భన్వర్‌లాల్‌పై ఫిర్యాదు చేస్తాం
టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ సార్వత్రిక ఎన్నికలను నిజారుుతీగా నిర్వహించలేదని టీడీపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తన నివాసంలో రమేశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాత్రింబవళ్లు కష్టపడాల్సింది పోయి భన్వర్‌లాల్ మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యాలయానికి వచ్చేవారని ఆరోపించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొందరు ఫ్యాక్షన్ నాయకులు దాడులు చేసినా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సీమాంధ్రలో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.