కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ‘సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి’ అని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జిల్లా వ్యాప్తంగా నెలరోజులుగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. పోలింగ్ శాతం 85 నుంచి 90 శాతం వరకు పెరుగుతుందని భావిస్తున్నాం. పోలింగ్ రోజున పోల్ రిపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా పోలింగ్ అధికారుల సెల్ నెంబర్లతో అనుసంధానమై గంటగంటకు పోలింగ్ సరళిని తెలుసుకుంటాం. అలాగే ఎన్నికల మానిటరింగ్ కోసం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌ను రిసోర్స్ సెంటర్‌గా వినియోగిస్తున్నాం. పోలింగ్ రోజు పార్లమెంటు అభ్యర్థులకు 9 వాహనాలు, అసెంబ్లీ అభ్యర్థులకు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. వీటిలో కూడా 4 లేదా 5 మంది కంటే ఎక్కువ ఉండరాదు’అని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థుల తరపు ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, ఓటర్లతోపాటు ఈసీ నుంచి అనుమతి ఉన్నవారిని తప్పితే మిగతావారిని పర్మిషన్ ఉండదన్నారు.
255 కేంద్రాలు సమస్యాత్మకం..
జిల్లాలో 35 నుంచి 40 పోలింగ్ కేంద్రాలను మోడల్‌గా ఎంపిక చేశామని, ఇందులో ప్రత్యేక సదుపాయాలుంటాయని కలెక్టర్ తెలిపారు. 255 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించామని, వీటికి ప్రత్యేకంగా లైవ్ వెబ్ క్యాస్టింగ్‌తో పాటు సూక్ష్మ పరిశీలకులు కూడా ఉంటారని తెలిపారు. 321 మంది సూక్ష్మ పరిశీలకులను వినియోగిస్తున్నామని తెలిపారు. 1,658 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు వివరించారు.
320 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించి వీరికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు వినియోగిస్తున్న ఈవీఎంలన్నీ కొత్తవేనని, అందువల్ల మొరాయించే అవకాశం లేదని, మానవ తప్పిదాల వల్ల మొరాయిస్తే తక్షణం పరిష్కరించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు 4,500 మంది పోలీసులు, 14 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఫొటో ఓటరు స్లిప్‌లుంటే ఎలాంటి ఐడీ లేకుండా ఓటు వేయవచ్చని తెలిపారు. స్లిప్‌లు అందనివారు పోలింగ్ కేంద్రంలోని హెల్ప్ డెస్క్ వద్ద పొంది ఓటు వేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
సమరానికి సర్వం సిద్ధం
Published Wed, May 7 2014 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement