కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై ప్రత్యేక నిఘా ఉంచనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ పాల్గొన్నారు. ఆ విశేషాలను గురువారం తన చాంబర్‌లో విలేకరులకు వివరించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే వ్యయ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో వ్యయ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర వాటి గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బ్యాంకర్లకు త్వరలో వేరు వేరుగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థులు రూ.16 లక్షలు, పార్లమెంటు అభ్యర్థులు రూ.40 లక్షలు వరకు మాత్రమే వ్యయం చేసుకోవచ్చని, ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పటి నుంచి కోడ్ అమలులోకి వస్తుందన్నారు. అప్పటి నుంచి వ్యయ నియంత్రణ మొదలవుతుందని చెప్పారు. ఇందుకోసం చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, వివిధ రకాల టీమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు స్పష్టమైన ఆధారాలు చూపెడితేనే విడుదల చేస్తామని తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ నిర్ధారించిందని, దీనిని అదుపు చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చిందన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతి నాలుగైదు నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడిని ఎన్నికల కమిషన్ నియమించనుందని, ఈ విధంగా జిల్లాకు ముగ్గురు వ్యయ పరిశీలకులు రానున్నారని చెప్పారు.
వీరి కింద అసిస్టెంటు వ్యయ పరిశీలకులు ఉంటారని, కోడ్ మొదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానికంగా ఉండి ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తారని తెలిపారు. అభ్యర్థులు వారికున్న రెగ్యులర్ బ్యాంకు ఖాతాల నుంచి గాక, ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఖాతాలు ప్రారంభించి వ్యయాన్ని చూపాలని తెలిపారు. పత్రికలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్, యాడ్స్‌ను నిరంతరం గమనించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
లిక్కర్ గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మద్యం సరఫరాపై నిఘా ఉంచుతామన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదలాయింపుపై దృష్టి పెట్టనున్నామని వివరించారు. గత ఎన్నికల వరకు అభ్యర్థులు రెండు అఫిడవిట్లు ఇచ్చే వారని, ఈ ఎన్నికల్లోఒక అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం నగదు, మద్యం సరఫరాపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ప్రారంభించనున్నామన్నారు. అవసరమైన చోట్ల పోలీసు, రెవెన్యూ అధికారులతో చెక్‌పోస్టులు, పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా
Published Fri, Feb 7 2014 4:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement