కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో ఎన్నికలతో పాటు తాగునీటి సమస్య, వలసల నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు 8 కమిటీలు అవసరమని, వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు దాదాపు 500 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమవుతారన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక వీరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖలో బదిలీలు కొలిక్కి వచ్చాయని.. రెండు మూడు రోజుల్లో వారంతా కేటాయించిన స్థానాల్లో చార్జి తీసుకుంటారన్నారు.
త్వరలోనే ఎంపీడీఓల బదిలీలు చేపడతామన్నారు. రెవెన్యూ అధికారులతో కొన్ని టీములు, పోలీసు అధికారులతో కొన్ని టీములు, పోలీసు-రెవెన్యూ అధికారులతో కొన్ని టీములు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడమే తరువాయి ఈ టీములు రంగంలోకి దిగుతాయన్నారు. ఆ తర్వాత ఎన్నికల వ్యయంపై దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు కనీసం 20 వేల సిబ్బంది అవసరమన్నారు. జిల్లాకు త్వరలో 14వేల ఈవీఎంలు రానున్నాయని, వీటిని ఎలా వినియోగించాలనే విషయమై సిబ్బందికి శిక్షణనివ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం నియోజకవర్గానికో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నింటికీ ర్యాంపులు నిర్మిస్తున్నామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, బాత్‌రూముల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సౌకర్యంతో పాటు వెబ్ క్యాస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, డీఆర్‌డీఏ సిబ్బందినీ వినియోగిస్తామన్నారు.
నీటి సమస్య తలెత్తనివ్వం: ఈ వేసవిలో నీటి సమస్య అంత తీవ్రంగా ఉండే ప్రమాదం లేదని కలెక్టర్ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నీటితో కర్నూలు, ఆదోని డివిజన్లలో చాలా వరకు నీటిని నిలువ చేశామన్నారు. గత ఏడాది 90 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశామని, ఈ గ్రామాల పరిస్థితి ఎలా ఉందనే విషయమై నివేదికలు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కోరినట్లు తెలిపారు.
వలసలు తగ్గుముఖం: వలసలు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పనులకు 10వేల మంది మాత్రమే హాజరవగా.. ఈసారి 70వేల మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ నెలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఈ ఏడాది 1000 పైగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నామని వివరిం చారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ప్రతి నెలా గ్రామ జనాభాను బట్టి ఒకరు లేదా ఇద్దరికి 15 రోజుల పనిదినాలను గ్రామాల్లో క్లీనింగ్ కోసం కేటాయిస్తామన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు
Published Wed, Feb 19 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement