టెన్షన్.. టెన్షన్.. | tension in political leaders | Sakshi
Sakshi News home page

టెన్షన్.. టెన్షన్..

Published Wed, May 7 2014 3:27 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

టెన్షన్.. టెన్షన్.. - Sakshi

టెన్షన్.. టెన్షన్..

పరిషత్, మున్సిపల్ ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బరిలో ఉన్న గెలుపా.. ఓటమా.. అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

సాక్షి, ఖమ్మం : పరిషత్, మున్సిపల్ ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బరిలో ఉన్న గెలుపా.. ఓటమా.. అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుస్తామని ధీమా ఉన్న అభ్యర్థులు మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పదవుల ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ వెలువరించకపోవడంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాతే ఎన్నిక ఉంటుందని ఆయా పార్టీల నేతలు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో చాలా రోజుల పాటు క్యాంప్‌లు నిర్వహించడం కష్టమేనని ఈ పదవుల రేసులో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారు.
 
 మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం..
 ‘స్థానిక’ ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నాచితక పందేలు గ్రామాల్లో ఉపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరిచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడం, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్ధం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు కీలకం కానుంది. ప్రస్తుతం శాసనసభ రద్దు కావడం, జూన్ 2 వరకు కొత్త ఎమ్మెల్యేలు,  ఎంపీల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోవడంతో వారు ఓటు వేసే పరిస్థితి లేదు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పరోక్ష ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఫలితం వెలువడిన తర్వాత కూడా మరికొన్ని రోజులు మున్సిపల్, పరిషత్ చైర్మన్లపై ఆశపెట్టుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. వెంటనే చైర్మన్ల ఎన్నిక ఉంటే ఆందోళన ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు.
 
 చైర్మన్ల పీఠంపై పార్టీల గురి..
 వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పడు అన్ని పార్టీలు చైర్మన్ల పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి.. స్పష్టమైన మెజారిటీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంతమంది గెలుస్తారు.. చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి.. వారిని తమవైపు ఎలా తిప్పుకోవాలి.. అనే అంశాలపై చర్చల్లో మునిగారు. జెడ్పీ, మున్సిపల్, పరిషత్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న నాయకులు గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా తమ నేతలను కాకా పడుతున్నారు. అయితే తమకు అనుకూలంగా ఏ అభ్యర్థి ఉంటాడు, అతను చైర్మన్ పీఠం కోసం ఖర్చు పెడతారా..? అని ఆయా నేతలు అన్వేషణలో పడ్డారు.
 
 క్యాంపులంటేనే బెంబేలు..

 మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత కాం్యపులంటేనే ఈ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితాలు వెల్లడైన పదిరోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే  క్యాంప్‌ల నిర్వహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంప్‌లు అంటేనే ఇటు పార్టీల నేతలు అటు ఈ పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంప్‌లు నిర్వహించకపోతే ప్రత్యర్థి పార్టీలు తమ మద్దతుదారులను ఎగురేసుకుపోతారనే భయం ఓవైపు ఉండగా..ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకుండా ఇన్ని రోజులు క్యాంప్‌లు నిర్వహిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఆందోళన వారిలో నెలకొంది. క్యాంప్‌లు వేయకపోతే ప్రత్యర్థి నుంచి ముప్పు పొంచి ఉండడంతో పాటు గెలిచిన వారి మనసు కూడా మారుతుందేమోనన్న అనుమానం వారిని వేధిస్తోంది. ఖర్చు పెడితే తమకే పదవులు దక్కుతాయా..? అని రేసులో ఉన్న వారు క్యాంప్‌లకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు.. మున్సిపల్, పరిషత్ చైర్మన్ల ఎన్నికను ఆపరని, సార్వత్రిక ఎన్నికలకు ముందే చైర్మన్ల ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులతో చైర్మన్ పీఠం రేసులో ఉన్న అభ్యర్థులు పరోక్ష ఎన్నికల తేదీ, క్యాంప్‌ల విషయంలో పరేషాన్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement