C.sudharahan reddy
-
కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినందున కౌటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి కృషి చేసిన కలెక్టర్, జాయింట్‌కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను అభినందించారు. అదే తరహాలో కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సమయానికి వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఆలోపు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పకడ్బందీగా భద్ర పరచాలని తెలిపారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ప్రత్యేక టేబుళ్లను తగినన్ని ఏర్పాటు చేసుకొని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫొటోలతో కూడిన డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపాలని తెలిపారు. పత్రికల్లో వచ్చిన చెల్లింపు వార్తలకు సంబంధించి అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి ఫైనలైజ్ చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీతో కలిసి సందర్శిస్తూ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాకు మరో ఐదుగురు పరిశీలకులు అవసరమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 28 మంది మైక్రో పరిశీలకులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కన్నబాబు, ఎస్పీ రఘురామిరెడ్డి, ఏజేసీ రామస్వామి, రిటర్నింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
సమరానికి సర్వం సిద్ధం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ‘సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి’ అని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా మంగళవారం సాయంత్రం తన ఛాంబర్లో కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జిల్లా వ్యాప్తంగా నెలరోజులుగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. పోలింగ్ శాతం 85 నుంచి 90 శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నాం. పోలింగ్ రోజున పోల్ రిపోర్టింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పోలింగ్ అధికారుల సెల్ నెంబర్లతో అనుసంధానమై గంటగంటకు పోలింగ్ సరళిని తెలుసుకుంటాం. అలాగే ఎన్నికల మానిటరింగ్ కోసం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌ను రిసోర్స్ సెంటర్‌గా వినియోగిస్తున్నాం. పోలింగ్ రోజు పార్లమెంటు అభ్యర్థులకు 9 వాహనాలు, అసెంబ్లీ అభ్యర్థులకు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. వీటిలో కూడా 4 లేదా 5 మంది కంటే ఎక్కువ ఉండరాదు’అని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థుల తరపు ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, ఓటర్లతోపాటు ఈసీ నుంచి అనుమతి ఉన్నవారిని తప్పితే మిగతావారిని పర్మిషన్ ఉండదన్నారు. 255 కేంద్రాలు సమస్యాత్మకం.. జిల్లాలో 35 నుంచి 40 పోలింగ్ కేంద్రాలను మోడల్‌గా ఎంపిక చేశామని, ఇందులో ప్రత్యేక సదుపాయాలుంటాయని కలెక్టర్ తెలిపారు. 255 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించామని, వీటికి ప్రత్యేకంగా లైవ్ వెబ్ క్యాస్టింగ్‌తో పాటు సూక్ష్మ పరిశీలకులు కూడా ఉంటారని తెలిపారు. 321 మంది సూక్ష్మ పరిశీలకులను వినియోగిస్తున్నామని తెలిపారు. 1,658 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు వివరించారు. 320 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించి వీరికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు వినియోగిస్తున్న ఈవీఎంలన్నీ కొత్తవేనని, అందువల్ల మొరాయించే అవకాశం లేదని, మానవ తప్పిదాల వల్ల మొరాయిస్తే తక్షణం పరిష్కరించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు 4,500 మంది పోలీసులు, 14 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఫొటో ఓటరు స్లిప్లుంటే ఎలాంటి ఐడీ లేకుండా ఓటు వేయవచ్చని తెలిపారు. స్లిప్‌లు అందనివారు పోలింగ్ కేంద్రంలోని హెల్ప్ డెస్క్ వద్ద పొంది ఓటు వేయవచ్చని కలెక్టర్ తెలిపారు. -
విడిది సమస్య తలెత్తనివ్వం
సాక్షి, కర్నూలు: యేటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విడిది సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో శనివారం ఆయన స్థానిక గంగా సదన్‌లో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునుల బ్రహ్మోత్సవాలు సమష్టి కృషితోనే విజయవంతం అయ్యాయన్నారు. వారం రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్వించుకున్నట్లు చెప్పారు. శివరాత్రి రోజున భక్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుందన్నారు. శివస్వాములకు శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులకు దర్శనం సులభతరమైందన్నారు. తాత్కాలిక విడిది ఏర్పా టు చేసినా చాలా మంది శివస్వాములు ఆరుబయట పడుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని.. శాశ్వతంగా డార్మెంటరీలను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా సాక్షిగణపతి నుంచి దేవస్థానం వరకు వాహనాల రద్దీ పెరగడంతో కాలినడక భక్తులు ఇక్కట్లకు లోనయ్యారన్నారు. ఈ దృష్ట్యా రోడ్డును విస్తరించి తిరుపతి తరహాలో రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈవో ఆజాద్ మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌తో శ్రీశైలం రూపురేఖలు మారుస్తామన్నారు. 30 మంచినీటి ట్యాం కులను నిర్మించనుండటంతో తాగునీటి సమస్యకు పరిష్కా రం లభిస్తుందన్నారు. దేవస్థానం ప్రధాన రహదారిలోని 300 దుకాణాలను మరో ప్రాం తానికి తరలిస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బీటీ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉత్సవాల్లో 19 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించామని, ఎన్నడూ లేని వి ధంగా ఈ విడత నాణ్యతకు పెద్దపీట వేశామన్నారు. అనంతరం ఉత్సవాలను విజయవంతం చేసిన సిబ్బందిని కలెక్టర్, ఈవోలు సన్మానించారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశ్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, జిల్లా వైద్యాధికారి నరసింహులు, డిప్యూటీ రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త తహశీల్దార్లకు పోస్టింగ్‌లు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లకు ఎట్టకేలకు గురువారం రాత్రి పోస్టింగ్‌లు ఇస్తూ జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 43 మంది తహశీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లగా, ఆయా జిల్లాల నుంచి 45 మంది జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో పని చేయరాదని, ఇతర జిల్లాలకు చెందిన వారైనా నాలుగేళ్లలో మూడేళ్లు పనిచేసి ఉంటే బదిలీ చేయాలనే నిబంధన ఉంది. ఆ మేరకు రెవెన్యూలో బదిలీలు ఊపందుకున్నాయి. జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో కలెక్టర్, జేసీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా జిల్లాల నుంచి తహశీల్దార్ల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని వాటి ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ వ్యవహారం మూడు నాలుగు రోజుల క్రితమే కొలిక్కి వచ్చినా రాజకీయ జోక్యం ఉంటుందనే ఉద్దేశంతో బయటకు పొక్కనీయలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 45 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వీరంతా ఒకటి రెండు రోజుల్లో ఆయా మండలాల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. అయితే జిల్లాకు మరో ముగ్గురు తహశీల్దార్లు రావాల్సి ఉంది. పాత కారు.. సేల్స్ జోరు ! ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉంటేనే హుందాగా భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం రోజుకో మోడల్ మార్కెట్లోకి వస్తుండటంతో ఉన్నత వర్గాలు, వ్యాపారులు, ఉద్యోగులు పాత కార్లు అమ్మేసి విలాసవంతమైనవి కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొత్త కార్లను కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాత కార్లపై ఆసక్తి చూపుతున్నారు. పాత వాటికి కొంత మెరుగులు దిద్ది సెకండ్ హ్యాండ్ పేరుతో అందుబాటులో ఉంచుతున్న వారి సంఖ్య ఇటీవల నగరంలో పెరిగింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్ల కంపెనీలు సైతం షోరూంలలోనే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మకాలకు ఉంచడం మరో విశేషం. - న్యూస్‌లైన్, కర్నూలు(విద్య) ల్లాలో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే కన్సల్టెన్సీలు చాలా తక్కువగా ఉండేవారు. 15 ఏళ్ల కాలంలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో కార్లు అమ్మి పెట్టే వ్యాపారులు 200కు పైగానే ఉన్నారు. కొందరు నిరుద్యోగులతో పాటు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్సల్టెన్సీలుగా వ్యవహరిస్తున్నారు. పట్టణీ కరణ పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల వారు విద్య, ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వలస రావడం వంటి కారణాలతో పట్టణ జనాభా పెరిగిపోయింది. ఈ కారణంగా నగర సరిహద్దులు సైతం విస్తరించాయి. ఒకప్పుడు కర్నూలు నగరం చుట్టుకొలత మూడు కిలోమీటర్లకు మించి ఉండేది కాదు. నేడు అది కాస్తా 15 కిలోమీటర్ల వరకు చేరింది. నంద్యాల రహదారిలో నన్నూరు వరకు, నందికొట్కూరు రోడ్డులో గార్గేయపురం వరకు, బళ్లారి రోడ్డులో పెద్దపాడు వరకు, హైదరాబాద్ రోడ్డులో తుంగభద్ర బ్రిడ్జి వరకు నగరం విస్తరించింది. దీంతో శివారు కాలనీల్లో ఉండే వారు నగరంలోకి రావాలంటే ఆటోలు లభించక, లభించినా ఆటో చార్జీలు విపరీతంగా ఉండటంతో బాగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ సొంత కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్థిక స్థోమత, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లు కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు నగరంలో రూ.30వేల నుంచే కార్లు లభిస్తున్నాయి. కంపెనీ, మోడల్‌ను బట్టి వీటి ధర రూ.6లక్షల వరకు ఉంటోంది. సెకండ్ హ్యాండ్ కార్లు హైదరాబాద్ కంటే కర్నూలులోనే తక్కువ ధరకు లభిస్తాయన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్, నారాయణపేట, కొల్లాపూర్, అనంతపురం పట్టణం నుంచి వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా విభజన అంశం అధికం కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చి కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కాస్త తగ్గింది. కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కారు కొనేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఆన్లైన్లో సరిచూసుకోవాలి. కొన్న వెంటనే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆర్థిక పరిస్థితి, మనిషి ఎత్తు, బరువు తగ్గట్లు కారు ఎంపిక చేసుకోవాలి. దీనికితోడు కారు తీసుకోవాల్సిన అవసరం, మనం తిరిగే ప్రాంతం(పట్టణ, గ్రామీణ)ను బట్టి కారు ఎంపిక చేసుకోవాలి. కారుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. కారు ఎప్పుడు కొన్నారు, ఎంత దూరం తిరిగారు, ఇంకా ఎంత దూరం తిరిగే అవకాశం ఉంది, కారు కండిషన్ ఎలా ఉందో పరిశీలించాలి. కారుపై అవగాహనలేకపోతే కొనుగోలు సమయంలో తెలిసిన మెకానిక్/స్నేహితుడిని వెంట తీసుకెళ్లాలి 3 లక్షల కిలోమీటర్లలోపే ఇంజిన్ బోర్‌కు వస్తే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని గుర్తించాలి. కొనేటప్పుడు టైర్లు, డిస్క్‌లు, చాసిస్, డోర్లు డిక్కీ తెరిచి చెక్ చేసుకోవాలి. కారు సస్పెన్షన్లను సరిచూడాలి. ప్రమాదాల మూలంగా ఏవైనా గీతలు పడ్డాయా..వాటిపైన టచప్‌లు ఏమైనా చేశారో పరిశీలించాలి. ఈ మేరకు తెలిసిన మెకానిక్‌ను కలిసి కారును పరిశీలింపజేయాలి. డాష్‌బోర్డులో ఆయిల్, స్పీడోమీటర్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పవర్ విండోస్, ఏసీ, ఆడియో, వీడియో ఫీచర్లను పరిశీలించాలి. కారులోని సీలింగ్నూ సరిచూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కార్లకూ ఫైనాన్స్: కొత్త వాహనాలకే కాదు పాత వాహనాలకూ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వాహన ఇన్సూరెన్స్‌లో 70 శాతం రుణం అందిస్తున్నాయి. కర్నూలులో మహీంద్ర, ఇండస్ ఇండ్, సుందరం, చోరమండలం, శ్రీరాం, మాగ్మా వంటి సంస్థలు సెకండ్ హ్యాండ్ కార్లకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కుటుంబ అవసరాల కోసం తప్పనిసరి: చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు మా ఇల్లు నగర శివారులో ఉంది. అక్కడి నుంచి వ్యాపార, కుటుంబ అవసరాలకు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. మోటార్‌బైక్‌పై ఒకరిద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులందరూ బయటకు రావాలంటే తప్పనిసరిగా కారు ఉండాల్సిందే. అందుకే సెకండ్ హ్యాండ్లో కారు కొనాలని నిశ్చయించుకున్నాను. ఈ మేరకు మంచి మోడల్ కోసం వెతుకుతున్నాను. ఆర్థిక స్థోమతతో పాటు అవసరాలను బట్టి కారు ఉంటే బాగుంటుందని కార్లను గమనిస్తున్నాను. పాత కార్లకు ఆదరణ పెరుగుతోంది -జి.భాస్కర్‌రెడ్డి, వెరైటీ కార్స్ ఫోర్ వీలర్ కన్సల్టెన్సీ నేను 15 ఏళ్లుగా పాతకార్లు అమ్మే విషయంలో కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నాను. రామలింగేశ్వరనగర్‌లోని పున్నమి గెస్ట్ హౌస్ పక్కన ఏడాది నుంచి వెరైటీ కార్స్ ఫోర్ వీలర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాను. మొదట్లో కన్సల్టెన్సీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు కన్సల్టెన్సీల సంఖ్య పెరగడంతో పాటు ఆయా కార్ల కంపెనీలు సైతం షోరూంల్లోనే సెకండ్ హ్యాండ్ వాహనాలు అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే నమ్మకమైన కన్సల్టెన్సీల వద్దే కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. కారును అద్దెకు ఇచ్చేవారితో పాటు ఉపాధ్యాయులు, వ్యాపారులు అధికంగా ఈ కార్లను కొంటున్నారు. చూసి కొంటే సెకండ్ హ్యాండ్ బెటరే: శ్రీనివాసరెడ్డి, కర్నూలు ప్రసుతం మార్కెట్లో కార్లు, జీపుల కంపెనీలు అధికమయ్యాయి. ఆయా కంపెనీలు సైతం రోజుకో కొత్త మోడల్ తీసుకొస్తున్నాయి. దీంతో ఉన్నతస్థాయి వర్గాల వారు, ప్రస్తుతం వాడుతున్న కారు వారికి అనుకూలంగా లేదని భావించే వారు కొత్త కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక సంవత్సరం వాడిన వాటిని సైతం అమ్మకానికి పెడుతున్నారు. వీటిలో బండి కండిషన్‌ను బాగా పరిశీలించి తీసుకుంటే చాలు. కొత్త కారు కొనేకంటే పాతది కొంటే డబ్బు ఆదా అవుతుంది. -
ఎన్నికలకు ఏర్పాట్లు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఎన్నికలతో పాటు తాగునీటి సమస్య, వలసల నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు 8 కమిటీలు అవసరమని, వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు దాదాపు 500 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమవుతారన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక వీరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖలో బదిలీలు కొలిక్కి వచ్చాయని.. రెండు మూడు రోజుల్లో వారంతా కేటాయించిన స్థానాల్లో చార్జి తీసుకుంటారన్నారు. త్వరలోనే ఎంపీడీఓల బదిలీలు చేపడతామన్నారు. రెవెన్యూ అధికారులతో కొన్ని టీములు, పోలీసు అధికారులతో కొన్ని టీములు, పోలీసు-రెవెన్యూ అధికారులతో కొన్ని టీములు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడమే తరువాయి ఈ టీములు రంగంలోకి దిగుతాయన్నారు. ఆ తర్వాత ఎన్నికల వ్యయంపై దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు కనీసం 20 వేల సిబ్బంది అవసరమన్నారు. జిల్లాకు త్వరలో 14వేల ఈవీఎంలు రానున్నాయని, వీటిని ఎలా వినియోగించాలనే విషయమై సిబ్బందికి శిక్షణనివ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం నియోజకవర్గానికో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటికీ ర్యాంపులు నిర్మిస్తున్నామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, బాత్రూముల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యంతో పాటు వెబ్ క్యాస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, డీఆర్డీఏ సిబ్బందినీ వినియోగిస్తామన్నారు. నీటి సమస్య తలెత్తనివ్వం: ఈ వేసవిలో నీటి సమస్య అంత తీవ్రంగా ఉండే ప్రమాదం లేదని కలెక్టర్ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎల్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో కర్నూలు, ఆదోని డివిజన్లలో చాలా వరకు నీటిని నిలువ చేశామన్నారు. గత ఏడాది 90 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశామని, ఈ గ్రామాల పరిస్థితి ఎలా ఉందనే విషయమై నివేదికలు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కోరినట్లు తెలిపారు. వలసలు తగ్గుముఖం: వలసలు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పనులకు 10వేల మంది మాత్రమే హాజరవగా.. ఈసారి 70వేల మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ నెలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఈ ఏడాది 1000 పైగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నామని వివరిం చారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి నెలా గ్రామ జనాభాను బట్టి ఒకరు లేదా ఇద్దరికి 15 రోజుల పనిదినాలను గ్రామాల్లో క్లీనింగ్ కోసం కేటాయిస్తామన్నారు. -
ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై ప్రత్యేక నిఘా ఉంచనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ పాల్గొన్నారు. ఆ విశేషాలను గురువారం తన చాంబర్లో విలేకరులకు వివరించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే వ్యయ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు. ఎన్నికల్లో వ్యయ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర వాటి గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బ్యాంకర్లకు త్వరలో వేరు వేరుగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థులు రూ.16 లక్షలు, పార్లమెంటు అభ్యర్థులు రూ.40 లక్షలు వరకు మాత్రమే వ్యయం చేసుకోవచ్చని, ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పటి నుంచి కోడ్ అమలులోకి వస్తుందన్నారు. అప్పటి నుంచి వ్యయ నియంత్రణ మొదలవుతుందని చెప్పారు. ఇందుకోసం చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, వివిధ రకాల టీమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు స్పష్టమైన ఆధారాలు చూపెడితేనే విడుదల చేస్తామని తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ నిర్ధారించిందని, దీనిని అదుపు చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చిందన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతి నాలుగైదు నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని ఎన్నికల కమిషన్ నియమించనుందని, ఈ విధంగా జిల్లాకు ముగ్గురు వ్యయ పరిశీలకులు రానున్నారని చెప్పారు. వీరి కింద అసిస్టెంటు వ్యయ పరిశీలకులు ఉంటారని, కోడ్ మొదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానికంగా ఉండి ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తారని తెలిపారు. అభ్యర్థులు వారికున్న రెగ్యులర్ బ్యాంకు ఖాతాల నుంచి గాక, ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఖాతాలు ప్రారంభించి వ్యయాన్ని చూపాలని తెలిపారు. పత్రికలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్, యాడ్స్‌ను నిరంతరం గమనించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లిక్కర్ గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మద్యం సరఫరాపై నిఘా ఉంచుతామన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదలాయింపుపై దృష్టి పెట్టనున్నామని వివరించారు. గత ఎన్నికల వరకు అభ్యర్థులు రెండు అఫిడవిట్లు ఇచ్చే వారని, ఈ ఎన్నికల్లోఒక అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం నగదు, మద్యం సరఫరాపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ప్రారంభించనున్నామన్నారు. అవసరమైన చోట్ల పోలీసు, రెవెన్యూ అధికారులతో చెక్‌పోస్టులు, పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. -
వ్యవస్థను బలపరుద్దాం
కర్నూలు, న్యూస్‌లైన్: వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక పెరేడ్ మైదానంలో సాయుధ దళాల గౌరవవందన స్వీకరణ అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించారు. చిన్ననీటిపారుదల శాఖ ద్వారా ఈ సంవత్సరం 3.22 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5.15 లక్షల మంది కూలీలకు 1.15 కోట్ల పనిదినాలు కల్పించినట్లు చెప్పారు. ఇందిర జలప్రభ పథకంలో భాగంగా రూ.100 కోట్ల నిధులతో 22,866 మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల కుటుంబాలకు చెందిన 52వేల ఎకరాల్లో భూమి అభివృద్ధి, బోర్ల తవ్వకం, విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.1730 కోట్లు, రబీలో రూ.559 కోట్ల పంట రుణాలు అందజేశామన్నారు. 2012 ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల 2.74 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన 2.96 లక్షల మంది రైతులకు ఆన్లైన్ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.238 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేశామన్నారు. 38వేల హెక్టార్లలో రూ.132 కోట్లు వెచ్చించి బిందు, తుంపర్ల సేద్య పరికరాలను రైతులకు అందించామన్నారు. రచ్చబండ మూడో విడత కార్యక్రమంలో 85,473 మందికి తెల్ల రేషన్ కార్డుల కూపన్లు, 28,685 మందికి పింఛన్లు, 98,379 మందికి గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 17వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.283 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు. ప్రతి నెలా రూ.9.20 కోట్లు పెన్షన్‌గా చెల్లిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 3.95 లక్షల ఇళ్లను మంజూరు చేసి ఇప్పటివరకు రూ.1288 కోట్ల ఖర్చుతో 3.11 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,348 మంది లబ్ధిదారులకు రూ.21 కోట్లతో ఆర్థిక ప్రయోజనం కల్పించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 35,509 మంది నిరుపేద విద్యార్థులకు వివిధ రకాల ఉపకార వేతనాల కింద రూ.24 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా 7వ విడత భూపంపిణీ కార్యక్రమం కింద జిల్లాలో 7,052 ఎకరాలను 4,579 మంది నిరుపేదలకు పంపిణీ చేసి సామాజిక హోదా కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా శిక్షణ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి బసవయ్య, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు వజ్రాయుధం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధంతో సమానమని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక కోల్స్ కళాశాలల్లో విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీల్లో అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు ఈనెల 25న సునయన ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రధానం చేస్తామన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ఈనెల 24న జరగనున్న పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో కోల్స్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.