మృతి చెందిన గీత (25)
కర్నూలు సీక్యాంప్ : కర్నూలు మండలం నూతనపల్లి ఉలిక్కిపడింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు గ్రామ సమీపంలో పిడుగు పడింది. ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నూతనపల్లికి చెందిన రమణమ్మకు గ్రామ శివారులో పొలం ఉంది. ఇందులో ప్రస్తుతం చౌళకాయల పంట సాగు చేశారు. పంటలో కలుపు తీయడానికి గురువారం రమణమ్మ, ఆమె కోడలు గీత(25), గ్రామానికి చెందిన నూర్జహాన్, చిట్టెమ్మ వెళ్లారు. సాయంత్రం కలుపు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా జోరు వర్షం కురిసింది. దీంతో నలుగురూ సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో వేపచెట్టుపై పిడుగు పడింది.
అందరూ స్పృహ కోల్పోయారు. దాదాపు గంట తర్వాత పక్క పొలంలోని వ్యక్తి గమనించి తట్టిలేపే ప్రయత్నం చేశాడు. మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కిలోమీటర్ దూరంలోని గ్రామానికి వెళ్లి స్థానికులకు సమాచారమిచ్చాడు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. అప్పటికే గీత మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమణమ్మకు కాలికి, చేతికి, నూర్జహాన్‌కు వీపుపై, చిట్టెమ్మకు కాలికి బలమైన గాయాలయ్యాయి. గీతకు భర్త మహేష్, రెండేళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగుపాటు బాధితులను పెద్దాసుపత్రిలో వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కర్నూలు తహసీల్దార్ వెంకటేశ్ పరామర్శించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతురాలి కుటుంబానికిరూ.20 లక్షల పరిహారమివ్వాలి
పిడుగు పడి మృతి చెందిన గీత కుటుంబానికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బీవై రామయ్య, మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పిడుగులు పడే సమాచారాన్ని ప్రజలకు, మరీ ముఖ్యంగా గ్రామీణులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అలాగే పిడుగుపాటుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బాధితులకు అయ్యే వైద్యఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment