కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినందున కౌటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి కృషి చేసిన కలెక్టర్, జాయింట్‌కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను అభినందించారు. అదే తరహాలో కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సమయానికి వచ్చే పోస్టల్ బ్యాలెట్‌లను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
ఆలోపు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పకడ్బందీగా భద్ర పరచాలని తెలిపారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ప్రత్యేక టేబుళ్లను తగినన్ని ఏర్పాటు చేసుకొని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫొటోలతో కూడిన డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపాలని తెలిపారు. పత్రికల్లో వచ్చిన చెల్లింపు వార్తలకు సంబంధించి అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి ఫైనలైజ్ చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కర్నూలు నుంచి కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీతో కలిసి సందర్శిస్తూ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాకు మరో ఐదుగురు పరిశీలకులు అవసరమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 28 మంది మైక్రో పరిశీలకులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కన్నబాబు, ఎస్పీ రఘురామిరెడ్డి, ఏజేసీ రామస్వామి, రిటర్నింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.