కర్నూలు (టౌన్): ఉన్నత చదువు చదివాడు.. లాయర్ వద్ద గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నాడు.. సమాజంలో మంచిని పెంపొందించాల్సిన ఆ యువకుడు విక్షణ కోల్పోయాడు. పెళ్లి ఆర్భాటంగా చేసేందుకు ఒప్పుకోలేదని తల్లిని రోకలిబండతో బాది హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని తారకరామ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భర్త లేకపోయినా లక్ష్మీదేవి (45) తన ఇద్దరు కుమారులను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడు రామగిరేంద్ర ఎంఏ వరకు చదివి ఇటీవల లాయర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదోని మండలం ఇలిగేరి గ్రామానికి చెందిన యువతితో ఈ యువకుడికి పెళ్లి చేయాలని బంధువులు నిశ్చయించారు. బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలని తల్లి లక్ష్మీదేవితో గురువారం ఇంట్లో కుమారుడు గొడవ పడ్డాడు.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని తల్లి మందలించడంతో రామగిరేంద్ర క్షణికావేశానికి గురై పక్కనే ఉన్న రోకలి బండతో తలపై మోదాడు. దీంతో అమె అక్కడి కక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి మరిది శేషగిరి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, హత్య కేసు నమోదు చేశారు. కాగా..గురువారం సాయంత్రం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment