సాక్షి ప్రతినిధి, ఏలూరు : గత నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంటే, తమ్మిలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. పశ్చిమ ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డెల్టాలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వే పైకి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం కాలువపై నాలుగడుగుల మేర వరదనీరు చేరడంతో సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో పోలవరం వచ్చేందుకు ఏజెన్సీవాసులు నానా అవస్థలు పడ్డారు. కాజ్‌వేకు ఇరువైపుల నుంచి ఆటోల్లో ప్రయాణించి వరద నీటిలో నడుచుకుంటూ పోలవరం చేరుకున్నారు. పోలవరం మండలంలోని ఇసుక కాలువ, కొవ్వాడ కాలువ, కొత్తూరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టిసం ఎత్తిపోతల పథకం ప్రాంతంలో పంట పొలాలు వర్షపునీటితో నిండిపోయాయి. కొవ్వూరులో గోష్పాదక్షేత్రం స్నానఘట్టం నీటమునిగింది.
స్నాన ఘట్టంలో శివలింగం ఎదుట ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని తాకుతూ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,600 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. 5,84,816 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తుండంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లను ఎత్తివేశారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో 24 గంటల్లో 28.0 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదయ్యింది. బుట్టాయగూడెం, పోలవరం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, జీలుగుమిల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, లింగపాలెం, ద్వారకాతిరుమల, పెదపాడు, గణపవరం, ఇరగవరం, పెనుమంట్ర మండలాల్లో భారీ వర్షం పడగా, జిల్లాలోని మిగిలిన మండలాల్లో చెదురుమదురుగా వర్షం పడుతూనే ఉంది. దెందులూరు మండలంలో అలుకులగూడెం, దెందులూరు మధ్య గుండేరు వాగు గట్టు తెగింది. నాలుగు గ్రామాలకు రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.కొయ్యలగూడెం మండలంలో బైనేరు, తూర్పుకాలువ, పడమటి కాలువ, ఎర్రకాలువలు పొంగి ప్రవహించడంతో కొన్ని గ్రామాలతో ప్రధాన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
బిల్లిమిల్లి, కిచ్చప్పగూడెం, వంకాబొతప్పగూడెం, మర్రిగూడెం గ్రామాలు పడమటి కాలువ పొంగి ప్రవహించడంతో ఇరువైపులా రాకపోకలు స్థంభించాయి. పెనుమంట్ర మండలం ఆలమూరు– పొలమూరు, మాముడూరు గ్రామాల్లో 500 ఎకరాలు నీటమునిగాయి. ఆచంట మండలంలో నక్కల,తాడేరు, కొఠారుపర్రు డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. గౌరీపట్నంలో కొవ్వూడ కాలువకు ఇరువైపులా గల పంటచేలను వరదనీరు ముంచెత్తడంతో సుమారు 100 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి గంటకు 1,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. మరోవైపు తమ్మిలేరు జలాశయం నిండుకుండలా మారుతోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు పశ్చిమ గోదావరి జిల్లాలో పడుతున్న వర్షాలకు తమ్మిలేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 337 అడుగుల నీరు నిల్వ ఉండగా, 2,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోరెండు మూడురోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టు గరిష్ట పరిమితి 350 అడుగులకు చేరుకునే అవకాశం ఉండటంతో వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment