కన్నీటి వర్షిణి! | Crops Damaged Due To Heavy Rains In West Godavari | Sakshi
Sakshi News home page

కన్నీటి వర్షిణి!

Published Fri, Aug 16 2019 10:10 AM | Last Updated on Fri, Aug 16 2019 10:11 AM

Crops Damaged Due To Heavy Rains In West Godavari - Sakshi

పోడూరులో నీటమునిగి దెబ్బతిన్న వరినాట్లు

అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి.. ఏటా ప్రకృతి రైతులను కుంగదీస్తోంది. నిన్నమొన్నటివరకూ వర్షాలు లేక సతమతమైన అన్నదాతలు ఇప్పుడు భారీ వర్షాలతో నిండా మునిగారు. ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడి కోల్పోయారు. మళ్లీ నారు కొని నాట్లు వేసేందుకు అవస్థలు పడుతున్నారు.   

సాక్షి, పశ్చిమగోదావరి(కొవ్వూరు) :  ఖరీఫ్‌ సాగులో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. సీజన్‌ ఆరంభంలో రెండు నెలలు వర్షాభావ పరిస్థితుల వల్ల సతమతమైన అన్నదాతలు ఇప్పుడు భారీవర్షాలు, వరదలతో నష్టపోయారు.  ఇప్పటివరకూ జిల్లాలో 80శాతం ఆయకట్టులో నాట్లు వేశారు. ఏటా జూలై నెలాఖరు నాటికే నాట్లు దాదాపు పూర్తయ్యేవి. ఈ సారి ఆగస్టు మూడో వారం నడుస్తున్నా ఇంత వరకు నూరుశాతం నాట్లు పడలేదు. నారుమళ్లు దెబ్బతిన్నందున నూరుశాతం నాట్లు పడతాయన్న నమ్మకం కుడా తక్కువగానే ఉంది. జూన్, జూలై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో అల్పపీడనం, రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతోపాటు గోదావరి వరదలు రైతులను నిండా ముంచాయి. జిల్లావ్యాప్తంగా 2.29 లక్షల హెక్టార్లలో వరి సాధారణ ఆయకట్టు ఉంది. దీనిలో ఇంత వరకు సుమారు 1.85లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. అంటే ఇంకా లక్ష ఎకరాలకు(44వేల హెక్టార్లు)పైగా ఆయకట్టులో నాట్లు వేయాల్సి ఉంది. 

భారీగానే నష్టాలు 
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల  గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో 7,550 మంది రైతులకు చెందిన 4,567 హెక్టార్లలో నాట్లు వేసిన వరి పంట ఇంకా ముంపులోనే ఉంది. 479.6 హెక్టార్లలో నారుమళ్లు ముంపు బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కలు తేల్చారు. దీనిలో 2,348 మంది రైతులకు చెందిన 455.64 హెక్టార్లలోని నారుమళ్లు 33శాతం పైబడి దెబ్బతిన్నాయి. 223 మంది రైతులకు చెందిన 1,324.9 హెక్టార్లలో వరి పంటకు 33 శాతానికి పైబడి నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం అధికారులు మండలాల వారీగా నష్టపరిహారం అంచనాలను తయారు చేసే పనిలో పడ్డారు. ప్రధానంగా నరసాపురం, ఆచంట, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, భీమవరం, పాలకోడేరు, ఆకివీడు, ఉండి, పెనుమంట్ర, అత్తిలి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గణపవరం, చాగల్లు తదితర మండలాల్లో భారీ వర్షాల ప్రభావం కారణంగా పంటలు ముంపు బారిన పడ్డాయి.

రబీపై ప్రభావం పడే అవకాశం
ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో రుతు పవనాలు సుమారు పదిహేను రోజులు ఆలస్యంగా రావడంతో నారుమళ్లు పోయడం, నాట్లు పడడం జాప్యమైంది. భారీ వర్షాల వల్ల నారుమళ్లు,  నాట్లు వేసిన వరి పంట దెబ్బ తినడం వల్ల రైతులు కొందరు రెండోసారి నాట్లు వేశారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు నారు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు రైతులు పక్క రైతుల వద్ద మిగిలిన నారును ఉపయోగించుకుని నాట్లు వేస్తున్నారు. మరికొందరు నారు మళ్లీ పోశారు. ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 

నూరుశాతం న్యాయం 
పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నూరుశాతం రాయితీపై  విత్తనాలు అందిస్తుంది. ఇంకా సుమారు లక్ష ఎకరాలకుపైగా నాట్లు పడాల్సి ఉంది. నెలాఖరులోగా నూరుశాతం ఆయకట్టులో నాట్లు పడడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇప్పుడు రైతులకు నారు కొరతే ప్రధాన సమస్యగా ఉంది. ఈ ప్రభావం రానున్న రబీ సీజన్‌పై పడే అవకాశం ఉంది. వాస్తవంగా నవంబర్‌ నెలాఖరు నాటికి నారుమళ్లు పూర్తి చేసుకుని డిసెంబర్‌ నెలాఖరులోపు నాట్లు పూర్తి కావాలి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రబీ నెలరోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా గోదావరి డెల్టా ఆయకట్టులో రబీ సీజన్‌ చివరిలో నీటి తడులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్ట ప్రాంతంలో జలాశయాలు, చెరువులు కూడా నేటీకీ పూర్తిస్థాయిలో నిండలేదు. రెండు నెలలపాటు లోటు వర్షపాతం ఉండడంతో ఈ ఏడాది మెట్ట రైతులు సైతం ఒడిదుడుకులను చవిచూశారు.

పంట నష్టం అంచనాలు తయారు చేస్తున్నాం
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు నూరుశాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నాం. జిల్లాకు 4,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా రైతుల నుంచి 3,500 క్వింటాళ్లు మాత్రమే అవసరమని ప్రతిపాదనలు వచ్చాయి. పంట అంచనాలను తయారు చేస్తున్నారు. ఇంత వరకు 455 హెక్టార్లలో నారుమళ్లు, 1324 హెక్టార్లలో వరిపంట 33 శాతం కంటే అధికంగా దెబ్బతిన్నట్లు గుర్తించాం. ఇంకా 4,567 హెక్టార్లు పంట ముంపులోనే ఉంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 337 హెక్టార్లలో పంట నష్టం అంచనాలను సేకరించాం. రెవెన్యూ శాఖతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలను సేకరిస్తున్నారు.
– గౌసియా బేగం, జాయింట్‌ డైరెక్టర్, వ్యవసాయశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement