crops collapsed
-
కన్నీటి వర్షిణి!
అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి.. ఏటా ప్రకృతి రైతులను కుంగదీస్తోంది. నిన్నమొన్నటివరకూ వర్షాలు లేక సతమతమైన అన్నదాతలు ఇప్పుడు భారీ వర్షాలతో నిండా మునిగారు. ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడి కోల్పోయారు. మళ్లీ నారు కొని నాట్లు వేసేందుకు అవస్థలు పడుతున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి(కొవ్వూరు) : ఖరీఫ్ సాగులో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. సీజన్ ఆరంభంలో రెండు నెలలు వర్షాభావ పరిస్థితుల వల్ల సతమతమైన అన్నదాతలు ఇప్పుడు భారీవర్షాలు, వరదలతో నష్టపోయారు. ఇప్పటివరకూ జిల్లాలో 80శాతం ఆయకట్టులో నాట్లు వేశారు. ఏటా జూలై నెలాఖరు నాటికే నాట్లు దాదాపు పూర్తయ్యేవి. ఈ సారి ఆగస్టు మూడో వారం నడుస్తున్నా ఇంత వరకు నూరుశాతం నాట్లు పడలేదు. నారుమళ్లు దెబ్బతిన్నందున నూరుశాతం నాట్లు పడతాయన్న నమ్మకం కుడా తక్కువగానే ఉంది. జూన్, జూలై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో అల్పపీడనం, రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతోపాటు గోదావరి వరదలు రైతులను నిండా ముంచాయి. జిల్లావ్యాప్తంగా 2.29 లక్షల హెక్టార్లలో వరి సాధారణ ఆయకట్టు ఉంది. దీనిలో ఇంత వరకు సుమారు 1.85లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. అంటే ఇంకా లక్ష ఎకరాలకు(44వేల హెక్టార్లు)పైగా ఆయకట్టులో నాట్లు వేయాల్సి ఉంది. భారీగానే నష్టాలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో 7,550 మంది రైతులకు చెందిన 4,567 హెక్టార్లలో నాట్లు వేసిన వరి పంట ఇంకా ముంపులోనే ఉంది. 479.6 హెక్టార్లలో నారుమళ్లు ముంపు బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కలు తేల్చారు. దీనిలో 2,348 మంది రైతులకు చెందిన 455.64 హెక్టార్లలోని నారుమళ్లు 33శాతం పైబడి దెబ్బతిన్నాయి. 223 మంది రైతులకు చెందిన 1,324.9 హెక్టార్లలో వరి పంటకు 33 శాతానికి పైబడి నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం అధికారులు మండలాల వారీగా నష్టపరిహారం అంచనాలను తయారు చేసే పనిలో పడ్డారు. ప్రధానంగా నరసాపురం, ఆచంట, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, భీమవరం, పాలకోడేరు, ఆకివీడు, ఉండి, పెనుమంట్ర, అత్తిలి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గణపవరం, చాగల్లు తదితర మండలాల్లో భారీ వర్షాల ప్రభావం కారణంగా పంటలు ముంపు బారిన పడ్డాయి. రబీపై ప్రభావం పడే అవకాశం ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో రుతు పవనాలు సుమారు పదిహేను రోజులు ఆలస్యంగా రావడంతో నారుమళ్లు పోయడం, నాట్లు పడడం జాప్యమైంది. భారీ వర్షాల వల్ల నారుమళ్లు, నాట్లు వేసిన వరి పంట దెబ్బ తినడం వల్ల రైతులు కొందరు రెండోసారి నాట్లు వేశారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు నారు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు రైతులు పక్క రైతుల వద్ద మిగిలిన నారును ఉపయోగించుకుని నాట్లు వేస్తున్నారు. మరికొందరు నారు మళ్లీ పోశారు. ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నూరుశాతం న్యాయం పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నూరుశాతం రాయితీపై విత్తనాలు అందిస్తుంది. ఇంకా సుమారు లక్ష ఎకరాలకుపైగా నాట్లు పడాల్సి ఉంది. నెలాఖరులోగా నూరుశాతం ఆయకట్టులో నాట్లు పడడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇప్పుడు రైతులకు నారు కొరతే ప్రధాన సమస్యగా ఉంది. ఈ ప్రభావం రానున్న రబీ సీజన్‌పై పడే అవకాశం ఉంది. వాస్తవంగా నవంబర్ నెలాఖరు నాటికి నారుమళ్లు పూర్తి చేసుకుని డిసెంబర్ నెలాఖరులోపు నాట్లు పూర్తి కావాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రబీ నెలరోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా గోదావరి డెల్టా ఆయకట్టులో రబీ సీజన్ చివరిలో నీటి తడులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్ట ప్రాంతంలో జలాశయాలు, చెరువులు కూడా నేటీకీ పూర్తిస్థాయిలో నిండలేదు. రెండు నెలలపాటు లోటు వర్షపాతం ఉండడంతో ఈ ఏడాది మెట్ట రైతులు సైతం ఒడిదుడుకులను చవిచూశారు. పంట నష్టం అంచనాలు తయారు చేస్తున్నాం ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు నూరుశాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నాం. జిల్లాకు 4,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా రైతుల నుంచి 3,500 క్వింటాళ్లు మాత్రమే అవసరమని ప్రతిపాదనలు వచ్చాయి. పంట అంచనాలను తయారు చేస్తున్నారు. ఇంత వరకు 455 హెక్టార్లలో నారుమళ్లు, 1324 హెక్టార్లలో వరిపంట 33 శాతం కంటే అధికంగా దెబ్బతిన్నట్లు గుర్తించాం. ఇంకా 4,567 హెక్టార్లు పంట ముంపులోనే ఉంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 337 హెక్టార్లలో పంట నష్టం అంచనాలను సేకరించాం. రెవెన్యూ శాఖతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలను సేకరిస్తున్నారు. – గౌసియా బేగం, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయశాఖ -
పంటల బీమాకు జగన్ పూచీ!
అది 2018, అక్టోబర్ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు. పొట్ట దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో.. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్‌హుద్, ఫైలిన్ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఆర్.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు. అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు. – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
నిండా ముంచిన అకాల వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : వాతావరణ మార్పులతో వచ్చిన అకాల వర్షాలు ఉద్యాన రైతులను నిండా ముంచేశాయి. గడచిన రెండు రోజులపాటు వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో మామిడి పంటతోపాటు అరటి, బొప్పాయి, దోస, కర్బూజ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 50 వేల హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్టు అనధికార అంచనా. వేలకు వేలు ఖర్చు పెట్టి తోటల్ని సిద్ధంచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మామిడి పూత రావడమే ఆలస్యం కాగా వచ్చిన పూత నిలవక రైతులు ఆదిలో ఇక్కట్లు పడ్డారు. నానా తంటాలు పడి పూతను నిలుపుకుంటే ఇప్పుడీ అకాల వర్షంతో పిందెలతో సహా సర్వం నేల రాలాయని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో వడగండ్ల వానకు మామిడి, టమోట, వరి, అరటి.. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వేయి హెక్టార్ల వరకు మామిడి సహా వివిధ రకాల ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని వల్లూరు, చింతకొమ్మదిన్నె, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, చెన్నూరు, రామాపురం, వీరబల్లి, జమ్మలమడుగు, వేంపల్లె, ఖాజీపేట, పుల్లంపేట, దువ్వూరు, సిద్దవటం, కాశినాయన, రాజంపేట, ఒంటిమిట్ట, మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చేతికందివచ్చిన అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస, కర్బూజ పంటలకు భారీనష్టం వాటిల్లింది. మొత్తం మీద మార్చి 16న, 30న సంభవించిన గాలివానలవల్ల ఈ జిల్లాలో 6000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా 1,665 ఎకరాలు అరటి తోటలే ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో స్వల్పంగా మామిడి పిందెలు నెలరాలాయి. ఎకరానికి రూ.55 నుంచి రూ.60 వేల వరకు ఖర్చు పెట్టామని, ఈ పరిస్థితుల్లో తమకు పెట్టుబడైనా వస్తుందో లేదోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, 12 ట్రాన్స్ఫార్మర్లు, 60 విద్యుత్ స్తంభాలు జిల్లాలో నేలకొరగగా 6 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. యాడికి, ఎన్పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 50 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే.. నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయాధికారులు రంగంలోకి దిగారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి అకాల వర్షంతో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు. -
10 వేల ఎకరాల పంట నష్టం
కరీంనగర్: కరీంనగరల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్నవడగండ్ల వర్షాలకు పదివేల ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముదిమాణిక్యం, రామంచ, ఇందుర్తిలో జరిగిన పంటనష్టాన్ని గురువారం జిల్లా కలెక్టర్ నీతుకుమారీప్రసాద్ పర్యవేక్షించారు. ఆమెతో పాటు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా హుస్నాబాద్‌లో పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు.