగా తొలిగా ఉదయం 10.15 నిముషాలకు ఒంగోలు అసెంబ్లీ, 11.00 గంటలకు ఒంగోలు లోక్‌సభ ఫలితాలు వెల్లడిచేశారు. ఎన్నికలతీరు పరిశీలనకు జిల్లాలోని 12 నియోజకవర్గాలను ఒక్కరోజులో తానే స్వయంగా పర్యటించడం గుర్తించాల్సిన విషయం.
కలెక్టర్ లేఖలతో ఓటరు చైతన్యం..
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన దగ్గర్నుంచి ఓటరు చైతన్య కార్యక్రమాల్లో కలెక్టర్ చూపిన చొరవను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గుర్తించి పాండిచ్చేరి సింపోజియమ్ అజెండాలో పొందుపరిచింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల విద్యార్థులందరికీ ఓటుచైతన్యంపై కలెక్టర్ స్వయంగా లేఖరాసి.. వారి తల్లిదండ్రులకు చూపించి సంతకాలు పెట్టించుకు రావాలనే విధానం విజయవంతమైంది.
అదేవిధంగా ఇంటింటికీ ఓటరు స్లిప్పులతో పాటు ఓటుహక్కు విలువపై లేఖలను పంపిణీ చేశారు. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం 1.5 పెరిగింది. అదేవిధంగా అర్బన్ ఓటింగ్ వివరాల్లోకొస్తే.. 2009లో ఒంగోలులో 66.65 శాతం పోలింగ్ జరగ్గా.. 2014లో 70.45 శాతం నమోదైంది. గిరిజనులు అధికంగా ఉన్న యర్రగొండపాలెంలో కిందటి ఎన్నికల్లో 74.14 శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఇటీవల ఎన్నికల్లో 83.35 శాతం నమోదైంది. మార్కాపురంలోనూ 78.05 శాతం నుంచి 80.89 శాతం వరకు ఓటింగ్ పెరగడం విశేషం. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం మిగతా రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రణాళికతో కలిపి భవిష్యత్ నివేదికలు తయారు చేయనున్నారు.
జిల్లాకు అరుదైన గుర్తింపు
Published Wed, Aug 20 2014 3:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement