పిడుగు పాటుకు గురై రాష్ట్రంలో ఇద్దరు వృద్దులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుందూరు లక్ష్మమ్మ(65) సోమవారం గ్రామ సమీపంలోని వరి పొలంలో కలుపు తీస్తోంది. మధ్యాహ్నం హఠాత్తుగా వర్షం కురవడంతో అంతా దగ్గర్లోని చెట్టుకిందకు చేరారు. చెట్టుమీద పిడుగు పడటంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే మరణించింది. సమీపంలో ఉన్న మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం కొమ్మివారిపల్లెకు చెందిన మేడికొండూరు నారాయణ(62) పిడుగు పాటుతో మరణించాడు. భార్యతో కలసి సోమవారం నిమ్మతోటలో కాయలు కోస్తుండగా.. నారాయణపై పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆయన భార్య షాక్‌కు గురైంది. ఆమెను వెంటనే తోటి రైతులు రాజంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు.