వైఎస్సార్ జిల్లా ఆకేపాడులో పెనుగాలులకు నేలకొరిగిన అరటి పంట
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్ : వాతావరణ మార్పులతో వచ్చిన అకాల వర్షాలు ఉద్యాన రైతులను నిండా ముంచేశాయి. గడచిన రెండు రోజులపాటు వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో మామిడి పంటతోపాటు అరటి, బొప్పాయి, దోస, కర్బూజ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 50 వేల హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్టు అనధికార అంచనా. వేలకు వేలు ఖర్చు పెట్టి తోటల్ని సిద్ధంచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మామిడి పూత రావడమే ఆలస్యం కాగా వచ్చిన పూత నిలవక రైతులు ఆదిలో ఇక్కట్లు పడ్డారు. నానా తంటాలు పడి పూతను నిలుపుకుంటే ఇప్పుడీ అకాల వర్షంతో పిందెలతో సహా సర్వం నేల రాలాయని రైతులు వాపోతున్నారు.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో వడగండ్ల వానకు మామిడి, టమోట, వరి, అరటి.. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వేయి హెక్టార్ల వరకు మామిడి సహా వివిధ రకాల ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని వల్లూరు, చింతకొమ్మదిన్నె, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, చెన్నూరు, రామాపురం, వీరబల్లి, జమ్మలమడుగు, వేంపల్లె, ఖాజీపేట, పుల్లంపేట, దువ్వూరు, సిద్దవటం, కాశినాయన, రాజంపేట, ఒంటిమిట్ట, మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చేతికందివచ్చిన అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస, కర్బూజ పంటలకు భారీనష్టం వాటిల్లింది. మొత్తం మీద మార్చి 16న, 30న సంభవించిన గాలివానలవల్ల ఈ జిల్లాలో 6000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా 1,665 ఎకరాలు అరటి తోటలే ఉండటం గమనార్హం.
కర్నూలు జిల్లాలో స్వల్పంగా మామిడి పిందెలు నెలరాలాయి. ఎకరానికి రూ.55 నుంచి రూ.60 వేల వరకు ఖర్చు పెట్టామని, ఈ పరిస్థితుల్లో తమకు పెట్టుబడైనా వస్తుందో లేదోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, 12 ట్రాన్స్‌ఫార్మర్లు, 60 విద్యుత్ స్తంభాలు జిల్లాలో నేలకొరగగా 6 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. యాడికి, ఎన్‌పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 50 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే.. నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయాధికారులు రంగంలోకి దిగారు.
ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి
అకాల వర్షంతో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment