రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడుగానే మిగిలిపోతారని అనకాపల్లి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ అన్నారు.
నక్కపల్లి,న్యూస్‌లైన్ : రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడుగానే మిగిలిపోతారని అనకాపల్లి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ అన్నారు. నక్కపల్లిలో ఆదివారం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో మూడు ఎంపీ స్థానాలతో పాటు మెజార్టీ ఎమ్మెల్యే సీట్లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలోను, జిల్లాలోను తమపార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితీరుతారన్నారు. జగన్ సీఎం కావాలని కోట్లాదిమంది కోరుకుంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా అన్ని పథకాలు అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు.
మరో ఐదురోజుల్లో రాజన్న రాజ్యం రాబోతోందన్నారు. టీడీపీ వారు ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో మద్యాన్ని ఏరులా పారించారని, డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేశారని అన్నారు. అయితే ప్రజలు మాత్రం వి శ్వసనీయతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుచూపారన్నారు. స్థానికేతరులను గెలిపించడంవల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు గ్రహించారన్నారు. గతంలో ఇలాగే స్థానికేతరులకు పట్టం కడితే ఇక్కడ అభివృద్ధిని నాశనం చేశారని, ప్రాజెక్టులు తరలిపోతున్నా నోరు మూసుకుని చేతకాని వారిలా కూర్చొన్నారన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో ప్రజలకు తాము అండ గా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.