సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాల సంఖ్య భారీగా ఉంది. తాజాగా జరిపిన సర్వేలో వీరి సంఖ్య 50 శాతానికిపైగానే ఉందని తేలింది. జిల్లాలో మొత్తం 6,57,789 కుటుంబాలు ఉండగా, 3,38,494 కుటుంబాలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. అంటే 50 శాతానికిపైగా కుటుంబాలు అవసరాలు తీర్చుకునేందుకు ఆరుబయటకే వెళ్లాల్సి వస్తోంది. ఈ వివరాలను స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) వెబ్‌సైట్లో పొందుపర్చారు. వ్యక్తిగత పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. మరుగుదొడ్లు నిర్మించాల్సిన ప్రభుత్వం...1,20,811 కుటుంబాలకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఫలితంగా మరో 2 లక్షల కుటుంబాలకుపైగా రానున్న రోజుల్లో కూడా ఆరు బయటకే వెళ్లక తప్పదు.
రెవెన్యూ డివిజన్ల వారీగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వాస్తవానికి మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం చేసే సహాయమే అధికం. మొత్తం రూ.12 వేలల్లో రూ.9 వేలు కేంద్రం మంజూరు చేస్తోండగా, రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.3 వేలు మాత్రమే. అయినప్పటికీ జిల్లాలోని అన్ని కుటుంబాలకు కాకుండా లక్షా 20 వేల 811 మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతినిచ్చారు. అంటే సుమారు మరో 2 లక్షల కుటుంబాలకు సొంత మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రానుందన్నమాట.
మరుగుదొడ్డికి స్థలమూ కరువే...!
వాస్తవానికి అనేక మంది కుటుంబాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుందామనే భావిస్తున్నాయి. అయితే, ఇందుకు సరిపడా స్థలం లేకపోవడంతో ఇందుకు ముందుకు రావడం లేదు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే గుడిసె వేసుకుని జీవిస్తున్న కుటుం బాలు... మరుగుదొడ్డి కోసం అవసరమైన స్థలం లేక ఆరుబయటకు వెళ్లడానికే మొగ్గుచూపాల్సి వస్తోంది. ఇక ప్రధానంగా కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు వంటి ప్రధాన నగరాల్లో జీవిస్తున్న పేద ప్రజలు అగ్గిపెట్టెల వంటి ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వీరి కోసం సామూహిక మరుగుదొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ.. వీటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించారు. దీంతో మరుగుదొడ్డి కోసం పైకం చెల్లించాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేటుకు అప్పగించని చోట... నిర్వహణ దారుణంగా ఉంటోంది. ఫలితంగా ఇవి కాస్తా మూలకు చేరి ఉపయోగంలో లేకుండా పోతున్నాయి.
సగం మంది ఆరుబయటకే!
Published Mon, Mar 2 2015 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement