వ్యవస్థను బలపరుద్దాం | AGRICULTURAL breasts | Sakshi
Sakshi News home page

వ్యవస్థను బలపరుద్దాం

Published Mon, Jan 27 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

AGRICULTURAL breasts

కర్నూలు, న్యూస్‌లైన్: వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక పెరేడ్ మైదానంలో సాయుధ దళాల గౌరవవందన స్వీకరణ అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించారు.
 
 చిన్ననీటిపారుదల శాఖ ద్వారా ఈ సంవత్సరం 3.22 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5.15 లక్షల మంది కూలీలకు 1.15 కోట్ల పనిదినాలు కల్పించినట్లు చెప్పారు.
 
 ఇందిర జలప్రభ పథకంలో భాగంగా రూ.100 కోట్ల నిధులతో 22,866 మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతుల కుటుంబాలకు చెందిన 52వేల ఎకరాల్లో భూమి అభివృద్ధి, బోర్ల తవ్వకం, విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.1730 కోట్లు, రబీలో రూ.559 కోట్ల పంట రుణాలు అందజేశామన్నారు. 2012 ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల 2.74 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన 2.96 లక్షల మంది రైతులకు ఆన్‌లైన్ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.238 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశామన్నారు.
 
 38వేల హెక్టార్లలో రూ.132 కోట్లు వెచ్చించి బిందు, తుంపర్ల సేద్య పరికరాలను రైతులకు అందించామన్నారు. రచ్చబండ మూడో విడత కార్యక్రమంలో 85,473 మందికి తెల్ల రేషన్ కార్డుల కూపన్లు, 28,685 మందికి పింఛన్లు, 98,379 మందికి గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 17వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.283 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు. ప్రతి నెలా రూ.9.20 కోట్లు పెన్షన్‌గా చెల్లిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 3.95 లక్షల ఇళ్లను మంజూరు చేసి ఇప్పటివరకు రూ.1288 కోట్ల ఖర్చుతో 3.11 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు.
 
 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,348 మంది లబ్ధిదారులకు రూ.21 కోట్లతో ఆర్థిక ప్రయోజనం కల్పించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 35,509 మంది నిరుపేద విద్యార్థులకు వివిధ రకాల ఉపకార వేతనాల కింద రూ.24 కోట్లు నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా 7వ విడత భూపంపిణీ కార్యక్రమం కింద జిల్లాలో 7,052 ఎకరాలను 4,579 మంది నిరుపేదలకు పంపిణీ చేసి సామాజిక హోదా కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా శిక్షణ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి బసవయ్య, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement