ఒంగోలు టౌన్ : ప్రకాశం అక్షర విజయం ద్వారా జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని 9 నెలల్లో 25 శాతం పెంచినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా అక్షరాస్యతలో 16వ స్థానంలో ఉండగా, విభజన అనంతరం 13 జిల్లాల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
స్వల్ప కాలంలో అధిక అక్షరాస్యత సాధించిన జిల్లాగా ప్రకాశం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో దీనిని అధ్యయనం చేసేందుకు ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ మహిళా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ సోమవారం ఒంగోలు వచ్చారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంపై స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ ఆమెకు వివరించారు. అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో రెండు దశల్లో అమలు చేసినట్లు చెప్పారు.
మొదటి దశలో 20 వేల 867 కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల 56 వేల 452 మందిని అక్షరాస్యులను చేయగా, రెండో దశలో 14 వేల 483 కేంద్రాలను ప్రారంభించి లక్షా 93 వేల 570 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చినట్లు వివరించారు. రెండు దశల్లో అక్షరాస్యత 78 శాతం సాధించినట్లు తెలిపారు. అన్ని స్థాయిల్లో అధికారులను భాగస్వాములుగా చేర్చి అందరికీ బాధ్యతలు అప్పగించడం వల్ల సమష్టిగా విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 20 వేల మంది వరకు అధికారులు, సిబ్బంది ఎలాంటి నగదు తీసుకోకుండా స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు తెలిపారు.
ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్
ప్రకాశం అక్షర విజయం ద్వారా అక్షరాస్యతలో సాధించిన పురోభివృద్ధిపై ముంబై నుంచి వచ్చిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్ ఆశ్యర్యపోయారు. ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారి వరకు అకుంఠిత దీక్షతో ముందుకు సాగడంపై ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అంతటితో ఆగకుండా ఫలితాల సాధనకు జిల్లా స్థాయి అధికారులు తీసుకున్న చర్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ వీరభద్రయ్య, డ్వామా పీడీ పోలప్ప, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ భాస్కరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కమల, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, కార్మిక శాఖ డీసీఎల్ అఖిల్, ఒంగోలు డీఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు.
9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపు
Published Tue, Aug 19 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement