కొత్త తహశీల్దార్లకు పోస్టింగ్‌లు | New tahsildar postings | Sakshi
Sakshi News home page

కొత్త తహశీల్దార్లకు పోస్టింగ్‌లు

Published Fri, Feb 21 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

New tahsildar postings

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లకు ఎట్టకేలకు గురువారం రాత్రి పోస్టింగ్‌లు ఇస్తూ జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 43 మంది తహశీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లగా, ఆయా జిల్లాల నుంచి 45 మంది జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో పని చేయరాదని, ఇతర జిల్లాలకు చెందిన వారైనా నాలుగేళ్లలో మూడేళ్లు పనిచేసి ఉంటే బదిలీ చేయాలనే నిబంధన ఉంది.
 
 ఆ మేరకు రెవెన్యూలో బదిలీలు ఊపందుకున్నాయి. జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో కలెక్టర్, జేసీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా జిల్లాల నుంచి తహశీల్దార్ల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని వాటి ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ వ్యవహారం మూడు నాలుగు రోజుల క్రితమే కొలిక్కి వచ్చినా రాజకీయ జోక్యం ఉంటుందనే ఉద్దేశంతో బయటకు పొక్కనీయలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 45 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వీరంతా ఒకటి రెండు రోజుల్లో ఆయా మండలాల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. అయితే జిల్లాకు మరో ముగ్గురు తహశీల్దార్లు రావాల్సి ఉంది.
 
 
 పాత కారు.. సేల్స్ జోరు !
 ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉంటేనే హుందాగా భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం రోజుకో మోడల్ మార్కెట్‌లోకి వస్తుండటంతో ఉన్నత వర్గాలు, వ్యాపారులు, ఉద్యోగులు పాత కార్లు అమ్మేసి విలాసవంతమైనవి కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొత్త కార్లను కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాత కార్లపై ఆసక్తి చూపుతున్నారు. పాత వాటికి కొంత మెరుగులు దిద్ది సెకండ్ హ్యాండ్ పేరుతో అందుబాటులో ఉంచుతున్న వారి సంఖ్య ఇటీవల నగరంలో పెరిగింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్ల కంపెనీలు సైతం షోరూంలలోనే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మకాలకు ఉంచడం మరో విశేషం.
 - న్యూస్‌లైన్, కర్నూలు(విద్య)
 
 ల్లాలో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే కన్సల్టెన్సీలు చాలా తక్కువగా ఉండేవారు. 15 ఏళ్ల కాలంలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో కార్లు అమ్మి పెట్టే వ్యాపారులు 200కు పైగానే ఉన్నారు. కొందరు నిరుద్యోగులతో పాటు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్సల్టెన్సీలుగా వ్యవహరిస్తున్నారు.  పట్టణీ కరణ పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల వారు విద్య, ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వలస రావడం వంటి కారణాలతో పట్టణ జనాభా పెరిగిపోయింది. ఈ కారణంగా నగర సరిహద్దులు సైతం విస్తరించాయి. ఒకప్పుడు కర్నూలు నగరం చుట్టుకొలత మూడు కిలోమీటర్లకు మించి ఉండేది కాదు. నేడు అది కాస్తా 15 కిలోమీటర్ల వరకు చేరింది.
 
 నంద్యాల రహదారిలో నన్నూరు వరకు, నందికొట్కూరు రోడ్డులో గార్గేయపురం వరకు, బళ్లారి రోడ్డులో పెద్దపాడు వరకు, హైదరాబాద్ రోడ్డులో తుంగభద్ర బ్రిడ్జి వరకు నగరం విస్తరించింది. దీంతో శివారు కాలనీల్లో ఉండే వారు నగరంలోకి రావాలంటే ఆటోలు లభించక, లభించినా ఆటో చార్జీలు విపరీతంగా ఉండటంతో బాగా ఇబ్బందులు పడుతున్నారు.
 
 దీంతో ప్రతి ఒక్కరూ సొంత కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్థిక స్థోమత, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లు కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు నగరంలో రూ.30వేల నుంచే కార్లు లభిస్తున్నాయి. కంపెనీ, మోడల్‌ను బట్టి వీటి ధర రూ.6లక్షల వరకు ఉంటోంది.
 
  సెకండ్ హ్యాండ్ కార్లు హైదరాబాద్ కంటే కర్నూలులోనే తక్కువ ధరకు లభిస్తాయన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్, నారాయణపేట, కొల్లాపూర్, అనంతపురం పట్టణం నుంచి వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా విభజన అంశం అధికం కావడంతో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చి కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కాస్త తగ్గింది.
 కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  కారు కొనేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో సరిచూసుకోవాలి. కొన్న వెంటనే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి.
 
  ఆర్థిక పరిస్థితి, మనిషి ఎత్తు, బరువు తగ్గట్లు కారు ఎంపిక చేసుకోవాలి. దీనికితోడు కారు తీసుకోవాల్సిన అవసరం, మనం తిరిగే ప్రాంతం(పట్టణ, గ్రామీణ)ను బట్టి కారు ఎంపిక చేసుకోవాలి.
 
  కారుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. కారు ఎప్పుడు కొన్నారు, ఎంత దూరం తిరిగారు, ఇంకా ఎంత దూరం తిరిగే అవకాశం ఉంది, కారు కండిషన్ ఎలా  ఉందో పరిశీలించాలి.
  కారుపై అవగాహనలేకపోతే కొనుగోలు సమయంలో తెలిసిన మెకానిక్/స్నేహితుడిని వెంట తీసుకెళ్లాలి
  3 లక్షల కిలోమీటర్లలోపే ఇంజిన్ బోర్‌కు వస్తే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని గుర్తించాలి.
  కొనేటప్పుడు టైర్లు, డిస్క్‌లు, చాసిస్, డోర్లు డిక్కీ తెరిచి చెక్ చేసుకోవాలి. కారు సస్పెన్షన్లను సరిచూడాలి. ప్రమాదాల మూలంగా ఏవైనా గీతలు పడ్డాయా..వాటిపైన టచప్‌లు ఏమైనా చేశారో పరిశీలించాలి. ఈ మేరకు తెలిసిన మెకానిక్‌ను కలిసి కారును పరిశీలింపజేయాలి. డాష్‌బోర్డులో ఆయిల్, స్పీడోమీటర్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పవర్ విండోస్, ఏసీ, ఆడియో, వీడియో ఫీచర్లను పరిశీలించాలి. కారులోని సీలింగ్‌నూ సరిచూసుకోవాలి.
 
 సెకండ్ హ్యాండ్ కార్లకూ ఫైనాన్స్:
 కొత్త వాహనాలకే కాదు పాత వాహనాలకూ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వాహన ఇన్సూరెన్స్‌లో 70 శాతం రుణం అందిస్తున్నాయి. కర్నూలులో మహీంద్ర, ఇండస్ ఇండ్, సుందరం, చోరమండలం, శ్రీరాం, మాగ్మా వంటి సంస్థలు సెకండ్ హ్యాండ్ కార్లకు రుణాలు మంజూరు చేస్తున్నాయి.
 
 కుటుంబ అవసరాల కోసం తప్పనిసరి: చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు
 మా ఇల్లు నగర శివారులో ఉంది. అక్కడి నుంచి వ్యాపార, కుటుంబ అవసరాలకు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. మోటార్‌బైక్‌పై ఒకరిద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులందరూ బయటకు రావాలంటే తప్పనిసరిగా కారు ఉండాల్సిందే. అందుకే సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలని నిశ్చయించుకున్నాను. ఈ మేరకు మంచి మోడల్ కోసం వెతుకుతున్నాను. ఆర్థిక స్థోమతతో పాటు అవసరాలను బట్టి కారు ఉంటే బాగుంటుందని కార్లను గమనిస్తున్నాను.
 
 పాత కార్లకు ఆదరణ పెరుగుతోంది
 -జి.భాస్కర్‌రెడ్డి, వెరైటీ కార్స్ ఫోర్ వీలర్ కన్సల్టెన్సీ
 నేను 15 ఏళ్లుగా పాతకార్లు అమ్మే విషయంలో కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నాను. రామలింగేశ్వరనగర్‌లోని పున్నమి గెస్ట్ హౌస్ పక్కన ఏడాది నుంచి వెరైటీ కార్స్ ఫోర్ వీలర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాను. మొదట్లో కన్సల్టెన్సీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు కన్సల్టెన్సీల సంఖ్య పెరగడంతో పాటు ఆయా కార్ల కంపెనీలు సైతం షోరూంల్లోనే సెకండ్ హ్యాండ్ వాహనాలు అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే నమ్మకమైన కన్సల్టెన్సీల వద్దే కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. కారును అద్దెకు ఇచ్చేవారితో పాటు ఉపాధ్యాయులు, వ్యాపారులు అధికంగా ఈ కార్లను కొంటున్నారు.
 
 చూసి కొంటే సెకండ్ హ్యాండ్ బెటరే: శ్రీనివాసరెడ్డి, కర్నూలు
 ప్రసుతం మార్కెట్‌లో కార్లు, జీపుల కంపెనీలు అధికమయ్యాయి. ఆయా కంపెనీలు సైతం రోజుకో కొత్త మోడల్ తీసుకొస్తున్నాయి. దీంతో ఉన్నతస్థాయి వర్గాల వారు, ప్రస్తుతం వాడుతున్న కారు వారికి అనుకూలంగా లేదని భావించే వారు కొత్త కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్లు అధికంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒక సంవత్సరం వాడిన వాటిని సైతం అమ్మకానికి పెడుతున్నారు. వీటిలో బండి కండిషన్‌ను బాగా పరిశీలించి తీసుకుంటే చాలు. కొత్త కారు కొనేకంటే పాతది కొంటే డబ్బు ఆదా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement