సాక్షి, కర్నూలు : ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా మాఫియా ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల నిరంతర నిఘా వల్ల కొంత తగ్గినా.. ఇసుక రీచ్‌ల తవ్వకాల్లో మళ్లీ అక్రమాల పర్వం మొదలైంది. ఒకే పర్మిట్‌పై మూడుసార్లు ఇసుకను తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 రీచ్‌ల్లో 11 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేతలు, అధికారులు సహకరిస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయి.
అక్రమం ఇలా...
ఒకే డీడీని మూడు పర్యాయాలు పంపిణీ(సర్క్యులేట్) చేయడంతో అయిదు టన్నులు సామర్థ్యమున్న పది టైర్ల లారీలతోపాటు మూడు లోడ్లు తీసుకువెళ్తున్నారు. మొదటి లోడును డీడీ తీసిన కొనుగోలుదారుకు పంపగా, మిగిలిన రెండు లోడ్లను రీచ్‌కు సమీపంలోనే ఏదో ఒక ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. ఈ ఇసుకను రాత్రివేళ దూర ప్రాంతాలకు రవాణాచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆరు టన్నుల లారీ రూ. 10 వేలు ఉండగా.. అక్రమంగా సరఫరా చేసే లారీని రూ. 7 వేల నుంచి రూ. 8 వేలకే సరఫరా చేస్తున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని రవాణాదారులు, సహకరించే నేతలు పంచుకుంటున్నారు. ఒక్కో రీచ్ నుంచి రోజుకు సుమారు 50 లోడ్లు పక్కదారి పడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ఇలా చేస్తే రోజుకు సుమారు రూ. 4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో అధికం..
నిడ్జూరు, జి.సింగవరం, పడిదెంపాడు, పూడూరు (కర్నూలు రూరల్ మండలం), మంత్రాలయం రాంపురం (మంత్రాలయం), ముద్దటమాగి (హోళగుంద), గుడికంబాళి (కౌతాలం), గురజాల (నందవరం), బల్లూరు (హాలహార్వి), కనకదిన్నె (పత్తికొండ) ర్యాంపుల్లో అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. నిడ్జూరు, పడిదెంపాడులో ఇసుక అక్రమ రవాణాలో రాజకీయ నేతల జోక్యం ఉందనే ప్రచారం ఉంది. కర్నూలు మండలంలోని పూడూరు ర్యాంపు నుంచి ఇప్పటికీ అనధికారికంగా రవాణా అవుతూనే ఉంది. విజిలెన్స్ దాడులు జరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఓ నేత అండదండలతోనే అక్రమ రవాణా జరుగుతోంది.
లెక్కకుమించి..
జిల్లాలోని ఒక్కో రీచ్‌లో 12 టన్నులు ఉండే 50 లారీలు దారిమళ్లినా 132 లారీలు అక్రమంగా తరలిపోతాయి. 132 లారీల ద్వారా లారీకి 12 టన్నులు లెక్కిస్తే 1,584 టన్నుల ఇసుక పక్కదారి పడుతోంది. దీని విలువ టన్నుకు రూ. 2,500 వంతున రూ. 39.60 లక్షలు దళారుల పాలవుతోంది. ఇదంతా ఒక రోజులో జరిగే అక్రమాల విలువ. నెలకు దాదాపు రూ. 12 కోట్లు. సీరియల్ ప్రకారం వెళ్తే ఒక లారీ బయటకు వచ్చేందుకు ఒకటిన్నర రోజు పడుతోంది. సీరియల్ లేకుండా అనుకూలమైన వాహనాలను దగ్గరలో ఉండే ప్రాంతాలకు పంపి వెంటనే తిరిగి వచ్చేలా ఏర్పాటు చేసుకుని ఆక్రమాలకు పాల్పడుతున్నారు.
లోపాయికారి మద్దతు..
జిల్లాలో అక్రమాలకు అలవాటుపడిన కొందరు నేతల తీరుమారడం లేదు. ఇసుక మాఫియా ముఠాలతో చేతులు కలిపి సహకరిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ఉండే ఇసుక రీచ్‌ల్లో అక్రమ రవాణాకు తెరవెనుక నుంచి సహకరిస్తున్నారు. మధ్యవర్తులుగా పెట్టుకున్న నేతలు వారి ద్వారానే అనధికారిక కార్యకలాపాలను నడిపిస్తున్నారు. నిడ్జూరు రీచ్‌లో అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇసుక నిర్వాహకులతో పెద్ద మొత్తంలో సొమ్ము తీసుకుని అక్రమంగా టన్నుల కొద్దీ ఇసుకను లారీల్లోకి లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రీచ్‌లో సీసీ కెమెరాలో ఉండడంతో నదిలో ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతంలోనే ముడుపులు స్వీకరిస్తున్నట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని చోట్ల నేతలే స్వయంగా మహిళా సంఘాలపై అధికారులతో ఒత్తిడి తెస్తుండడంతో అక్రమ రవాణా విషయంలో వారు ఎదిరించే పరిస్థితి లేదు.
సాంకేతి‘కథ’.. కంచికే!
సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిలు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ లాంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆధికలోడు ఆక్రమాలను నియంత్రించేందుకు పలు విధానాలను అమలు చేయాలనుకున్నా అధికారులు వాటిని ఆచరణలోకి తేవడం లేదు. గతంలో రోజుకు 8 వేల క్యూబిక్ మీటర్ల వరకు ప్రభుత్వం సరఫరా చేస్తుండగా ప్రస్తుతం అది 2 వేల క్యూబిక్ మీటర్లు కూడా ఉండడం లేదు. అయితే అనధికారికంగా మాత్రం వేల క్యూబిక్ మీటర్లు తరలిపోతుంది. అధికారుల నిఘా, నియంత్రణ లేకుండా పోవడంతో మాఫియా యథేచ్ఛేగా అక్రమాలకు పాల్పడుతోంది.
ఒక పర్మిట్.. మూడు ట్రిప్పులు!
Published Sun, Mar 8 2015 3:36 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement